తెలుగు టెలివిషన్ 24 క్రాఫ్ట్స్ తో ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు
ఆంధ్రప్రదేశ్ సినీ, టీవీ, నాటక రంగాల నంది అవార్డులకు సంబంధించి ఇటీవల ఏపీ ఎఫ్డిసి నుండి ప్రకటన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఎఫ్డిసి సభ్యులు బుర్ర సాయి మాధవ్ గారు, మీర్ గారు, టివి & ఓటీటీ సౌత్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారు, టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారు, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, టీవీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ వ్యక్తులతో చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చలలో భరత్ భూషణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. 2017 నుండి 2024 వరకు ఉన్న అవార్డులను ఏ విధంగా ఇస్తారనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని, 2025 సంవత్సరం నుండి నంది అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తామని ప్రకటించారు. అలాగే ఈ అవార్డుల ఫంక్షన్ తిరుపతిలో ఒక్క రోజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అవార్డుల ఫంక్షన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు భరత్ భూషణ్ తెలిపారు. అలాగే టీవీ రంగానికి సంబంధించిన పలు ప్రోగ్రాములు లేదా షూటింగులు ఆంధ్రప్రదేశ్ లో జరిగే విధంగా చూడాలని ఆయన కోరారు. కేవలం కొంతవరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయడం కాకుండా వీలైనంత వరకు అధికంగా అక్కడ షూటింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన టీవీ రంగం వారిని కోరారు.

ఈ సందర్భంగా టీవీ రంగం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ టీవీ రంగానికి సంబంధించిన షూటింగులు ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా చేస్తామని కానీ వారికి అక్కడ ప్రభుత్వం పూర్తి సహకారం అందేలా చూడాలని వారు ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారికి విన్నవించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో తమకంటూ స్టూడియోస్ కోసం స్థలాన్ని, అలాగే జిల్లా లో స్థలాలను కేటాయించాలని కోరారు. షూటింగ్ లో పర భాష వ్యక్తులను కూడా మితం చేస్తే ఇక్కడ ఆర్టిస్టులకు ఎటువంటి ఇబ్బంది కలగదని అదేవిధంగా టీవీ తో పాటు టీవీ మీడియా రంగంలో వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ఆర్టిస్టుల ఆరోగ్యo కోసం ఇన్సూరెన్స్ లు, వీలైతే పెన్షన్లు కోరారు. షూటింగ్ జరుగు సమయంలో సబ్సిడీలు ఇచ్చేలా చూడాలని, నిర్మాతలకు భారం లేకుండా తక్కువ ఖర్చులో షూటింగు పూర్తి చేసేందుకు సహాయంగా నిలవాలని కోరుకున్నారు.

వారి కోరికలకు సానుకూలంగా ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గారు స్పందిస్తూ దీనికి సంబంధించిన చర్చలు అన్నీ త్వరలో జరిపి తగిన నిర్ణయాలు తీసుకుంటామని, చిత్ర పరిశ్రమకు, టీవీ వారికి, నాటక రంగం వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని అన్నారు. ఇవి వెంటనే నిర్ణయం తీసుకునే అంశాలు కాదని, త్వరలోనే వీటికి సంబంధించి కమిటీలు వేసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.



