‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ పాట విడుదల

0
3
‘NARAYANAMMA’ SONG FROM ‘AADARSHA KUTUMBAM – AK47’ RELEASED
‘NARAYANAMMA’ SONG FROM ‘AADARSHA KUTUMBAM – AK47’ RELEASED
‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నుంచి ‘నారాయణమ్మ’ పాట విడుదల
‘ఆదర్శ కుటుంబం’ మామూలు కుటుంబం కాదు.. వేరే లెవెల్ లో ఉంటుంది: ‘నారాయణమ్మ’ గీతావిష్కరణ వేడుకలో విక్టరీ వెంకటేష్ 
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – AK47’ చిత్రం నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘నారాయణమ్మ’ విడుదలైంది. తమన్ ఎస్ స్వరాలు సమకూర్చిన ఈ హుషారైన పాటను ప్రభ, రామ్ మిరియాల ఆలపించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు.
‘నారాయణమ్మ’ పాటలో డింపుల్ హయాతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌, వైబ్రెంట్ స్క్రీన్ ప్రజెన్స్‌తో పాటకు జోష్ తీసుకొచ్చారు. ఆమెతో పాటు విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కూడా సందడి చేసి, పాటను విజువల్ ట్రీట్ గా మార్చారు. మొత్తంగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కుటుంబ చిత్రంగా ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో తెలిపేలా ఈ ‘నారాయణమ్మ’ గీతం ఉంది.
‘నారాయణమ్మ’ గీతావిష్కరణ వేడుక ఆదివారం సాయంత్రం దస్పల్లా హోటల్ లో ఘనంగా జరిగింది. చిత్ర బృందమంతా ఈ వేడుకలో సందడి చేసి, ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నారాయణమ్మ సాంగ్ లాంచ్ కి విచ్చేసిన అభిమానులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు క్లాసిక్ లవ్ స్టోరీలు. అలాంటి సినిమాల తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ మరో అద్భుతమైన కథను తీసుకొచ్చారు. ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. మీరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆదర్శ కుటుంబం.. ఇది మామూలు కుటుంబం కాదు. వేరే లెవెల్. త్రివిక్రమ్ సినిమాని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. తమన్ అద్భుతమైన పాటలు అందించారు. చినబాబు గారు, నాగవంశీ మంచి మనుషులు. వారి బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది.” అన్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈరోజు హీరోలు తమన్, రామజోగయ్య శాస్త్రి గారు, వెంకటేష్ గారు, హీరోయిన్లు. నేను ముందుగా థాంక్స్ చెప్పాల్సింది డింపుల్ గారికి. సాంగ్ షూట్ చేసే సమయానికి ఆమెకి ఒంట్లో బాలేకపోయినా.. ఇష్టపడి, కష్టపడి చేశారు. మీ అందరి లాగే నా ఫేవరెట్ హీరో వెంకటేష్ గారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, నేను మొట్టమొదటిగా పెన్ను పెట్టి రాసిన డైలాగ్ ఆయన సినిమాకే. పవిత్ర బంధం. నా జర్నీ ఆయనతోనే స్టార్ట్ అయింది. అందుకని నేను వెంకటేష్ గారికి ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. అప్పుడు నేను ఎవరో వెంకటేష్ గారికి తెలియదు. కానీ, ముత్యాల సుబ్బయ్య గారితో ఆయన చెప్పారు.. ఎవరో కుర్రాడు బాగా రాస్తున్నాడని. అప్పుడు నేను పరిచయం లేదు. నువ్వు నాకు నచ్చావ్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, నేను చెప్తే గుర్తు చేసుకున్నారు. అలా నా జర్నీ మొట్టమొదట ఆయనతోనే స్టార్ట్ చేశాను. వెంకటేష్ గారు నాతో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ, నేను కాస్త భయంగానే ఉంటాను. గౌరవంతో కూడిన ఇష్టం వలన వచ్చిన భయం అనుకుంటాను అది. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా వెంకటేష్ గారు సినిమా పట్ల అంతే తపన చూపిస్తూ ఉంటారు. ఒంట్లో బాగోకపోయినా సరే డబ్బింగ్ పూర్తి చేశారు. తమన్ గురించి, రామజోగయ్య శాస్త్రి గారి గురించి మాట్లాడటం అంటే మా ఇంట్లో మనుషుల గురించి మాట్లాడినట్టే. వాళ్ళతో పరిచయం ఇప్పటిది కాదు. 20-25 ఏళ్ళ నుంచి తెలుసు నాకు. అక్టోబర్ 9న మనం థియేటర్స్ లో కలుద్దాం. అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ ఎస్ మాట్లాడుతూ.. “వెంకటేష్ గారితో సినిమా చేయడం అనేది డ్రీమ్ లాంటిది. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో సినిమా కోసం నేను ఎంతగానో ఎదురుచూశాను. ఇప్పుడు వారి కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం వస్తుండటం, అందులో నేను భాగం కావడం సంతోషంగా ఉంది. నారాయణమ్మ పాట మీ ముందుకు వచ్చింది. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చినబాబు గారు, నాగవంశీ గారికి కృతజ్ఞతలు. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు అంటేనే ఫన్. ఈ సినిమాకి ఎంతో సరదాగా పని చేస్తున్నాం. ఆదర్శ కుటుంబం చాలా పెద్ద హిట్ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ చేస్తున్న సమయంలో సినిమా చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. అక్టోబర్ 9న విడుదలవుతున్న ఆదర్శ కుటుంబం సినిమా చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు. 
