మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ లో వస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. ఫిబ్రవరి 12న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్‌తేజ్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు..
చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనే అనుకున్నారా ?
– అస్సలు కాదండి. చాలా ఏళ్ళు నా కెరీర్ ఏంటనేది అర్థం కాలేదు. రకరకాల ఆలోచనలతో ముందుకు సాగాను. చదువుకునే రోజుల్లో ఆస్ట్రోనాట్ అవ్వాలని, తర్వాత ఫోటోగ్రఫీ, త్రీడీ యానిమేషన్ నేర్చుకోవాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలనుకుని బరువు తగ్గడం మొదలుపెట్టాను. కానీ డెస్టిని నన్ను సినిమా వైపుకు నడిపించింది. ఆ టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫోటో పోస్ట్ చేశాను. అది చూసి రెండు మూడు ఆఫర్స్ వచ్చాయి. కానీ ఎవరూ కథతో అప్రోచ్ అవ్వలేదు. కాని బుచ్చిగారు ప్రాపర్ స్క్రిప్ట్ తో వచ్చి ఫుల్ నెరేషన్ ఇచ్చారు. కథ వినగానే బాగా నచ్చింది. తర్వాత పెద్ద మావయ్య కూడా కథ విని ఒకసారి ప్రయత్నించి చూడు నీవల్ల అవ్వకపోతే వదిలేయ్. కానీ వచ్చిన అవకాశాన్ని గౌరవించు అన్నారు. ఆ మాట నా మైండ్ లో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయ్యింది. ఉప్పెన సినిమా చేయడానికి మెయిన్ రీజన్ చిరు మావయ్యే. ఆయన ప్రొత్సాహంతోనే అలా సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.
మీరు జానీ, శంకర్‌దాదా సినిమాల్లో నటించారు కదా..?
– చిన్నప్పుడు పవన్ మావయ్య సినిమాలో చేస్తావా ? అని అడిగి చేస్తే బొమ్మలు కొనిస్తా అని అన్నారు. కేవలం బొమ్మల కోసమే ‘జానీ’ సినిమాలో చిన్న రోల్ చేశా. షూట్ అయ్యాక మావయ్య నాకు చాలా బొమ్మలు కొనిచ్చారు కూడా. తర్వాత పెద్ద మావయ్య శంకర్ దాదా MBBS సినిమాలో వీల్ చెయిర్ లో కూర్చునే అబ్బాయి పాత్ర చేశాను. అప్పుడు నాకు సినిమా గురించి పెద్దగా ఏమి తెలియదు. కేవలం మావయ్యలు చెప్పిన మాట విని ఆ రోల్స్ చేశా.
ఈ కథలో మిమ్మల్ని బాగా ఎట్రాక్ట్ చేసిన అంశమేంటి?
– ఈ కథ వింటున్నప్పుడే అద్భుతంగా అనిపించింది. ఈ కథ నా వద్దకు వచ్చినప్పుడు ఇంత గొప్ప సినిమా అవుతుందని తెలీదేమో కాని ఒక మంచి సినిమా అవుతుందని ఖచ్చితంగా తెలుసు. ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు నాకు చాలా సహాయపడ్డారు. ముఖ్యంగా చిరంజీవి మామయ్య కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే తప్పకుండా అది నాకు పర్ఫెక్ట్ డెబ్యూ మూవీ అవుతుందని అనుకున్నాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
– ఈ సినిమాలో నేను ఒక జాలరిగా కనిపిస్తాను. నేను పరిశ్రమలోకి రావడానికి ముందు నటనలో శిక్షణ తీసుకున్నాను. నా పాత్ర, నా బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకొవడానికి చాలా ప్రాక్టీస్ చేశాను. 40 రోజులు వర్క్‌షాప్‌లు కూడా జరిగాయి.కానీ ప్రీ-ప్రొడక్షన్ కంటే సెట్స్‌పైనే ఎక్కువ నేర్చుకున్నాను.
