#CULT కంటెంట్ గ్లోబల్‌గా కనెక్ట్ అవుతుంది. యాక్షన్‌తో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది – ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్

0
3

#CULT కంటెంట్ గ్లోబల్‌గా కనెక్ట్ అవుతుంది. యాక్షన్‌తో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఆడియన్స్‌ను ఒక కొత్త వరల్డ్‌కి తీసుకెళ్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, తారక్ సినిమాస్, గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ ‘#CULT’ డెడ్లీ సర్వైవల్ గేమ్‌ ట్రైలర్ లాంచ్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘#CULT’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన భారతదేశపు తొలి స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రమాదం, హింస, ఊహించని మలుపులతో నిండిన భయానక ప్రపంచాన్ని ఈ ట్రైలర్ పరిచయం చేస్తోంది.

గోవాలోని ఒక నిర్మానుష్య ఐలాండ్ ఎస్టేట్‌లో 300 మందికి పైగా చిక్కుకుపోవడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ ప్రాంగణం చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉండటంతో పాటు, ఎంట్రీ గేట్ వద్ద ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాలను అమర్చడంతో అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ప్రాణాలతో బయటపడాలంటే ప్రాణాంతకమైన గేమ్స్‌లో పాల్గొనడం తప్ప మరో మార్గం ఉండదు. ప్రతి నిర్ణయం ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉన్న ఈ గేమ్స్‌లో ఎవరు నిలబడతారు? ఎవరు ప్రాణాలు కోల్పోతారు? అనే ఉత్కంఠ నెలకొంటుంది. ఈ భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న వారిలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ కూడా ఒకరు. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్న కొద్దీ ఆయన తనదైన రీతిలో ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

టీజర్‌లో విశ్వక్‌సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని సూచించగా, ట్రైలర్ ఆయన పాత్రలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. డ్రగ్స్ అంటే తీవ్రంగా వ్యతిరేకించే, నేరస్థులను తనదైన కఠినమైన పద్ధతిలో ఎదుర్కొనే బాడాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. దూకుడు, యాటిట్యూడ్, హ్యుమర్ కలగలిసిన ఈ పాత్ర సినిమా డార్క్ బ్యాక్ డ్రాప్ కి ఆకర్షణను తీసుకొస్తుంది. విశ్వక్‌సేన్ తనదైన స్టైల్, తీవ్రతతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పోషించిన కీలక పాత్రలను కూడా ట్రైలర్‌లో పరిచయం చేశారు. ఈ పాత్రలన్నీ కలిసి ఉత్కంఠభరితమైన కథను ముందుకు నడిపిస్తున్నాయి.

రచయితగా, దర్శకుడిగా విశ్వక్‌సేన్ ఈ విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, హాస్యాన్ని మేళవిస్తూ కథనాన్ని రూపొందించారు. దీంతో ‘#CULT’ ట్రైలర్‌ సినిమాపై క్యురియాసిటీ పెంచింది.

తరుణ్ భాస్కర్ రాసిన డైలాగ్స్ సన్నివేశాలకు మరింత పదును తీసుకొచ్చాయి. అరవింద్ ములే రూపొందించిన ప్రొడక్షన్ డిజైన్ స్లాషర్ జానర్‌కు తగిన డేంజర్ వాతావరణాన్ని సృష్టించింది. సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ తన ప్రత్యేకమైన విజువల్స్, ఉత్కంఠను పెంచే కెమెరా వర్క్‌తో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లారు. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను మరింత పెంచుతూ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. రవి తేజ గిరిజాల ఎడిటింగ్ . సాంకేతిక బృందం సినిమా మొత్తం ప్రభావవంతంగా రూపొందడంలో కీలక పాత్ర పోషించింది.

విభిన్నమైన కథాంశం, డేంజర్ నేపథ్యం, ఆసక్తికరమైన హీరో పాత్ర, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ‘#CULT’ ట్రైలర్ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసి, సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం అక్టోబర్ 30న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది.

హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ..అందరికీ నమస్తే. మనం ఎప్పుడూ భయం, స్ట్రెస్, యాంగ్జైటీ తీసుకోకూడదు. ఇవ్వాలి.. ఇచ్చి పడేయాలి. ఈ సినిమా లాంచ్ చేసినప్పుడు మా యాక్టింగ్ గురువు తాజుద్దీన్ గారిని పిలిచి డైరెక్ట్ చేయమని చెప్పాను. కాకపోతే ఈ మధ్యకాలంలో నా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు అనుకున్నంతగా రాణించలేదు. ఒకరుని ఒడ్డుకి లాగాలంటే నేను ఒడ్డున ఉండాలి. అందుకే ఈ సినిమాని నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పాను. ఈ సందర్భంగా ఆయనకు సారీ చెప్తున్నాను. నేను నా డైరెక్టర్‌ని నమ్ముతాను. ఫలితం ఎలా ఉన్నప్పటికీ అందరం కలిసే సినిమా చేస్తాం. ఒక సినిమా వర్కవుట్ కాకపోవడానికి కేవలం డైరెక్టర్ కారణం కాదు. చాలా కారణాలు ఉంటాయి. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకి నా కోసం నేను నిలబడ్డాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘కల్ట్’ సినిమాని కూడా నేనే డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా గ్రాండ్ ఫిల్మ్. ఇందులో ఎలాంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉండవు. చాలా హానెస్ట్‌గా ఈ సినిమా చేశాం. అందరం కష్టపడి పనిచేశాం. ఇందులో 150 మంది ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉన్నారు. అందరూ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలి, ఎదగాలిని పెద్ద పెద్ద డ్రీమ్స్‌తో వచ్చిన యాక్టర్స్. నా కోసం ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమా మొదటి ఐదు నిమిషాలకే మీ అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీకు ట్రైలర్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది గ్లోబల్ కంటెంట్. అందుకే సినిమాని జపనీస్, స్పానిష్ భాషల్లో డబ్ చేశాం. ఇది భాషను దాటి వెళ్లే సినిమా. రెండు గంటల 20 నిమిషాల పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. యాక్షన్ కంటే ఆడియన్స్ డ్రామాకి కనెక్ట్ అవుతారు. నేను ఎక్స్‌పెరిమెంట్ చేసిన ప్రతిసారీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అదే నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను.

యాక్టర్ ఈజీ మాట్లాడుతూ..కార్తికేయ, అనిరుధ్ అందరితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. రవి బస్రూర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. విశ్వక్‌ అన్నకి థాంక్యూ. అక్టోబర్ 30న తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.

అనిరుధ్ మాట్లాడుతూ..ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన విశ్వక్‌కి థాంక్యూ. ఈ టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

కార్తికేయ మాట్లాడుతూ..ఇది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. జీవితంలో ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు. ఏదైతే అది అయిందని ముందుకు వెళ్లాలి. విశ్వక్ అన్న ట్రైలర్‌లో చెప్పినట్టు ఏదైతే అది అయిందని ముందుకు వెళ్లాలి. నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన విశ్వక్‌కి థాంక్యూ. విశ్వక్‌ అన్నకి సినిమా అంటే మ్యాడ్ పాషన్. ట్రైలర్‌కు మించిన ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో ఉంటుంది.

తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ‘పుష్ప’లో చేసిన క్యారెక్టర్ తర్వాత మరో స్థాయిలో చేసిన క్యారెక్టర్ ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విశ్వక్‌కి థాంక్యూ. కచ్చితంగా మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.

సందీప్ కాకరాల మాట్లాడుతూ.. ఇది విశ్వక్ విశ్వరూపం. అక్టోబర్ 30న థియేటర్లలో కలుద్దాం.

నటీనటులు: విశ్వక్‌సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, ఈజీ, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాక్ నాయర్, చేబూరి వివేక్.

సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్‌సేన్
నిర్మాత: సందీప్ కాకరాల
బ్యానర్: తారక్ సినిమాస్
సంగీతం: రవి బస్రూర్
సంభాషణలు: తరుణ్ భాస్కర్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములే
ఎడిటర్: రవి తేజ గిరిజాల
కాస్ట్యూమ్ డిజైనర్: జి. అన్నపూర్ణ
ఫైట్స్: కరుణాకర్, జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here