రెండు ఆత్మల ప్రయాణం అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన టూ సోల్స్ సినిమా టైటిల్ తో ఆసక్తి రేకెత్తించి నేడు థియేటర్లో విడుదల అయింది. పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రవణ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.
కథ :
సిక్కింలో పుట్టి పెరిగిన అఖిల్ (త్రినాథ్ వర్మ) తండ్రికి దూరంగా, సొంతంగా కాళ్ల మీద నిలబడాలని అనుకుంటాడూ. తన తల్లి చావుకు కారణం తండ్రేనని ద్వేషిస్తూ ఉంటాడు. ప్రియ ను ప్రేమించిన అఖిల్ తను అప్పటికే వేరే వ్యక్తితో క్లోజ్‌గా ఉండడంతో చనిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో కారుకు ప్రమాదంకు గురైన అఖిల్ ఆత్మ అతని శరీరం నుంచి వేరు పడుతుంది. బయటకు వచ్చిన అఖిల్ ఆత్మకు ప్రియా అనే మరో అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది. ఈ రెండు ఆత్మల ప్రయాణం చివరకు ఎలా ముగుస్తుంది? అఖిల్ ప్రేమ కథ చివరకు ఏం అవుతుంది? అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు :
అఖిల్ పాత్రలో త్రినాథ్ వర్మ బాగా సరిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇక భావన సింగ్ తన పాత్రకు న్యాయం చేసింది. ప్రేక్షకులను నవ్వించడం, ఏడ్పించడంలో సక్సెస్ అయింది. త్రినాథ్, భావనల పాత్రలు, తమ పర్ఫామెన్స్‌లతో ఆడియెన్స్‌ను అలరించారు. హీరో ఫ్రెండ్‌గా రవితేజ, హీరోయిన్ స్నేహితురాలిగా మౌనిక రెడ్డిలు పోషించిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు :
మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకుడిగా తన ప్రతిభను చూపించాడు శ్రవణ్. దర్శకుడిగా, ఎడిటర్, మాటల రచయితగానూ శ్రవణ్ మెప్పిస్తాడు. శశాంక్ సాయి రామ్ సినిమాటోగ్రఫీ, ప్రతీక్ సంగీతం, ఆనంద్ నంబియార్ ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.
విశ్లేషణ
రెండు ఆత్మల ప్రయాణం అనే కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్న దర్శకుడు బ్యాక్ డ్రాప్ ఫ్రెష్‌గా ఉండేలా చూసుకున్నారు. సిక్కీం అందాలు, ఆ మంచు కొండలు, చల్లటి వాతావరణం తెరపై మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది. కథ, కథనాలు కాస్త నెమ్మదిగా సాగినా కూడా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా తెరకెక్కించడంలో దర్శకుడు శ్రవణ్ సక్సెస్ అయ్యారు..
ప్రథమార్థం కాస్త నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపించినా.. ద్వితీయార్థంలోని ప్రేమ కథ, అందులో వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుంది. ఇక మూడ్‌కు తగ్గట్టుగా చూపించే విజువల్స్, మాటలు, పాటలు, ఆర్ఆర్ అన్నీ కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతాయి. ఈ ముక్కోణపు ప్రేమ కథలోని ట్విస్ట్ అందరినీ మెప్పిస్తుంది.
చివరగా : హృద్యంగా సాగే రెండు ఆత్మల ప్రయాణం
రేటింగ్ 3.25



