ద గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ మూవీ సీ రివ్యూ

0
642

చిత్రం: గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ 

ఓ టి టి ప్లాట్ ఫామ్: ఆహా 

విడుదల తేదీ: 06-10-2023

నటీనటులు: రామ్ కార్తిక్, హెబ్బ పటేల్, నరేష్ వి కే, పవిత్ర లోకేష్, జయప్రకాష్, రత్న శేఖర్ రెడ్డి తదితరులు

ఆర్ట్: ఉపేందర్ రెడ్డి

సంగీతం: శ్రీ చరణ్ పాకల

సినిమాటోగ్రఫీ: అజయ్ వి నాగ్, అనంత్ వి నాగ్

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

రచన, నిర్మాత, దర్శకత్వం: విప్లవ్ కోనేటి

రామ్‌కార్తిక్‌, హెబ్బాప‌టేల్ జంట‌గా న‌టించి,  య‌థార్థ‌ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ మూవీ శుక్ర‌వారం ఆహా ఓటీటీలో రిలీజైంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు విప్ల‌వ్ కోనేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

కథ:

హేమంత్ (రామ్‌కార్తిక్‌) కాఫీషాప్ ర‌న్‌ చేస్తుంటాడు. అత‌డి షాప్‌కు రెగ్యులర్ కస్టమర్ అయిన చైత్ర (హేభాప‌టేల్‌) ఆ కేఫ్ కి తన ఇంట్లో తయారు చేసే హోం మేడ్ కుకీస్ స‌ప్లై చేస్తుంటుంది. కొద్ది రోజుల్లోనే చైత్ర‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు హేమంత్‌. ఆమెను పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ కొద్ది రోజుల్లో త‌మ‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోనున్నట్లు చైత్ర చెప్పడంతో కథ మలుపు తిరుగుతుంది. యాక్సిడెంట్‌లో చ‌నిపోయిన త‌మ పెద‌నాన్న బ‌ళ్లారి నీల‌కంఠ‌య్యను (సీనియ‌ర్ న‌రేష్‌)ను తిరిగి బ‌తికించ‌డానికి తాము ఆత్మ‌త‌ర్ప‌ణం చేసుకుంటున్నామని అంటుంది. చైత్ర‌తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేయాల‌ని హేమంత్‌ ఫిక్స్ అవుతాడు. చైత్ర మెడ‌లో తాళిక‌ట్టి ఆమె ఇంట్లో అడుగుపెడ‌తాడు. చైత్ర ఇంట్లో అత‌డికి ఎలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? చివరికి అతను వాళ్ళందరి ఆలోచనలను మార్చగలిగాడా? ఆ కుటుంబాన్ని ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవ‌రు? త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై చైత్ర ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ది? అన్న‌దే ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ సినిమా క‌థ‌.

నటీనటుల పనితీరు:

డీ గ్లామరస్ రోల్ లో హెబా పటేల్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. ఆద్యంతం బరువైన పాత్రకు తగ్గ ఎమోషన్స్ ను పలికిస్తూ సినిమాకే హైలైట్ గా నిలిచింది. నెగెటివ్ షేడ్స్‌తో ఆమె పాత్ర స‌ర్‌ప్రైజ్ చేస్తుంది.  రామ్ కార్తిక్ ప్రేమించిన అమ్మాయిని, తన కుటుంబాన్ని కాపాడుకునే యువకుడిగా చక్కగా సరిపోయాడు. తన కెరీర్ బెస్ట్ నటన ప్రదర్శించాడు. ప‌విత్రా లోకేష్ నటన తో మెప్పిస్తుంది, న‌రేష్ విల‌నిజంతో ఆక‌ట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

విశ్లేషణ:

మూఢ నమ్మకాల నేపథ్యంలో పాల్పడే సామూహిక ఆత్మహత్యల పాయింట్ తో తెరకెక్కిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ టైటిల్ తో పాటు కథా పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఈ పాయింట్ చుట్టూ ఒక ప్రేమ కథ, తన ప్రేమను రక్షించుకునేందుకు ఓ యువ‌కుడు సాగించిన జ‌ర్నీ నేప‌థ్యంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ సాగుతుంది. చివ‌రలో రివేంజ్ డ్రామాతో పాటు తెలిసిన‌వాళ్ల చేతుల్లోనే చిన్న పిల్ల‌లు ఎక్కువ‌గా లైంగిక‌దాడుల‌కు గురువుతున్నార‌నే సందేశాన్ని ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ సినిమా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్ట‌ర్‌.అలాగే స్వామిజీలుగా అవ‌తారం ఎత్తి కొంద‌రు చేసే అకృత్యాల్ని ఆలోచ‌నాత్మకంగా సినిమాలో చూపించారు.

మూఢ‌న‌మ్మ‌కాల వ‌ల్ల త‌లెత్తే అన‌ర్థాల్ని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చెప్పాల‌నే ద‌ర్శ‌కుడు ఐడియా బాగుంది. ఆ దిశగా దర్శకుడు విప్లవ్ కోనేటి సినిమాని ఉత్కంఠగా నడపడంలో విజయం సాధించారు. ల‌వ్‌స్టోరీతో ఈ సినిమాను మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత అస‌లైన క‌థ‌లోని వెళ్లారు డైరెక్ట‌ర్‌. చైత్ర ఇంట్లో హేమంత్‌ అడుగుపెట్టిన త‌ర్వాత అక్క‌డ అత‌డికి ఎదుర‌య్యే ప‌రిణామాలు థ్రిల్లింగ్‌ను పంచుతాయి. ఫ్యామిలీ మిస్ట‌రీని సాల్వ్ చేసేందుకు హేమంత్ చేసే ప్ర‌య‌త్నాల‌తో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సినిమా సాగుతుంది.

సాంకేతిక నిపుణుల పనితీరు:

ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు విప్లవ్ కోనేటి ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ రాబట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకల తన నేపథ్య సంగీతం తో సన్నివేశాలను రక్తి కట్టించాడు. అజయ్ వి నాగ్, అనంత్ వి నాగ్ సినిమాటోగ్రఫీ బాగుంది, వారు ఎంచుకున్న లైటింగ్ ఒక మూడ్ క్రియేట్ చేసింది.

ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ డిఫ‌రెంట్‌ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. కీలకమైన పాయింట్ ను పై పైన టచ్ చేసినట్లు అనిపించినా, కథనం అక్కడక్కడ నెమ్మదించినట్లు అనిపించినా, టైట్ స్క్రీన్ ప్లే తో ఆసక్తిగా నడపడం తో థ్రిల్లింగ్ గా సాగుతుంది.

చివరగా: ఆలోచింపజేస్తూ ఉత్కంఠ గా సాగే క్వాలిటీ థ్రిల్లర్

రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here