మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికయ్యారు. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా డా. రాజశేఖర్, ‘మా’ ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్ గెలుపొందారు. ఈ ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సి.లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, రెబల్‌స్టార్ కృష్ణంరాజు దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , గాయని రావు బాలసరస్వతి, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ – ”మా’ అంటే నాది, నేను అనుకుని ఒకేతల్లి బిడ్డల్లా పని చేసి ‘మా’కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను, కృష్ణగారు కలిసి మద్రాసులో స్థాపించి, ఇరవై అయిదు సంవత్సరాలు ‘మా’ కార్యక్రమాలు జరిపాం. షూటింగ్లో వచ్చే ఎన్నో గొడవలు, సమస్యలు పరిష్కరించాం. అలాగే అందరూ కలిసి పని చేసి ‘మా’కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ – ”మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. రాబోయే రోజుల్లో ‘మా’ ఇంకా ఎదగాలి. ఇండస్ట్రీ పెద్దల సహకారం ‘మా’కు ఉండాలని కోరుకుంటున్నాను. నరేష్‌ను, నన్ను, మా ఇద్దరినీ పరిచయం చేసిన సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలగార్ల ముందు సత్కారం అందుకోవడం చాలా సంతోషంగా వుంది” అన్నారు.
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ”మా’కు సంబంధించిన కార్యక్రమానికి హాజరవడం నాకు చాలా హ్యాపీగా వుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అందరూ కలిసి కట్టుగా పని చేసి, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, ఇబ్బందులో ఉన్నవారికి సహకరించి ‘మా’ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఏ అవసరమున్నా నా వంతు సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను” అన్నారు.
నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ – ”మా’కు ఇంతటి గౌరవాన్ని అందించడం మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏమిటంటే తెలుగు ఆర్టిస్ట్‌లకి, వారి అర్హతలకి తగ్గట్లుగా పనిని కల్పించేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ – ”వేదికనలంకరించి నా జీవితానికి రెండు చక్రాలుగా నిలబడి ముందుకు తీసుకెళ్తున్న పుణ్యదంపతులు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలగారికి, నన్ను ఇంతటి వాణ్ణి చేసిన జంధ్యాల, దాసరిగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ‘మా’ స్నేహపూర్వక మార్పుకోసం ఒక పిలుపు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మెగాస్టార్ చిరంజీవిగారు స్థాపించి, కృష్ణ, మురళీమోహన్ తదితరులు పని చేసిన ప్రతి టర్మ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ‘మా’ పరువు, ప్రతిష్టలకు భంగంవాటిల్లకుండా పని చేస్తాం అని తెలియజేస్తున్నాం. ప్రతి ‘మా’ మెంబర్ చిరునవ్వుతో ముందుకు వెళ్ళేలా జాగ్రత్తలు తీసుకుంటాం. మేం తీసుకునే కార్యక్రమాలు చురుగ్గా, నిర్మాణాత్మకంగా పని చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ‘మా’ సభ్యత్వాన్ని పదివేలకి తగ్గించి తొంభై వేలకి, ‘మా’ గోల్డ్ కార్డ్ ఇరవై అయిదు వేలకి అందిస్తాం” అన్నారు.
‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డా. రాజశేఖర్ మాట్లాడుతూ – ”అందరం కలిసి పని చేస్తాం. ‘మా’ అన్ని ఆశయాలు నెరవేరుస్తాం అని తెలియజేస్తున్నా. నేను విజయం సాధించడానికి ఎంతో సహకరించిన జీవిత, మా పిల్లల సహకారాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. అందరం కల్సి ముందుకెళ్ళి ‘మా’కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పని చేస్తాం” అన్నారు.
‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ – ”అందరం ఒకే ఫ్యామిలీలా కలిసి పని చేస్తాం. ప్రతి ఫంక్షన్‌కి అందరూ హాజరయ్యేలా చూసుకొని అందరం కలిసి పని చేసి, ‘మా’ గౌరవాన్ని పెంచుతామని తెలియజేస్తున్నా” అన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – ”ఇప్పటివరకు సినిమా పాటలు ఎన్ని చేసినా ‘మా’ థీమ్ సాంగ్ చేయడం చాలా స్పెషల్‌గా అన్పించింది. ఈ అవకాశం ఇచ్చిన నరేష్, రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌గారికి కృతజ్ఞతలు. పాటని అద్భుతంగా పాడిన బాలసుబ్రహ్మణ్యంగారికి నా ధన్యవాదాలు” అన్నారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ”సూపర్‌స్టార్ కృష్ణగారికి, అమ్మ విజయనిర్మలగారికి, కృష్ణంరాజు, రావు బాలసరస్వతిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫస్ట్ నేను ‘మా’ ప్రెసిడెంట్ కాగానే ఏదైనా మంచి పని చేయమని 2 లక్షలు చెక్ ఇచ్చిన సుమగారికి నా ధన్యవాదాలు. నూతనంగా ఎన్నికైన కమిటీ అద్భుతాలు చేయాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. సభ్యులందరూ కష్టపడి పని చేసి ‘మా’కు మంచి పేరు తీసుకురావాలి. ఎప్పుడు ఏ అవసరమున్నా అందుబాటులో ఉంటానని మనవి చేస్తున్నా” అన్నారు.
ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షులు ఎస్.వి. కృష్ణారెడ్డి, హేమ, ‘మా’ కోశాధికారిగా రాజీవ్ కనకాల, ‘మా’ సంయుక్త కార్యదర్శిగా గౌతమ్ రాజు, శివ బాలాజీలతో పాటు గెలుపొందిన ఇ.సి. మెంబర్స్ చేత ఎలక్షన్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
http://industryhit.com/t/2019/03/maa-oath-ceremony-pics/


