తెరచాప – మూవీ రివ్యూ

0
4

తెరచాప – మూవీ రివ్యూ

చిత్రం: తెరచాప

విడుదల తేదీ: 17 ఏప్రిల్ 2026

ప్రొడక్షన్ హౌస్: అనన్య క్రియేషన్స్

తారాగణం: నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్, అప్పారావు జబర్దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేస, మాయమచంద్ర, సకారం తదితరులు

సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్

సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా

ఎడిటింగ్: రాజు బోడసింగి

డైలాగ్స్: జోయెల్ జార్జ్, మిద్దె మనోజ్ కుమార్ సాహిత్యం: మిద్దె మనోజ్ కుమార్

కాస్ట్యూమ్ డిజైనర్: బొడ్డు అమూల్య

కొరియోగ్రఫీ: జీవన్ జార్జ్

నిర్మాత: కైలాష్ దుర్గం

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్

అనన్య క్రియేషన్స్ పతాకంపై కైలాష్ దుర్గం నిర్మించిన ‘తెరచాప’ కొత్తదనంతో కూడిన గ్రామీణ నేపథ్య చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు జోయెల్ జార్జ్ సముద్ర తీర ప్రాంత జీవితాలను, అక్కడి మత్స్యకారుల భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నవీన్ రాజ్ శంకరపు హీరోగా, పూజా సుహాసిని, శ్రీలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్ వంటి బలమైన సహాయ తారాగణం ఉంది. ఇప్పటికే ప్రమోషన్లతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘తెరచాప’ ఈ నెల 17న విడుదలైంది.

కథ:

సముద్ర తీర గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథకు తండ్రీ-కొడుకుల అనుబంధమే ప్రాణం. గ్రామ ప్రజల కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడు కాశీ బాబు పాత్రలో నాగ మహేష్ కనిపిస్తారు. అయితే ఆయన ఆకస్మిక మరణం అందరినీ కలచివేస్తుంది. అందరూ అది సహజ మరణమే అనుకున్నా, తండ్రిపై అపారమైన ప్రేమ ఉన్న కొడుకు ఈశ్వర్ పాత్రధారి నవీన్ రాజ్ మాత్రం అందులో ఏదో మిస్టరీ దాగి ఉందని నమ్ముతాడు. నిజాన్ని వెలికితీయాలన్న పట్టుదలతో అతను చేసే ప్రయాణమే ‘తెరచాప’ కథ. ఈ క్రమంలో క్లాసికల్ డ్యాన్సర్ గాయత్రిగా పూజా సుహాసిని, సీత పాత్రలో శ్రీలు కథకు బలమైన ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఆనంద్ రాజుగా రాజీవ్ కనకాల, కేశవ పాత్రలు కథను ఊహించని మలుపులు తిప్పుతాయి. విలన్‌గా భూపతి పాత్ర హీరోకు గట్టి పోటీ ఇస్తూ కథనాన్ని రక్తి కట్టిస్తుంది. మొత్తంగా ఇది ఒక ఎమోషనల్ ఇన్వెస్టిగేటివ్ గ్రామీణ డ్రామా.

నటీ నటుల పనితీరు:

గ్రామీణ యువకుడు ఈశ్వర్ పాత్రలో నవీన్ రాజ్ శంకరపు చాలా సహజంగా ఒదిగిపోయాడు. మత్స్యకారుడి గెటప్, బాడీ లాంగ్వేజ్, యాస అన్నీ పాత్రకు తగినట్టుగా ఉన్నాయి. తండ్రి మరణం వెనుక నిజం తెలుసుకోవాలనే తపన, ఆవేశం, బాధ – ఈ మూడు ఎమోషన్స్‌ను నవీన్ చక్కగా బ్యాలెన్స్ చేశాడు. యాక్షన్ సీన్స్‌లోనూ అతని ఎనర్జీ ఆకట్టుకుంటుంది. హీరోగా ఇది అతనికి మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర.

క్లాసికల్ డ్యాన్సర్ గాయత్రిగా పూజా సుహాసిని సాంప్రదాయ లుక్‌లో మెప్పించడమే కాకుండా, కథలో కీలకమైన భావోద్వేగాలను పండించింది. నృత్య నేపథ్యం ఉన్న సన్నివేశాల్లో ఆమె గ్రేస్ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక సీత పాత్రలో శ్రీలు చేసిన మాస్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మొదటిసారి ఇలాంటి రఫ్ లుక్‌లో కనిపించిన శ్రీలు, నటనతోనూ అదరగొట్టింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ హృదయాన్ని తాకుతాయి. పూజా, శ్రీలు ఇద్దరూ పోటీ పడి నటించి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

