సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు
* ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది
* దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు
* తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం
* సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు
* శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం
* రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు.
రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ “ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం.

పలు విషయాలపై చర్చించేవారు
కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను. వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది.
శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన “ఈనాడు” గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.

సమాజంపై ఎంతో బాధ్యత ఉంది
శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు.

వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి.
ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను.
ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు, పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు.

పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది
ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా. మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం…మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను” అన్నారు.




