మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఫూలే దంపతులు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం : నటుడు ప్రతీక్ గాంధీ
ప్రతి మహిళా తప్పక చూడాల్సిన చిత్రమిది: నిర్మాత డా. పొన్నం రవిచంద్ర
సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే. మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన మహోన్నత పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన చిత్రమే ‘ఫూలే’. ప్రముఖ దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే హిందీలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ వెర్షన్లో నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సుపదా క్రియేషన్స్ బ్యానర్‌పై డా. పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని నిర్మించగా, ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మించింది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు వెర్షన్‌కు చేతన్ కత్తి సంభాషణలు అందించగా, ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. నవంబర్ 28, 2026న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితం, ఆశయాలు, సమాజం కోసం చేసిన పోరాటాన్ని మరింతమందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గురువారం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు ప్రతీక్ గాంధీ హాజరయ్యారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, మాజీ సెన్సార్ బోర్డు సభ్యుడు సురేష్ లాల్, నిర్మాత మధుర శ్రీధర్, నటుడు రచ్చ రవి, ఐఏఎస్ అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులంతా ‘ఫూలే’ చిత్రాన్ని అభినందిస్తూ, ఇది ప్రతి ఒక్కరిలోనూ సామాజిక చైతన్యాన్ని నింపే చిత్రమని, తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
నటుడు ప్రతీక్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఇంతటి ముఖ్యమైన చిత్రానికి మీరు చూపిస్తున్న ఆదరణకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘ఫూలే’ వంటి సందేశాత్మక చిత్రాలను నిర్మించడం ఎంతటి సవాలో, వాటిని మరింతమంది ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం కూడా అంతే పెద్ద బాధ్యత. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముందుకొచ్చిన డా. రవిచంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా జన్మస్థలం, పని ప్రదేశమైన పుణెకు, తెలంగాణ ప్రాంతానికి మధ్య ఎంతో సాంస్కృతిక అనుబంధం ఉంది. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200 ఏళ్ల క్రితం చేసిన గొప్ప కృషి ప్రభావం నేటికీ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. తరతరాలకు ఆయన ఆలోచనలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఈరోజు మహిళలు ప్రతి రంగంలోనూ విజయాలు సాధిస్తున్నారంటే, అందుకు ఫూలే దంపతులు వేసిన పునాదులు కూడా ఒక ముఖ్యమైన కారణం. అలాంటి మహనీయుల జీవితాన్ని, ఆశయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గర్వంగా ఉంది’’ అన్నారు.
చిత్ర నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసి సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వెర్షన్ కోసం చేతన్ కత్తి బుల్లెట్‌లాంటి డైలాగ్స్ అందించారు. ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. తెలుగు వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించాం. ప్రతి మహిళ తప్పక చూడాల్సిన చిత్రమిది. ప్రేక్షకుల్లో ఆలోచనను, స్ఫూర్తిని కలిగించే గొప్ప కథతో ఈ సినిమా రూపొందింది’’ అన్నారు.
దర్శకుడు అనంత్ నారాయణ్ మహదేవన్ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. ‘‘నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల వద్దకు తీసుకొస్తున్న సుపదా క్రియేషన్స్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో అద్భుతంగా నటించిన ప్రతీక్ గాంధీకి కృతజ్ఞతలు. హిందీ, మరాఠీ భాషల్లో ఆదరణ పొందిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా అదే ప్రేమ, ఆదరణ లభిస్తాయని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించడంతో పాటు ఇందులోని గొప్ప సందేశాన్ని అర్థం చేసుకుని చర్చించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ మాట్లాడుతూ.. ‘‘ఫూలే వంటి గొప్ప సందేశాత్మక చిత్రానికి సంగీతం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాను. ఇందులోని పాటలు ప్రేక్షకులందరికీ నచ్చుతాయని నమ్ముతున్నాను’’ అన్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘ఇదొక అద్భుతమైన, ఆసక్తికరమైన కథ. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న మహనీయుల జీవితాన్ని ఇప్పుడు వెండితెరపైకి తీసుకురావడం అభినందనీయం. ఇలాంటి సినిమాలను చూడటం మన బాధ్యతగా భావించాలి. ఈ సినిమా ఆడియోను మధుర ఆడియో ద్వారా విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ‘‘మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం అద్భుతమైన కృషి చేసిన ఫూలే దంపతుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం ఎంతో సంతోషకరం. వారి ఆశయాలు, పోరాటం నేటి సమాజానికి కూడా ఎంతో అవసరం’’ అన్నారు.
చిత్ర వివరాలు :
చిత్రం: ఫూలే (తెలుగు డబ్బింగ్)
నటీనటులు: ప్రతీక్ గాంధీ, పత్రలేఖ
దర్శకత్వం: అనంత్ నారాయణ్ మహదేవన్
నిర్మాణ సంస్థ: సుపదా క్రియేషన్స్
నిర్మాత: డా. పొన్నం రవిచంద్ర
సహ నిర్మాతలు: సీవీ నవీన్ కుమార్, రాజీవ్ పొన్నం
తెలుగు మాటలు: చేతన్ కత్తి
సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ
గేయ రచయితలు: పూర్ణాచారి, శ్రీదేవి రెడ్డి తంగేళ్ల
తెలుగు విడుదల తేదీ: నవంబర్ 27, 2026
పీఆర్ఓ: జీకే మీడియా (గణేష్, కుమార్)



