సూపర్‌స్టార్ మహేశ్, కియరా అద్వాని జంటగా నటించిన చిత్రం `భరత్ అనే నేను`. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య.డి.వి.వి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేశ్ ఇంటర్వ్యూ….
విదేశీ ట్రిప్ ఎలా సాగింది?
– ట్రిప్ చాలా బాగా అనిపించింది. సాధారణంగా సినిమా సక్సెస్ తర్వాతే ట్రిప్‌కు వెళుతుంటాం. కానీ సినిమా బాగా రావడంతో హ్యాపీగా అనిపించి, సినిమా రిలీజ్‌కు ముందుగానే ఈసారి ట్రిప్ వెళ్లాను. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. నా కెరీర్లో బెస్ట్ ప్రీ రిలీజ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంత ఆనందం ఎప్పుడూ లేదు. సినిమా రిలీజ్‌కు ముందే బ్లాక్‌బస్టర్ రిలీజ్ వైబ్స్‌లో ఉన్నాం. ప్రీ రిలీజ్ బుకింగ్ రెస్పాన్స్ కానీ, ఎక్స్‌పెక్టెషన్స్ అన్నీ ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి.
రాజకీయాలంటే ఆసక్తి లేని మీరు ఈ సబ్జెక్ట్‌ని ఎందుకు సెలక్ట్ చేసుకున్నారు?
– డైరెక్టర్ కొరటాల శివగారిని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆయన నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అదే సమయంలో భయంగా కూడా అనిపించింది. సినిమాలో నేను సీఎం క్యారెక్టర్లో కనపడతానని అన్నారు. నాకు.. రాజకీయాలకు సంబంధం లేదు. అదే సమయంలో అలాంటి పాత్ర చేయడం ఓ బాధ్యతతో కూడుకుంది..గౌరవంగా అనిపించింది. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. అలాగని నేను రాజకీయాల్లోకి వస్తానని కాదు. ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఒక పొలిటికల్ మూవీ చేసి దానితో ఏడాదిన్నర పాటు ట్రావెల్ అయినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. దాని కారణంగా ఇలాంటి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను.
సీఎం పాత్ర కోసం ఏమైనా ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారా?
– సినిమా కోసమంటూ ప్రత్యేకంగా ప్రిపేర్ కాలేదు. శివగారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. ఓ పొలిటికల్ సినిమాకు డైలాగ్స్, స్క్రిప్ట్ రాయడం అంత సులభమైన విషయం కాదు. లాజిక్స్ అన్ని పర్ఫెక్ట్గా, టైట్‌గా ఉండాలి. అదే సమయంలో నా క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చక్కగా డిజైన్ చేశారు. అలాగే పొలిటికల్ సినిమా కాబట్టి ఇందులో డైలాగ్స్ కూడా కష్టమనిపించింది. ఇంత పెద్ద డైలాగ్స్ నా కెరీర్లో ఎప్పుడూ చెప్పలేదు. అయితే శివగారి హెల్ప్‌తో కాన్ఫిడెంట్‌గా పూర్తి చేసేశాను. ఇక పాత్ర పరంగా నేను చేసిన హోం వర్క్ అంటే నా బావ పార్లమెంట్లో మాట్లాడిన రెండు, మూడు వీడియోస్ చూశాను. పాత్ర కోసం ఎవరినీ ఇమిటేట్ చేయలేదు. ఫ్రెష్ అప్రోచ్‌తో సినిమా చేశాం.
ప్రస్తుత రాజకీయాలపై సెటైర్స్ ఉంటాయా?
– అలాంటివేమీ ఉండవు. మేం చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేశాం. అందరూ పొలిటీషియన్స్ సినిమాను చూడొచ్చు. కచ్చితంగా మమ్మల్ని అప్రిసియేట్ చేస్తారు. హానెస్ట్ పొలిటికల్ డ్రామాయే ఈ సినిమా.
ఈ సినిమా తర్వాత రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడిందా?
– అలాంటి దేమీ లేదు. నాకు.. రాజకీయాలకు సంబంధం లేదు. నా ఎంటైర్ లైఫ్ సినిమాలకే.
ఎమోషనల్ పొలిటికల్ మూవీ నుండి ఎలా డిస్కనెక్ట్ అయ్యారు?
