‘ఘాజి’ రివ్యూ

0
424

కథ :

1971 లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బాంగ్లాదేశ్) అంతర్యుద్ధం జరిగే కాలంలో దాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ తమ సైన్యానికి ఆయుధ సామాగ్రి పంపాలనుకుంటుంది. కానీ భారత భూ, వాయు మార్గం గూండా ప్రయాణించలేరు కనుక సముద్ర మార్గాన్ని ఎంచుకుంటారు. అరేబియా సముద్రం నుండి హిందూ మహా సముద్రం గూండా బంగాళాఖాతం లోకి ప్రవేశించాలని పథకం వేస్తారు. కానీ విశాఖపట్నం సమీపంలో బంగాళాఖాతం తీరాన్ని గస్తీ కాసే యుద్ధ నౌక , ఐఎన్ఎస్ విక్రాంత్ ని దాటి వెళ్లడం అసాధ్యం అని తెలుసుకున్న పాక్ నౌకాసేన విక్రాంత్ ని పేల్చి వేయడమో లేదా విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడమో చేయాలనే పథకం వేస్తారు. ఇందు కోసం తమ దళంలో ని అత్యంత పెద్ద, సామర్ధ్యం ఉన్న జలాంతర్గామి ‘ఘాజి’ ని పంపిస్తారు. ఈ పథకం గురించి సమాచారం అందుకున్న భారత నావి, ‘ఘాజి’ గురించిన సమాచారాన్ని తెలుసుకోమని అర్జున్ (రానా) , రణ్వీర్ సింగ్ (కేకే మీనన్) సారధ్యంలో ‘s -21’ జలాంతర్గామి ని పంపిస్తారు. ‘s -21’ తో ‘ఘాజి’ ని ఎలా అడ్డుకున్నారు అన్నదే సినిమా.

నటన :

ఆర్మీ లో ఉన్న వాళ్ళు నియమానుసారం నడుచుకోవాలని అందుకు అవసరమైతే పై అధికారిని సైతం ఎదిరించే పాత్రలో రానా మెప్పిస్తారు. గంభీరమైన వాయిస్. ధృడంగా కనిపించే రానా నేవీ కమాండర్ పాత్రకి అతికినట్టు సరిపోయారు. తన పై అధికారి అయిన రణ్వీర్ సింగ్ ని ఎదిరించే సన్నివేశాల్లో , పతాక సన్నివేశాల్లో రానా అభినయం ఆకట్టుకుంటుంది.

రణ్వీర్ సింగ్ పాత్రలో కేకే మీనన్ అద్భుతంగా అభినయించారు. ‘శత్రువు ఉన్నాడని తెలిసినప్పుడు శత్రువుని లేకుండా చేసే వాడే సైనికుడు’ అనే సిద్ధాంతంతో నడుచుకునే అధికారి పాత్రలో కేకే మీనన్ సినిమాకి హైలైట్స్ లో ఒకరిగా నిలుస్తారు. అతుల్ కులకర్ణి, సత్య దేవ్, రవి వర్మ, భరత్ ఇతర పాత్రల్లో సరిగ్గా సరిపోయారు. వలసదారుగా తాప్సి అతిధి పాత్రలో కనిపిస్తారు . కథకి తగ్గ కాస్టింగ్ ఈ సినిమాకి మరో హైలైట్.

బలాలు :

అర్జున్, రణ్వీర్ సింగ్ మధ్య సన్నివేశాలు
ద్వితీయార్ధం లో యుద్ధ వ్యూహాలు
సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నిర్మాణ విలువలు

బలహీనతలు :

ద్వితీయార్ధంలో కాసేపు ఒకే రకమైన సన్నివేశాలు

విశ్లేషణ :

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ‘ఘాజి’ మొదటినుండి కథ మీద ఆసక్తి కలిగిస్తుంది. ఎం జరుగుతోంది, ఎం చేయాలి అన్నది క్లుప్తంగా చెప్పేసాక ఇక జలాంతర్గామి సముద్రంలోకి వెళ్లడంతో అసలు కథలోకి వెళ్తాం. మొదటి అర్ధ భాగం పై అధికారి రణ్వీర్ సింగ్ తో అర్జున్ కి జరిగే సంఘర్షణ మీద నడుస్తుంది. ఒక పక్క ‘ఘాజి’ వెతుకులాట మరో పక్కన ఇద్దరు అధికారుల మధ్య డ్రామా తో సినిమా ఆసక్తి కరంగా సాగిపోతుంది.

ద్వితీయార్ధం కి వచ్చే సరికి సముద్ర గర్భంలో ఇరు దేశాల జలాంతర్గాముల మధ్య ప్రత్యక్ష పోరు మొదలవుతుంది. ఈ సమయంలో వేసే వ్యూహాలు, పైఎత్తులతో చివరి వరకు ఉత్కంఠత తో సాగిపోతుంది. దేశ భక్తి అంశాలు తోడవడం మరింత సినిమాని మరింత రక్తి కట్టించింది. మొదటి ప్రయత్నంలోనే వినూత్న ప్రయోగంతో దర్శకుడు సంకల్ప్ ఆకట్టుకున్నారు. జలాంతర్గామి సెట్ కానీ, యుద్ధంలో అనుసరించిన వ్యూహంలో కానీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూపించడంలో దర్శకుడికి ఉన్న క్లారిటీ, పరిశోధన కనిపిస్తాయి. టెక్నికల్ గా కూడా సినిమా ఉన్నతంగా ఉంది. ఇందుకు మధి కెమెరా పనితనం ఆర్ట్ డైరెక్టర్ కళా నైపుణ్యం ఎంతో దోహదం చేసాయి. సముద్రగర్భంలో ని సన్నివేశాల్లో గ్రాఫిక్ పనితనం ఆకట్టుకుంటుంది . ప్రయోగాత్మకమైన సినిమా ని నూతన దర్శకుడైనా నమ్మి ఇంత మంచి నిర్మాణ విలువలతో నిర్మించిన పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అభినందనీయులు.

అబ్బురపరిచే సముద్ర యుద్ధం

రేటింగ్ : 3.5 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here