ఫస్ట్మూవీకే ఇంత ఎంకరేజ్మెంట్ లభించడం..?
– నా మొదటి సినిమాకి ఇంత పెద్ద సపోర్ట్ లభిస్తుందని గానీ ఈ రేంజ్ఎంకరేజ్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. మొదటి సినిమానేమైత్రి లాంటి పెద్ద బేనర్ లో చేయడం , సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ ఉండటం , వెర్సటైల్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, దేవి మ్యూజిక్ వీటన్నింటికి తోడు ఒక మంచి కథ దొరకడం నా అదృష్టం అనుకుంటున్నా.
విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసకుకోవడం ఎలా అన్పించింది?
– ‘ఉప్పెన’లో దర్శకుడు బచ్చిబాబుగారు విలన్ గా విజయ్ సేతుపతి గారిని అనుకుంటున్నాం అని ఆయన దగ్గరకి వెళ్లారు. ముందు డేట్స్ ఖాళీగా లేవని కానీ సుకుమార్ గారి మీద రెస్పెక్ట్ తో కథ మాత్రం వింటానని చెప్పారు. బుచ్చి గారు వెళ్లి కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తున్నా అని చెప్పి తన డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ సినిమాకోసం రాత్రి పగలు వర్క్ చేశారు. ఆయన చాలా డౌన్‌టుఎర్త్ పర్సన్. ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నటుడిగా ఎదగటానికి కావాల్సిన టిప్స్ ఇచ్చారు. షూట్ చివరి రోజు మా టీమ్ అందరికీ డిన్నర్ కూడా అరేంజ్ చేశారు.
హీరోయిన్ కృతిశెట్టి గురించి?
– కృతిశెట్టి చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్. సీన్ అయ్యాక కూడా ఆ పాత్రలో ఉన్నట్టు ఉండేది. తన రోల్ ని చాలా సిన్సియర్ గా చేసింది. రిలీజ్ తర్వాత తనకి చాలా మంచి పేరొస్తుంది.
సినిమా చూసిన తర్వాత మీ మామయ్యల స్పందన..?
– ఈ చిత్రంలో నా నటన గురించి ఆయన ఏమంటాడో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. ఆయన సినిమా చూసిన క్షణం, “సూపర్ గా చేశావ్ రా’ అన్నారు. అది నా జీవితంలో నాకు దక్కిన ఉత్తమ అభినందన. ఆయనకి సినిమా నచ్చింది కాబట్టి, ప్రేక్షకులు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందని నా అభిప్రాయం. పవన్ మావయ్య ఇంకా సినిమా చూడలేదు. రీసెంట్ గా ట్రైలర్ చూసి అందరి వర్క్ గురించి మాట్లాడారు. అందరినీ మెచ్చుకొని ట్రైలర్ బాగుంది ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకుంటాయి.
దర్శకుడు బుచ్చి బాబు గురించి?
– ఆయన నాకు ఒక గురువు, స్నేహితుడు, సోదరుడు. నేను ఉత్తమమైన రీతిలో నటించేలా చాల జాగ్రత్తలు తీసుకున్నారు. బుచ్చి గారు మంచి రైటర్. ఈ సినిమాతో ఆయనకి దర్శకుడిగా ఎంత పేరు వస్తుందో అంట కంటే రైటర్ గా ఇంకా ఎక్కువ పేరొస్తుంది. తను నమ్మిన కథను చాలా గొప్పగా తీసి నన్ను హీరోగా మార్చారు.
* ఉప్పెన మన మట్టి కథ. మంచి ప్రేమకథతో పాటు స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది.సినిమా చూసి అందరూ మంచి సినిమా చూశామని కచ్చితంగా ఫీలవుతారు. ఇప్పుడు కథ గురించి చెప్పలేను కానీ రిలీజ్ తర్వాత ఇది ఎంత గొప్ప కథో అందరికి తెలుస్తుంది.
క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మరో ప్రాజెక్ట్ త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నాను మేకర్స్. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా..



