సమాజంలోని అన్ని వ్యవస్థల్లో మార్పు రావాలనే ఆకాంక్షను గాడ్సే ద్వారా వ్యక్తం చేశాం – గోపీ గణేష్‌

0
259

సమకాలీన సమాజంలోని సమస్యల్ని సీరియస్‌గా చర్చిస్తూ ‘గాడ్సే’ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరిలో ఆలోచనల్ని రేకెత్తించే చిత్రమిది’ అన్నారు గోపీ గణేష్‌. ఆయన దర్శకత్వంలో సత్యదేవ్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్సే’ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ గణేష్‌ మంగళవారం పాత్రికేయులతో సంభాషించారు.

ఈ సినిమాకు ‘గాడ్సే’ అని టైటిల్‌ పెట్టే విషయంలో ఏ మాత్రం సంకోచించలేదు. నేటి విద్యా వ్యవస్థను చర్చిస్తూ ‘గాడ్సే’ చిత్రాన్ని రూపొందించాం. ప్రస్తుతం ఆరుశాతం మంది మాత్రమే వారు చదివిన చదువుకు సరిపోయే ఉద్యోగం చేస్తున్నారు. పాతికేళ్లపాటు జీవితాన్ని పణంగా పెట్టి చదువుకుంటే దానికి భవిష్యత్తులో ప్రయోజనం లేకపోతే ఎలా? అనే ప్రశ్న నుంచి ఈ కథ తయారుచేసుకున్నా.

నేటి యువతలో కొంతమంది ఉద్యోగాల కోసం దేశాన్ని వదిలివెళ్లే పరిస్థితుల్ని చూస్తున్నాం. ఈ ధోరణిలో మార్పు రావాలని చూపించాం.

ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నా. దానిని కమర్షియల్‌ పంథాలో తెలియజెప్పాం. సమాజంలోని అన్ని వ్యవస్థల్లో మార్పు రావాలనే ఆకాంక్షను మా సినిమా ద్వారా వ్యక్తం చేశాం.

పవన్‌కల్యాణ్‌గారిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నా. కానీ ఆయన్ని కలుసుకునే మార్గం లేకుండా పోయింది.

హైస్కూల్‌ రోజుల నుంచే నాపై టి.కృష్ణగారి ప్రభావం ఉంది. ఆ తర్వాత శంకర్‌, మణిరత్నం సినిమాలు కూడా ప్రేరణనిచ్చాయి.

‘గాడ్సే’ చిత్రంలో రాజ్యాంగ నియమాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్‌ వంటి అంశాల ప్రస్తావన ఉండదు. వ్యవస్థ మూలాల్లో పాతుకుపోయిన సమస్యను చర్చించే ప్రయత్నం చేశాం.

సత్యదేవ్‌ తన పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేశాడు. ఓ సామాన్యుడి ఆవేశాన్ని తన పాత్ర ద్వారా వ్యక్తం చేశాడు. ప్రీైక్లెమాక్స్‌లో మూడు నిమిషాల సంభాషణను సింగిల్‌ టేక్‌లో చెప్పాడు. అది హైలైట్‌గా నిలుస్తుంది.

సత్యదేవ్‌తోనే నా తదుపరి చిత్రాన్ని చేయబోతున్నా. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా కథ ఉంటుంది. సీరియస్‌ సినిమాలకు కాస్త విరామం ఇద్దామనుకుంటున్నా’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here