కమర్షియల్‌ సినిమాలు చేసినా కొత్త పాయింట్ ఉండాలి.. ‘మై డియర్ భూతం’ ప్రమోషన్స్‌లో ప్రభు దేవా

0
197
హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులందరినీ మెప్పించారు. ఇప్పుడు సరికొత్తగా ‘మై డియర్ భూతం’ అంటూ రాబోతోన్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మై డియర్ భూతం ఈ జూలై 15వ తేదీన విడుదలకానుంది. ఈ క్రమంలోనే ప్రభుదేవా మీడియాతో ముచ్చటించారు.
 మై డియర్ భూతం సినిమాను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి?
ఇదొక భూతం సినిమా. ఈ కారెక్టర్ కొత్తది. ఓ రెఫరెన్స్ అంటూ ఏమీ లేదు. మనమే సృష్టించి చేయాలి. అయితే క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్‌గా అనిపించింది. సీజీ వర్క్ ఎక్కువగా ఉంది కరెక్ట్‌గా చేస్తారా? అని దర్శకుడిని అడిగాను.  చేస్తాను అని అన్నారు. నేను ఆయన్ను నమ్మాను.
ఈ సినిమా కోసం కొత్త గెటప్స్ ప్రయత్నించారు?
అవును. ఈ సినిమా కోసం గడ్డం, మీసం తీసేశాను. పిలక కూడాపెట్టుకున్నాను. నాకు ఒకలా అనిపించింది. ఐదు సెకన్ల సీన్ కోసం మీసం తీసేశాను. పిల్లలకు బాగా రీచ్ అవుతుందని అనడంతో చేసేశాను.
అల్లావుద్దీన్ అద్భుతచిత్రానికి, దీనికి పోలికలు ఏమైనా ఉంటాయా?
ఇది తారే జమీన్ పర్ లాంటి చిత్రం. అల్లావుద్దీన్‌కు దీనికి సంబంధం ఉండదు. పిల్లాడి జీవితంలో భూతం ఏం చేస్తుందనేది ఈ చిత్రం.
దర్శకుడితో మీ రిలేషన్ ఎలా ఉండేది?
నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు యాక్టర్‌గానే ఉండేవాడిని. దర్శకుడికి ఎలాంటి సలహాలు ఇచ్చేవాడిని కాదు. చాలా అరుదుగా సలహాలు ఇస్తుంటాను. ఆయన ఇది వరకు రెండు  సినిమాలు చేశారు. ఆయన చాలా మంచి వారు. అందుకే ఈ చిత్రాన్ని చేశాను. ఈ చిత్రాన్ని 45రోజుల్లో చేశాం. కానీ సీజీ వర్క్‌కు మాత్రం 11 నెలల సమయం పట్టింది.
కొత్త కథలు ఎంచుకోవడంలో మీరు ముందుంటారు కదా?
నేను కూడా ముందుంటాను. తరువాత రాబోయే చిత్రంలో ఒంటి కాలితో నటిస్తాను. కమర్షియల్‌గా చేసినా కూడా ఓ కొత్త పాయింట్ ఉండాలని అనుకుంటాను. భూతం లాంటి కొత్త పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో చెప్పలేను.
భూతంలో డ్యాన్స్ ఉంటుందా?
నేను ఉన్నాను కాబట్టి ఓ పాట పెట్టారు. కరోనా తరువాత ఆ పాటను  చిత్రీకరించారు. ఆ పాటను శ్రీధర్ కంపోజ్ చేశారు. చాలా గ్యాప్ రావడంతో.. కాలు కదపలేకపోయాను. వారం రోజులు రిహార్సల్స్ చేశాను.
ఈ సినిమా సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
భూతం అనే పాత్రే కొత్తది. అది ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే రెఫరెన్స్‌లు ఉండేవి కాదు. నేనే ఊహించుకుని చేసే వాడిని. వాటిని దర్శకుడు కూడా ఓకే అనేవారు. ఇందులో నేను, ఒక అబ్బాయి, అతని తల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. నేను ఇంకా ఈ సినిమాను చూడలేదు. నేను తప్పా అందరూ చూసేశారు. నేను తెలుగుకు డబ్బింగ్ చెప్పలేదు. నా తెలుగు ఇలా ఉంటుంది (నవ్వులు). ఇక నా గెటప్ చూసి అందరూ వింతగా చూసేవారు. అందరూ నవ్వుకునే వారు. ఇంట్లో అద్దంలో నాది నేను చూసుకుని ‘ఏంట్రా ఇలా అయిపోయింద’ని అనుకునేవాడిని . సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హారర్ కాన్సెప్ట్ ఉండదు.
ప్రేమికుడులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఉన్నారు.. మీ సీక్రెట్ ఏంటి?
సీక్రెట్ అంటూ ఏమీ లేదు. ఏదైనా అయితే మంచిది.. అవ్వకపోతే ఇంకా మంచిది. దేనికి కూడా ఎక్కువగా ఆలోచించను. నేను టెన్షన్ పడను. టెన్షన్ పెడతాను.
చిరంజీవి గారితో సాంగ్ చేస్తున్నారట.. ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు?
ఎన్ని ఏంటి.. ఒక్కటే.. మీ అందరి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. నాకే భయంగా ఉంది. జూలై చివరి వారంలో షూటింగ్ ఉంటుంది.
దర్శకత్వం మళ్లీ చేయబోతోన్నారా?
త్వరలో చేస్తాను. కానీ ఇంకా ఏది కూడా ఫిక్స్ అవ్వలేదు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ఎక్కడైనా చేయొచ్చు.
మీ తదుపరి చిత్రాలు?
తమిళంలో చిత్రాలు చేస్తున్నాను. ఓ యాక్షన్ సినిమా, ఒంటికాలితో మరో చిత్రం చేస్తున్నాను. ఇంకో సినిమాలో శవంలా నటిస్తాను . సినిమా మొత్తం శవంలానే కనిపిస్తాను. ఆ శవం ఎలా చనిపోయిందనేదే కథ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here