మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2024, మార్చి 8న విడుదల కానుంది!

0
137

 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు.

ప్రకటన నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ పోతోంది చిత్ర బృందం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ప్రముఖ నటి నేహా శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రతిభావంతులైన నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. అతని కఠినమైన ప్రయాణం రాజకీయ చిక్కులను కూడా కలిగి ఉంటుంది. మేకర్స్ వాటి గురించి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సూచన చేశారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ చాలా గ్రే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం పట్ల ఎంతో నమ్మకంగా ఆయన, ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాని 2024 మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

అనిత్ మధాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here