– ఇలాంటి ఎమోషనల్ మూవీతో ఏడాదిన్నర పాటు జర్నీ చేయడం వల్ల దాని నుండి డిస్కనెక్ట్ కావడం చాలా కష్టమే. ఈ నెల 5,6 తేదీల్లోనే డబ్బింగ్ పూర్తి చేశాను. సినిమా నుండి డిస్కనెక్ట్ కావడానికే ఫారిన్ ట్రిప్ వెళ్లాను.
సినిమాలో స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుందా?
– తప్పకుండా ఉంటుంది. ప్రతి పౌరుడికి ఓ బాధ్యత ఉండాలి. అలాగే పలు సమస్యలను సినిమాలో చూపించాం. రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. శివగారి సినిమాల్లో మెసేజ్‌లుంటాయి. ఇక పొలిటికల్ మూవీ అంటే చెప్పాలా.. చాలా మెసేజ్‌లుంటాయి. ఈ మెసేజ్‌లు పర్టికులర్‌గా వీళ్లకి అని ఉండదు. ఎవరిపైన సెటైర్స్ ఉండవు. నిజాయతీతో కూడిన ప్రయత్నం. మంచి జెన్యూన్ పొలిటికల్ ఫిలిం వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుంది.
సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా?
– ఉన్నాయండీ.. శివగారు కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్‌ను అసలు విడిచిపెట్టరు. పొలిటికల్ మూవీలో సీఎం ఎలా ఫైట్ చేస్తాడు? ఎలా డాన్స్ చేస్తాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాల దత్తత అనే పాయింట్‌కు చాలా మంది కనెక్ట్ అయ్యారు. మరి ‘భరత్ అనే నేనులి ఎలాంటి ఎలిమెంట్‌కు కనెక్ట్ అవుతారు?
– సాధారణంగా ప్రజలకు రాజకీయాలంటే చాలా ఆసక్తి ఉంటుంది. రాజకీయాల్లో ప్రజల బాధ్యత ఏంటనే పాయింట్‌కు అందరూ బాగా కనెక్ట్ అవుతారు.
సీఎం పాత్రలో నటించిన తర్వాత మీకెమనిపించింది?
– ముఖ్యమంత్రి పదవి అనేది ఓ బాధ్యత అని అర్థమైంది. సీఎం పదవిని నిర్వర్తించడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి ఓ గొప్ప పాత్రను నేను చేయడం గౌరవంగా భావిస్తున్నాను.
మీ పిల్లలలు భరత్ అనే నేను.. ప్రతిజ్ఞను చెబుతున్నారా?
– ఇంతకు ముందు చెప్పినట్లు పొలిటికల్ డైలాగ్స్ చెప్పడం చాలా కష్టమండి. ఓత్ చెప్పడం లేదు కానీ.. పాటలు పాడుతున్నారు.
ఈ సినిమాతో హిట్ కొట్టాలనే ఒత్తిడి ఏమైనా ఉందా?
– ప్రతి సినిమాకు ఒత్తిడి ఉంటుంది. ఏ సినిమా చేసినా సూపర్‌హిట్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తాం. అయితే నా కెరీర్లోనే ఇంత ప్రీ రిలీజ్ ఫేజ్ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. టీం అంతా చాలా హ్యాపగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. శివగారు ఐదు గంటల పాటు సబ్జెక్ట్ చెప్పారు. ఫస్టాఫ్ ఒకరోజు, సెకండాఫ్ ఒకరోజు చెప్పారు. ప్రతి సీన్ ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. చాలా సీన్స్ ఇప్పుడు లేవు. బాధగా ఉంది. రెండు పార్టులుగా తీసుంటే బావుండేదనిపించింది. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే సీఎం పాత్రలో కనపడతాను.
మీ అమ్మగారి పుట్టినరోజున సినిమా విడుదల కావడం ఎలా అనిపిస్తుంది?
– చాలా సంతోషంగా ఉంది. నిజానికి సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేద్దామని అనుకున్నాం. తర్వాత మేము, నా పేరు సూర్య సినిమా నిర్మాతలు మాట్లాడుకుని మేం ఏప్రిల్ 20.. వాళ్లు మే 4న రావాలని అనుకున్నాం. సినిమా ప్రీ పోన్ అయ్యింది. అప్పటికీ కూడా నాకు ఐడియా రాలేదు. అయితే మా అక్క మంజుల ఏప్రిల్ 20న మా అమ్మగారి పుట్టినరోజు అని చెప్పారు. వినగానే ఆనందమేసింది. అంతకంటే మంచి రోజు లేదనిపించింది. సినిమా ప్రీ పోన్ కావడం బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను.