తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య & సాయి రాజేష్ ప్యానెల్ ఘన విజయం

0
28
Grand Victory for V.N. Aditya and Sai Rajesh Panel in Telugu Film Directors’ Association Elections
Grand Victory for V.N. Aditya and Sai Rajesh Panel in Telugu Film Directors’ Association Elections

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య & సాయి రాజేష్ ప్యానెల్ ఘన విజయం

ఆదివారం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో వీఎన్ ఆదిత్య ప్యానెల్ ఘన విజయం సాధించింది. దర్శకుల సంఘ అధ్యక్షుడిగా వీఎన్ ఆదిత్య విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా వి. సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ట్రెజరర్ గా సాయి రాజేశ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో ఇదే హైయెస్ట్ మెజారిటీ కావడం విశేషం. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్ వద్ద ఉన్న స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ఒకప్పుడు దర్శకుల సంఘం ఇండస్ట్రీని లీడ్ చేసేది. మధ్యలో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీఎన్ ఆదిత్య సారథ్యంలోని కమిటీ దర్శకుల సంఘం సంక్షేమానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. గెలిచిన వాళ్లే కాదు ఓడిన వాళ్లు కూడా మనవాళ్లే. అందరినీ కలుపుకుపోయి పనిచేయాలని కోరుతున్నా. అన్నారు.

ఎన్ శంకర్ మాట్లాడుతూ – నూతన కమిటీ మీద ఎంతో నమ్మకం పెట్టి దర్శకుల సంఘ సభ్యులు గెలిపించారు. వారి నమ్మకాన్ని కాపాడుకునేలా కొత్త బాడీ పనిచేస్తుందని కోరుకుంటున్నా. అన్నారు.

మెహర్ రమేష్ మాట్లాడుతూ – వీఎన్ ఆదిత్య గారంటే అందరికీ చాలా గౌరవం. ఆయన నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో కూడా ఉన్నారు. కొత్త దర్శకులను తీసుకెళ్లి నిర్మాతలకు కథలు చెప్పించి సినిమాలు చేసేలా ప్రోత్సహిస్తుంటారు. ఆయన దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలవడం సంతోషంగా ఉంది. అన్నారు.

దర్శకుల సంఘం ట్రెజరర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – దర్శకుల సంఘంలో ఎన్నడూ లేనంత సంక్షేమ కార్యక్రమాలు గతేడాది మేము చేపట్టాం. మేము ఇచ్చిన 8 వాగ్ధానాలు మమ్మల్ని గెలిపించాయని నమ్ముతున్నాం. మూల ధనం ముట్టకుండా హీరోలు, దర్శకుల నుంచి విరాళాలు సేకరించి సంఘ సభ్యులందరికీ రెండేళ్ల పాటు ఇన్సురెన్స్ చెల్లించాం. ఇప్పుడు శాశ్వతంగా అందరికీ ఇన్సూరెన్స్ చెల్లించే బాధ్యత తీసుకుంటాం. మిడ్ డే మీల్స్ కూడా కొనసాగిస్తాం. మా గురువుగారు వీఎన్ ఆదిత్య గారు అధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉంది. అన్నారు.

దర్శకుల సంఘం నూతన అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – గత రెండేళ్లు దర్శకుల సంఘంలో మంచి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. మా ప్యానెల్లో 18 మంది పోటీ చేస్తే 16 మంది గెలిచారు. అంటే మాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ గెలుపునకు సాయి రాజేశ్ ఎంతో కృషి చేశారు. ఈ గెలుపులో ఆయనకు చాలా భాగముంది. అలాగే గతంలో మిగతా ప్యానెల్ ఉన్న వారు కూడా ఈసారి మా ప్యానెల్ తరుపున పోటీ చేశారు. ఈ ప్యానెల్ గెలవాలి అని పెద్ద మనసుతో సముద్ర గారు, రాంప్రసాద్ గారు పోటీ నుంచి తప్పుకుని మా ప్యానెల్ తరుపున నిలబడ్డారు. సందీప్ వంగా, అనిల్ రావిపూడి ఇలా ఎంతోమంది బిజీగా ఉన్న దర్శకులు వచ్చి ఓటేశారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణం లో సహాయం చేస్తాం. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here