నటి శ్రీనిధి శెట్టిమాట్లాడుతూ.. “చినబాబు గారు, నాగవంశీ గారు నాకు ఈ సినిమాలో నటించే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. నాకు త్రివిక్రమ్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి సినిమా షూటింగ్ అంటే ఎంతో సరదాగా పిక్నిక్ లా ఉంటుందని అందరూ చెప్పేవారు. నాకు షూటింగ్ కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, నా సినీ జీవితంలో ఇంత సరదాగా షూటింగ్ చేసిన సినిమా ఇదే. త్రివిక్రమ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనను గురూజీ అని అందరూ ఎందుకు అంటారో.. ఈ సినిమా ప్రయాణంలో అర్థమైంది. వెంకటేష్ గారు చాలా మంచి మనిషి. సీనియర్ యాక్టర్ తో కలిసి నటించడం అంటే ఎంతో కొంత ఒత్తిడి ఉండటం సహజం. కానీ, అసలు ఎలాంటి ఒత్తిడి కలగకుండా, హాయిగా షూటింగ్ లో పాల్గొనేలా చేశారు. త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారిది గోల్డెన్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను.” అన్నారు.
నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ.. “చాలా కాలం తర్వాత నేను ప్రత్యేక గీతం చేశాను. నా మొదటి పాటకు వెంకటేష్ గారు అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాంగ్ ఒప్పుకోవడానికి మొదటి కారణం త్రివిక్రమ్ గారు. నాకు త్రివిక్రమ్ గారితో అంతకముందు పరిచయం లేదు. కానీ, ఈ షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆయనను అందరూ గురూజీ అని ఎందుకు పిలుస్తారో అప్పుడు అర్థమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చినబాబు గారికి, నాగవంశీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.
నటి నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ గారితో ఇది నాకు రెండో సినిమా. అల వైకుంఠపురములో సినిమా నటిగా నాకెంతో పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. కథ వినకుండా నేను సినిమా ఓకే చేసే దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ గారు ముందు వరుసలో ఉంటారు. వెంకటేష్ గారు, శ్రీనిధి శెట్టితో పాటు అందరితో కలిసి ఈ సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రెండో సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను.” అన్నారు.
సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రిమాట్లాడుతూ.. “నారాయణమ్మ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మా దర్శకుడు త్రివిక్రమ్ గారు, సంగీత దర్శకుడు తమన్ గారి సహకారంతో మంచి సరదా పాట రాశాను. ఈ పాట నాందిగా ప్రమోషన్స్ చురుగ్గా సాగి, బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసే దిశగా సినిమా ప్రస్థానం కొనసాగాలని, రాధాకృష్ణ గారు, నాగవంశీ గారికి మంచి డబ్బులు తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అన్నారు.
ఇప్పటికే విడుదలైన ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్‌కు మంచి స్పందన లభించింది. వెంకటేష్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించడంతో పాటు.. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్‌తో టీజర్ ఆసక్తిని పెంచింది. ఈ టీజర్ ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఆదర్శ కుటుంబం – AK47’ అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘నారాయణమ్మ’ పాటతో ఈ సినిమా సంగీత ప్రయాణం మొదలైంది. ఇప్పటికే టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. ఇప్పుడు మొదటి పాటతో ఆ జోష్‌ను మరింత పెంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here