కేసీఆర్ రివ్యూ
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కేసిఆర్. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కడంతో ముందు నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. గరుడవేగ అంజి డైరెక్ట్ చేస్తూ సినిమాటోగ్రఫీ కూడా హ్యాండిల్ చేసిన ఈ చిత్రాన్ని స్వయంగా రాకింగ్ రాకేష్ నిర్మించడం గమనార్హం. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూ లో చూద్దాం.
కథ:
వరంగల్ జిల్లా లో తండాలో నివాసం ఉండే లంబాడ యువకుడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్) ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రసంగాలు విని కెసిఆర్ కి అభిమానిగా మారిపోతాడు అతని పేరు కూడా షార్ట్కట్లో కేసీఆర్ కావడంతో అతన్ని అందరూ చోటా కెసిఆర్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి కెసిఆర్ ను మరదలు మంజు(అనన్య కృష్ణన్) అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటే పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది అని భావించి పెళ్లికి నిరాకరిస్తాడు. ఈ విషయం తెలిసి మామ భీమ్లానాయక్(మైమ్ మధు)ఆగ్రహానికి గురవుతాడు. ఒకపక్క మంజు మరో పక్క కెసిఆర్ ఇద్దరికీ అదే తండాలో ఉన్న డబ్బు ఉన్న వారితో సంబంధం కుదురుతుంది. కేసీఆర్ పై అభిమానం ఉన్న కేశవ… కేసీఆర్ సమక్షంలోనే పెళ్లి అని చెప్పి హైదరాబాద్ బయలుదేరుతాడు. అలా హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? తన అభిమాన నాయకుడు కేసీఆర్ ను కలిసాడా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో కేశవ చంద్ర రమావత్ అలియాస్ కెసిఆర్ అనే పాత్రలో రాకింగ్ రాకేష్ నటించలేదు, జీవించాడు. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అభిమానిగా ఒక అమాయక తండా లంబాడ కుర్రాడిగా కరెక్ట్ గా ఆ పాత్రకి సెట్ అయ్యాడు. చాలా సీన్స్లో కన్నీరు పెట్టించేలా నటించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతని మరదలు పాత్రలో అనన్య కూడా చాలా సహజంగా నటించింది. మామగా మైం మధు అలరించాడు. ఇక లోహిత్, తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
సాంకేతిక అంశాల విషయానికి వస్తే బడ్జెట్ తక్కువ అని ఒక పక్క కనిపిస్తున్న ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక మంచి సినిమాని ప్రేక్షకులం ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడా సాగ తీసిన ఫీలింగ్ లేకుండా కథను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు గరుడవేగ అంజి సఫలీకృతుడయ్యారు. ఈ సినిమాకి ఆయన అందించిన సినిమాటోగ్రఫీ మరో ప్రధానమైన అసెట్. ఇక సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ కంపోజ్ చేసిన పాటలన్నీ అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా స్వరగతులు పాట చాలా బాగా వచ్చింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేసింది.
విశ్లేషణ:
ఇది సాధారణమైన కథ కాదు.. నిజంగా జరిగిన ఒక కథను ఒక సినిమాగా మలిచారు. చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల పట్ల కేశవ చంద్ర రమావత్ అనే యువకుడు ఆకర్షితుడై చోటా కెసిఆర్ గా చలామణి అవుతుంటాడు. రింగ్‌రోడ్డు వల్ల ఊరి మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు రావడంతో కేశవ చంద్ర ఆ సమస్య తీర్చడమే కాదు కేసీఆర్‌ను ఒప్పించి తన పెళ్లికి తీసుకొస్తాననే ప్రతిజ్ఞతో ఫస్ట్ ఆఫ్ ఆసక్తికరంగా రాసుకున్నారు.. సెకండాఫ్ మొత్తం హైదరాబాద్‌లో కేశవ చంద్ర ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో ఎమోషనల్‌గా ఆలోచింపచేస్తూ కన్నీరు పెట్టిస్తూ సాగింది. తెలంగాణ ప్రగతి గురించి కెసిఆర్ చేసిన అభివృద్ధి గురించి కేశవచంద్ర చెప్పే డైలాగులు థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ‘ఒకప్పుడు చరిత్ర మరచిన తెలంగాణ ఇప్పుడు చరిత్రనే మార్చింది..’ అనే డైలాగ్ హైలైట్. ‘ఊరిని వదిలి పెట్టే మనుషులు ఉంటారు కానీ..మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు’ అనే డైలాగ్s తో ప్రేక్షకులు ఆకట్టుకున్నాడు డైరెక్టర్. క్లెమాక్స్ సన్నివేశాలను ఎవరూ ఊహించని విధంగా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేయడం గమనార్హం.
ఫైనల్లీ ఓ కల్మషం లేని కేసీఆర్ అభిమాని ఆయన ప్రయాణాన్ని స్ఫూర్తివంతంగా తీసుకుని చేసిన ప్రయత్నమే ఈ కెసిఆర్ సినిమా. కేసీఆర్ అభిమానులను, తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
రేటింగ్: 2.75/5
చివరగా: ఆకట్టుకునే స్ఫూర్తివంతమైన కేసీఆర్ అభిమాని ప్రయాణం