రాజీవ్ కనకాల ఆనంద్ రాజుగా అనుభవం ఉన్న నటనతో కథకు వెయిట్ తీసుకొచ్చారు. నాగ మహేష్ కాశీ బాబుగా తక్కువ నిడివిలోనే గుర్తుండిపోతారు. ‘పుష్ప’ తర్వాత జగదీశ్ ప్రతాప్ బండారి మరోసారి తన మార్క్ చూపించాడు. ఊహించని విధంగా అతని పాత్ర క్లైమాక్స్‌లో కీలకం అవుతుంది. విలన్‌గా రాజేష్ భూపతి (భూపతి రాజు) హీరోకు ధీటుగా నిలబడి మెప్పించాడు. మొదటి సినిమా అయినా మంచి అనుభవమున్న నటుడిలా విలనిజం పండించాడు. టాలీవుడ్ కు మంచి విలన్ దొరకదని చెప్పొచ్చు. పృథ్వీరాజ్, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర వంటి తెలిసిన నటులు ఉండటం సినిమాకు బలాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు జోయెల్ జార్జ్ ఎంచుకున్న పాయింట్ కొత్తది కాకపోయినా, సముద్ర తీర నేపథ్యం, తండ్రీ-కొడుకుల ఎమోషన్‌తో దాన్ని ఆసక్తికరంగా మలిచాడు. కథనంలో స్పష్టత ఉంది, ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజల్ కృష్ణ అందించిన మూడు పాటలు వినసొంపుగా ఉన్నాయి, కథలో భాగంగానే వస్తాయి. ఎంఎల్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తుంది, ముఖ్యంగా ఎమోషనల్, టెన్షన్ సీన్స్‌లో బలంగా పనిచేసింది. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రఫీ ‘తెరచాప’కు పెద్ద ప్లస్. సముద్ర తీర అందాలను, గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా, అందంగా చూపించారు. విజువల్స్ కథకు ప్రాణం పోశాయి. ఎడిటర్ రాజు బోదాసింగి సినిమా నిడివిని క్రిస్ప్‌గా మెయింటైన్ చేశాడు. నిర్మాత కైలాష్ దుర్గం తక్కువ బడ్జెట్‌లోనే నాణ్యమైన ప్రొడక్షన్ విలువలు అందించారు.

హైలైట్స్:

సహజ నటన

సముద్ర నేపథ్యం

ఎమోషనల్ కోర్

మంచి సంగీతం

డ్రాబ్యాక్స్:

నెమ్మది కథనం

రొటీన్ సీన్స్

అనాలిసిస్:

‘తెరచాప’ బలం దాని ఎమోషనల్ కోర్. మొదటి సగం పాత్రల పరిచయం, తండ్రి మరణం, హీరోలో మొదలయ్యే అనుమానం చుట్టూ సాగుతుంది. గ్రామ వాతావరణం, మత్స్యకారుల జీవన విధానం చాలా సహజంగా చూపించడం వల్ల కథతో కనెక్ట్ అవుతాం. హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, పూజా సుహాసిని డ్యాన్స్ బిట్స్ ఫస్ట్ హాఫ్‌కు ఫ్రెష్‌నెస్ ఇచ్చాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తి రేపుతుంది.

సెకండ్ హాఫ్‌లో కథ మిస్టరీ ఛేదించే దిశగా సాగుతుంది. జగదీశ్, రాజేష్ భూపతి పాత్రలు కథను మలుపు తిప్పుతాయి. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినా, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ బ్లాక్స్ ఆ లోటును కవర్ చేస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే తండ్రీ-కొడుకుల ఎమోషన్, నిజం బయటపడే విధానం మెప్పిస్తుంది. స్క్రీన్‌ప్లేలో చిన్నచిన్న రొటీన్ టచెస్ ఉన్నా, దర్శకుడు కథను పక్కదారి పట్టకుండా నడిపించాడు.

సాంకేతికంగా ‘తెరచాప’ చాలా ఉన్నతంగా ఉంది. పాటలు, ఆర్‌ఆర్, కెమెరా వర్క్ సినిమాకు పెద్ద బలం. తక్కువ బడ్జెట్‌లో ఇంత క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వడం అభినందనీయం. నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణం. ముఖ్యంగా నవీన్ రాజ్, శ్రీలు, పూజా సుహాసిని, రాజీవ్ కనకాల నటన సినిమాను నిలబెట్టింది.

‘తెరచాప’ ఒక సాధారణ రివేంజ్ డ్రామాను ఎమోషన్స్‌తో, గ్రామీణ నేటివిటీతో చెప్పిన చిత్తశుద్ధి ఉన్న ప్రయత్నం. కుటుంబంతో కలిసి చూసేలా, భావోద్వేగాలను టచ్ చేసే సినిమా ఇది. ఈ వీకెండ్‌కు మంచి ఆప్షన్. కథాబలం ఉన్న సినిమాగా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్రొడక్షన్ విలువలతో, నిజాయితీగా తీసిన ప్రయత్నం ఇది.

రేటింగ్: 3/5

చివరగా: ఎమోషనల్ రూరల్ రివెంజ్ డ్రామా 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here