కావలసినదల్లా శ్రీహరి లాంటి విజేతలకుండే ఆత్మవిశ్వాసం, కసి, కృషి – దేవీప్రసాద్
1992 లో అనుకుంటాను ఓరోజు “రాజధాని”అనే సినిమా షూటింగ్ ఓ రిచ్ బిల్డింగ్ లో జరుగుతుంది. నేను అసోసియేట్ డైరెక్టర్.
అప్పటికింకా చిన్న నటుడైన శ్రీహరి ఓ స్టూడెంట్‌లీడర్ పాత్రలో నటిస్తున్నారు.ఎప్పుడూ నన్నొక తమ్ముడిలా ప్రేమగా చూసేవాడు.
ఆ రిచ్ బిల్డింగ్‌ని తేరిపార చూస్తూ… “జీవితంలో ఎప్పటికైనా ఎలాగైనా ఇంత పెద్ద ఇల్లు కొనితీరాలి” అని పిడికిలి బిగించి మరీ కసిగా అన్నాడు.ఆ సంఘటన నిన్నమొన్న జరిగినట్లుగా నాకింకా గుర్తుంది.
కొన్నాళ్ళ తర్వాత తాను మొదటిసారి కొన్న డబుల్‌బెడ్ రూమ్ ఫ్లాట్ ని చూపించి సంబరపడ్డాడు.
ఆ తర్వాత పది సంవత్సరాల లోపే తాను హీరో స్థాయికి ఎదిగి ఓ పెద్ద ఇల్లు కొన్నాడు.
గృహప్రవేశానికి కృష్ణగారు, విజయనిర్మల గారితోసహా పెద్దలెందరోవచ్చి ఆశీర్వదించారాయన్ని.
నా అభిమాన హీరో “సూపర్‌స్టార్” చేతిలో ప్లేట్ పట్టుకుని నిలబడే భోజనం చేస్తుంటే నేను కూడా పక్కనే నిలబడి భోజనం చేశాను.
అందరూ వెళ్ళాక “రాజధాని” సినిమా షూటింగ్‌లో తాను అన్న మాటలను శ్రీహరికి గుర్తు చేశాను. తన కంటిలో చిన్న నీటి తెర కనపడింది. నవ్వుతూ నా భుజం గట్టిగా నొక్కాడు.
ఇప్పుడంటే ఆ ఇంటి ముందు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆ ఇంటి అందాన్ని మూసేసిందిగానీ అప్పట్లో రాత్రి పూట ఆ ఇంటి ముందు లాన్‌లో కూర్చుంటే చుక్కలు నిండిన విశాలమైన ఆకాశం కనిపిస్తూ చల్లటిగాలులతో ఆహ్లాదకరంగా ఉండేది. తరచూ మిత్రులతో పార్టీలు జరుగుతుండేవి.

ఓ రాత్రి అలా కూర్చున్నప్పుడు నల్లటి ఆకాశంలో సర్రున ఓ తోక చుక్క రాలటం చూసి అటు చూడండి అని అరిచాడు శ్రీహరి.
చూశాము.
తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన చెప్పాడు.
“నా చిన్న తనంలో సరిగ్గా తోకచుక్క రాలే సమయంలో ఏమైనా కోరుకుంటే జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. నేను జిమ్నాస్టిక్స్‌లో గొప్ప స్థాయికి వెళ్ళాలనుకునేవాడిని. ఓరోజు సడెన్‌గా తోకచుక్క రాలటం కనిపించింది. ఎందుకో తెలియదుగానీ ఆ క్షణంలో నేను సినిమా హీరో అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు అయ్యాను” అని నవ్వాడు.
నాకటువంటి అద్భుతాల మీద విశ్వాసం లేదుగానీ బలమైన కోరికకు ఉండే సంకల్పశక్తి వల్లనే తన ఆశలు నెరవేరాయని నమ్ముతాను.
మరోసారి అదే ఇంట్లో శ్రీహరి,పోసానికృష్ణమురళి,నేను కూర్చుని ఉన్నప్పుడు ఎవరో ప్రముఖ వ్యక్తి చనిపోయిన వార్త ఫోటోతో న్యూస్‌పేపర్ మొదటి పేజ్‌లో చూసి “చావంటే ఇట్లా ఉండాలి.మనం పోయినప్పుడు ఆ న్యూస్ ఇట్లా ఫ్రంట్ పేజ్‌లో రావాలి.అదే లైఫ్ ఎచీవ్‌మెంట్ అన్నాడు” శ్రీహరి. “ఇప్పుడు చావులగురించెందుకు మన కధ గురించి మాట్లాడుకుందాం”అన్నాడు పోసాని.
మధ్యాహ్నమే అస్తమించిన సూర్యుడిలా అర్ధాంతరంగా శ్రీహరి మరణించినప్పుడు తాను కోరుకున్నట్లే ఆ న్యూస్ ఫ్రెంట్ పేజీల్లోనే రావటం చూసి నాకు కన్నీళ్ళొచ్చాయి.
నేనుకూడా అసిస్టెంట్ డైరెక్టర్‌ని కాబట్టేమో నేనే షూట్‌కి వెళ్ళినా దర్శకత్వ శాఖలో పని చేసేవాళ్ళను గమనించటం అలవాటు.
అందులో కొందరు భవిష్యత్‌లో కాబోయే గొప్ప దర్శకులుగా కనిపిస్తారు నాకు.
కానీ ప్రస్తుతం వాళ్ళు పడే కష్టాలు, అయినవాళ్ళనుండి ఎదురవుతున్న అవమానాలను ఏకరువు పెట్టినప్పుడు వాళ్ళతో ఇలా చెప్పాలనిపిస్తుంది.
సినిమా పరిశ్రమలో ఉన్నతికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సైనికులవంటివారే.
శిక్షణ కాలంలో చెమటను చిందించిన సైనికుడికి రేపటి యుద్ధంలో రక్తాన్ని చిందించాల్సిన అవసరముండదు.
సినిమావనంలో మిమ్మల్ని మీరే పాతుకున్న విత్తనాలు మీరు. వెక్కిరించేవాళ్ళకు అవమానించేవాళ్ళకు ఇప్పుడు కనిపించరు.
కానీ మొక్కల్లా మొలిచి ఒకనాటికి వాళ్ళు తలెత్తి చూడాల్సినంత మహావృక్షాలవుతారు మీరు.
మీరిప్పుడు హేళనలకు గురయ్యే గొంగళిపురుగులు కావచ్చు. కానీ ఒకనాటికి వాళ్ళు అందుకోవాలని చూసినా అందని సీతాకోకచిలుకలై సినీవినీలాకాశంలో విహరిస్తారు.
కావలసినదల్లా శ్రీహరి లాంటి విజేతలకుండే ఆత్మవిశ్వాసం,కసి,కృషి.
__ దేవీప్రసాద్.



