పులగం చిన్నారాయణ అందించిన ‘ప్రపంచ సినిమా పరిమళం’
తెలుగు పుస్తక ప్రపంచంలో రచయిత, జర్నలిస్టు, నంది పురస్కార గ్రహీత పులగం చిన్నారాయణ రచించిన పుస్తకాలకు ప్రత్యేక స్థానం వుంది. సినీ చరిత్రకారుడిగా ఆయన రచించిన అనేక పుస్తకాలు పాఠకుల ఆదరణ పొందుతూ వస్తున్నాయి. పులగం చిన్నారాయణ రచించిన, ఆయన సంపాదకత్వంలో వెలువడిన సినిమా పుస్తకాలకు పాఠకులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘జంధ్యామారుతం’, ‘ఆనాటి ఆనవాళ్లు’, ‘సినీ పూర్ణోదయం’, ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’, ‘పసిడి తెర’, ‘సినిమా వెనుక స్టోరీలు’, ‘మాయాబజార్ మధుర స్మృతులు’, ‘వెండి చందమామలు’, ఈ మధ్య వచ్చిన ‘జై విఠలాచార్య’, ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్ కాక్’ వరకు… ఇలా ఆయన అందించిన ప్రతి పుస్తకమూ పాఠకుల ఆదరణ, ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆయన తాజాగా అందించిన మరో మంచి పుస్తకం ‘ప్రపంచ సినిమా పరిమళం’.
సినిమా అనేది ఒక దర్పణం లాంటిది! వెండితెర మీద ప్రేక్షకులు అందరికీ కనిపించే దృశ్యం ఒక్కటే కావచ్చు. కానీ, అర్థం మాత్రం వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరు అర్థం చేసుకునేది కూడా వేరుగా వుంటుంది. దర్శకుడి దృక్కోణం ఏమిటనేది ఆ సంభాషణలు, దృశ్యం నుంచి మనం సంగ్రహించే భావంలో ఉంటుంది. ప్రపంచ సినిమాల్లో క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్న కొన్ని మంచి సినిమాలు ప్రముఖులకు ఎలా అర్థం అయ్యాయి? ఆయా సినిమాల్లో అంతర్లీనంగా వున్న అంశాలు ఏమిటి… అనేది ఒక్కచోటకు తీసుకు వస్తే ఎలా వుంటుంది? ‘ప్రపంచ సినిమా పరిమళం’ పుస్తకం ద్వారా అటువంటి గొప్ప ప్రయత్నం చేశారు ప్రముఖ జర్నలిస్ట్ – సినీ రచయిత పులగం చిన్నారాయణ ఆయన సంకలనం చేసిన తాజా పుస్తకం ‘ప్రపంచ సినిమా పరిమళం’ ఇటీవల మార్కెట్లోకి విడుదలైంది. ఈ పుస్తకం ద్వారా ప్రపంచ సినిమా పరిమళాన్ని విజ్ఞులైన పాఠకులు ఆస్వాదిస్తున్నారు.
ప్రపంచ సినిమాల్లో భావి తరాలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన, దర్శక రచయితలకు మార్గదర్శిగా నిలించిన, స్ఫూర్తి ఇచ్చిన 26 సినిమాలు ఎంపిక చేసుకున్నారు పులగం చిన్నారాయణ. ఆ సినిమాల మీద అద్భుతమైన వ్యాసాలు రాయించారు.
తరాలకు అతీతంగా ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా ‘బెన్ హర్’. దాని గురించి పీఎస్ గోపాలకృష్ణ చెప్పింది చదువుతూ అచ్చెరువు చెందుతాం. ‘మెర్సీ మిషన్’ గురించి భాగ్య రాజా రాసింది చదువుతుంటే, సినిమా కళ్లకు కట్టినట్టు కనిపిస్తూ వుంటుంది. ‘టేస్ట్ ఆఫ్ చెర్రీ’ గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి చెప్పిన అంశాలు అద్భుతంగా వుంటాయి. అభిరుచి గల నిర్మాత మాత్రమే కాకుండా.. అభిరుచి గల ప్రేక్షకుడిగా కూడా ‘స్రవంతి’ రవికిశోర్ ‘ది శాండ్ పెబుల్స్’ సినిమా గురించి చెప్పారు. దర్శకుడు శివ నాగేశ్వరరావు, రచయితలు గోపి మోహన్ – బీవీఎస్ రవి, మహ్మద్ ఖదీర్ బాబు సహా పలువురు ప్రముఖులు చేసిన విశ్లేషణలు మనల్ని మళ్ళీ ఆయా సినిమాలు చూసేలా, ఆయా కథలను లోతుగా అర్థం చేసుకునేలా ‘ప్రపంచ సినిమా పరిమళం’ పుస్తకం ఉపయోగపడుతుందని. సినీ ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన పుస్తకాల్లో ఇదొకటి అని చెప్పవచ్చు. ఆక్షౌహిణి మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ప్రస్తుతం మార్కెట్టులో అందుబాటులో ఉంది. ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోనూ లభిస్తుంది. ఈ పుస్తకానికి తనికెళ్ళ భరణి ముందుమాట రాశారు.
ఈ పుస్తకాన్ని అభినందిస్తూ, సంకలనం చేసిన పులగం చిన్నారాయణను ఆశీర్వదిస్తూ ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇలా అన్నారు…
“ఓటీటీల్లో, యూట్యూబ్లో వేలాది సినిమాలు అందుబాటులో ఉండడంతో ఏం చూడాలనే మీమాంస నాతో పాటు అందరికీ ఉంటుందనే అనుకుంటున్నాను. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారు తమకు నచ్చిన సినిమాల గురించి రాసిన వ్యాసాలతో ఈ “ప్రపంచ సినిమా పరిమళం’’ పుస్తకం రూపొందింది. మొత్తం 26 వ్యాసాలు. మీరు సినిమా ప్రేమికులైతే ఇది ఖచ్చితంగా చదవదగ్గ పుస్తకం. ధర చాలా స్వల్పం. ఒక్కో సినిమా గురించి 6 రూపాయల ఖర్చుతోనే చదవొచ్చు. I hope you enjoy reading this book”
140 పేజీల ఈ పుస్తకం వెల: 150 రూపాయలు.
అక్షౌహిణి మీడియా ప్రచురణ.
Contact: 9494 00 2359



