టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటిసారిగా తెరపై విలన్‌గా నటించాడు. విలన్‌గా కోటి నటించిన ఈ పగ పగ పగ చిత్రంతో అభిలాష్ సుంకర హీరోగా పరిచయం అయ్యాడు. సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
బెజ్జోని పేటలో ఒకసారి డీల్ కుదిరితే.. చివరి క్షణంలో ఉన్నా కూడా వాడు డీల్ పూర్తి చేసి చస్తాడు.
కథ :
పగ పగ పగ చిత్రం 1985, 90, 2007వ నేపథ్యంలో సాగుతుంది. పగ పగ పగ అంతా కూడా బెజవాడలోని బెజ్జోని పేటలో జరుగుతుంది. బెజ్జోని పేటలో ఒకసారి డీల్ కుదిరితే.. చివరి క్షణంలో ఉన్నా కూడా వాడు డీల్ పూర్తి చేసి చస్తాడు. జగ్గూ (కోటి), కృష్ణ (బెనర్జీ) సెటిల్మెంట్‌లో హత్యలు చేస్తూ ఉంటారు. పోలీస్‌ను చంపిన కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. ఆ సమయంలో జగ్గూకి కూతురు సిరి (దీపిక ఆరాధ్య) పుడుతుంది. అయితే కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడతాను అని తాను ఇచ్చిన మాటను మరిచిపోతాడు జగ్గూ. ఆ తరువాత జగ్గూ కాస్తా పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయి జగదీష్ ప్రసాద్‌గా మారతాడు. కృష్ణ ఫ్యామిలీ కష్టాలు పడుతూనే ఉంటుంది. అతని కొడుకు అభి (అభిలాష్) కష్టపడి చదువుతుంటాడు. అయితే సిరి సైతం అభిని చిన్నతనం నుంచి ఇష్టపడుతుంటుంది. ఈ విషయం జగదీష్ ప్రసాద్‌కు నచ్చదు. కోపంతో తన అల్లుడిని చంపేందుకు ఓ డీల్ మాట్లాడతాడు. కానీ మళ్లీ ఉదయం అయ్యే సరికి ఆ డీల్ వద్దని అనుకుంటాడు. కానీ ఇంతలోపే ఆ డీల్ బెజ్జోని పేట వ్యక్తికి చేరుతుంది? అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకునేందుకు జగ్గూ చేసిన ప్రయత్నాలు ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేస్తాడు? అసలు చివరకు అభికి ఏమవుతుంది? అనేది కథ.
నటీనటులు :
కెరీర్‌లో మొదటి సారిగా తెరపై కనిపించాడు కోటి. సంగీత స్వరాలతో అందరినీ మెప్పించిన కోటి.. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్‌గా అదరగొట్టేశాడు. ఇక హీరోగా మొదటి సినిమానే అయినా అభిలాష్ ప్రేక్షకులను మెప్పిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అభిలాష్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. సీరియస్, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్ పండించాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా ఇలా అందరూ తమ తమ పాత్రల్లో మెప్పించారు.
విశ్లేషణ :
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. 1985వ నేపథ్యాన్ని చూపించడం బాగుంది. పాయింట్ బాగున్నా కూడా అది తెరపైకి తీసుకురావడంలో, ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో మాత్రం దర్శకుడు కాస్త తడబడ్డట్టు అనిపిస్తుంది. రాసుకున్నా పాయింట్‌కు తగ్గట్టుగా కథనం అంత ఆసక్తికరంగా సాగలేదు.అయితే ద్వితీయార్థంలోనే అసలు కథ జరుగుతుంటుంది. ప్రథమార్థంలో కథ అంతగా రక్తి కట్టదు. కాలేజ్ ఎపిసోడ్స్ కాస్త సరదాగా సాగుతుంటాయి.
ద్వితీయార్థంలో కిల్లర్‌ను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా మారుతాయి. ఇక చివర్లో క్లైమాక్స్ కూడా అందిరినీ ఆశ్చర్యపరుస్తుంది. పగ పగ పగ అనే టైటిల్‌కు న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఊహకు భిన్నంగా సాగుతుంది. ముగింపు కాస్త సరదాగా అనిపిస్తుంది. రొటీన్ రివేంజ్ స్టోరీలా అనిపించదు.
నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. నాటి నేపథ్యాన్ని చూపించారు. పోకిరి సీన్‌ను ఇందులో వాడుకున్న తీరు బాగుంటుంది. ఈ కథకు పోకిరి సీన్ లింక్ చేయడం బాగుంది. ఇక సంగీతం ఎంతో వినసొంపుగా ఉంటే.. బ్యాక్ గ్రౌండ్ మాత్రం అదిరిపోయింది. కొన్ని సీన్లను అలా నిలబెట్టేసినట్టు అనిపిస్తుంది. కెమెరాపనితనం, ఎడిటింగ్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి.
రేటింగ్ : 3/5