‘రోగ్’ మూవీ రివ్యూ

0
401

కథ :

పోలీస్ కమీషనర్ చెల్లెలు అయిన అంజలి (ఏంజెలా) ని చంటి (ఇషాన్) గాఢంగా ప్రేమిస్తాడు. అంజలి కూడా చంటి ని ప్రేమిస్తుంది. మరో పోలీస్ అధికారితో పెళ్ళి నిశ్చయమయ్యాక అంజలి చంటి ని వదిలేస్తుంది. నిశ్చితార్ధం రోజున వెళ్లి గొడవ పడిన చంటి ని జైలు లో వేస్తారు. అంజలి చేసిన మోసానికి ఆడవాళ్ళంటేనే అసహ్యం పెంచుకుంటాడు చంటి. జైలు నుండి బయటకి వచ్చాక నిశ్చితార్ధం రోజున తాను చేసిన గొడవ వళ్ళ ఒక కానిస్టేబుల్ (సత్య) కి రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయని తెలుసుకున్న చంటి ఆ కుటుంబానికి అండగా ఉండాలనుకుంటాడు. ఇందు కోసం రకరకాల పనులు చేస్తూ వాళ్ళ అప్పు తీర్చి ఆ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇది చూసిన ఆ కానిస్టేబుల్ చెల్లి అంజలి (మన్నారా చోప్రా) చంటి ని ప్రేమిస్తుంది. మొదట్లో తన ప్రేమని ఒప్పుకోకపోయినా పోను పోను చంటి కూడా అంజలి ని ఇష్టపడతాడు. అంతా సవ్యంగా వెళ్తుతుండగా జైలు నుండి పారిపోయిన సైకో (ఠాకూర్ అనూప్ సింగ్) తానూ జైలు కి వెళ్ళడానికి కారణమైన అంజలి (మన్నారా చోప్రా) మీద పగ తీర్చుకోవాలని తనని వెంబడిస్తుంటాడు. సైకో నుండి చంటి అంజలి ని ఎలా కాపాడుకున్నాడనేదే కథ.

నటన :

ఈ చిత్రం తో ఇషాన్ హీరోగా పరిచయం అయ్యారు. స్వతహాగా అందగాడైన ఇషాన్ నటన పరంగా కూడా ఆకట్టుకున్నారు. మొదటి సినిమానే అయినా అనుభవం ఉన్న వాడిలా చాల కాన్ఫిడెంట్ గా కనిపించారు. పూరి జగన్నాధ్ హీరో అంటేనే ఎంతో ఎనర్జీ తో అగ్రెస్సివ్ గా ఉంటారు. ఇషాన్ కూడా ఇందులో అందుకు తగ్గట్టే సరిపోయి మెప్పించారు. పూరి చెప్పినట్టు భవిష్యత్తు లో మంచి స్టార్ గా ఎదిగే లక్షణాలు ఇషాన్ లో పుష్కలంగా కనిపించాయి.

ఇద్దరు హీరోయిన్ ల లో మన్నారా చోప్రా ముఖ్య పాత్రలో కనిపిస్తారు. చూడటానికి బాగుండడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా మన్నారా ఆకట్టుకున్నారు. ఇక రెండో హీరోయిన్ గా చేసిన ఏంజెలా గ్లామర్ షో గురించి తప్ప చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదు. సైకో గా చేసిన అనూప్ సింగ్ ఆకట్టుకుంటారు. ధృడమైన శరీరంతో విచిత్రంగా ప్రవర్తించే పాత్రలో అనూప్ గుర్తుండిపోతారు. ఇతర పాత్రల్లో అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బా రాజు, సత్య తమ పరిధి మేర చేశారు.

బలాలు :

పూరి మార్క్ డైలాగులు, పాత్రలు
ఇషాన్
ఫస్ట్ హాఫ్
కెమెరా పనితనం
నిర్మాణ విలువలు

బలహీనతలు :

సెకండ్ హాఫ్
చెప్పుకోదగ్గ కథ లేకపోవడం

విశ్లేషణ :

విలక్షణమైన హీరో పాత్ర చిత్రణ లో ఆరితేరిన పూరి జగన్నాధ్ ‘రోగ్’ తో ఇషాన్ ని హీరో గా పరిచయం చేశారు. మొదటి ఫ్రేమ్ నుండే ఇషాన్ ఆకట్టుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్ పూరి మార్కు డైలాగులతో సరదాగా సాగిపోతుంది. ప్రేమలో మోసం చేసే అమ్మాయిల మీద వేసిన సెటైర్లు బాగా పేలాయి. తన వల్ల నష్టపోయిన కుటుంబానికి హీరో అండగా నిలబడాలనుకోవడం అందుకు వాళ్ళు ఒప్పుకోకపోయినా బలవంతంగా సాయం చేయడం వంటి పూరి మార్కు సన్నివేశాలు, డైలాగులతో ‘రోగ్’ ఫస్ట్ హాఫ్ అలరిస్తుంది. సైకో గా అనూప్ సింగ్ ఎంటర్ అవడం తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక ఇక్కడి నుండి ‘రోగ్’ గా పిలవబడే హీరో కి సైకో అయిన విలన్ కి మధ్యనే సినిమా అంతా నడుస్తుంది. రెండు విచిత్రమైన పాత్రల మధ్య పోరు అనగానే అదీ పూరి లాంటి దర్శకుడి సినిమాలో అనగానే ప్రేక్షకుడు విలక్షణమైన సన్నివేశాలని ఆశిస్తాడు. కానీ సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం కాస్త నిరాశ పరుస్తుంది. కానీ పూరి తనదైన శైలిలో వేగవంతమైన కథనం, కన్నులవిందైన పాటల తో ఆ లోటుని కొంత వరకు పూరించారు. సెకండ్ హాఫ్ మీద మరింత శ్రద్ధ పెట్టుంటే బావుండేది.

ముఖేష్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్ లో ఒకటి. కొలకత్తా ని, అందులోని గల్లీలని అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ లో హౌరా బ్రిడ్జి మరింత అందంగా కనబడుతుంది. సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. నేపధ్య సంగీతంలో హీరో కి విలన్ కి ఇచ్చిన థీమ్స్ ఆకట్టుకుంటాయి. జానీ షేక్  ఫైట్స్ బాగున్నాయి. నిర్మాతలు సిఆర్ మనోహర్, సిఆర్ గోపి లు పెట్టిన ఖర్చు తెర మీద కనిపిస్తోంది. మంచి క్వాలిటీ తో ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన సినిమా విజువల్స్ పరంగా చాలా బాగుంది. ఇమేజ్ పరంగా హీరో గా ఇషాన్ కి పూరి మంచి ఆరంభాన్నిచ్చారు.

బాటమ్-లైన్ : పూరి ‘రోగ్’ గా ఆకట్టుకునే ఇషాన్
రేటింగ్ : 3 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here