స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు చేస్తానుః ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ రెప‌ల్లె

0
394

చిన్నప్పటి నుంచి విపరీతంగా  పుస్తకాలు చదవడం, హాలీవుడ్‌ చిత్రాలు చూడడం…నేను సినిమా రంగంలోకి రావడానికి ప్రధాన కారణాలయ్యాయి అంటున్నారు సురేష్‌ శేఖర్‌ రేపల్లె. ఆయన దర్శకుడుగా పరిచయం అవుతూ ఉదయ్‌ కిరణ్ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. సాయి రోనక్‌ , నేహ సోలంకి జంటగా నటించిన  ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్‌ శేఖర్‌ రేపల్లెతో చిట్ చాట్…

మీ నేపథ్యం?..
మాది మహిబాద్‌  జిల్లా.  కంబాల పల్లి గ్రామం. నా చదువంతా అక్కడే జరిగింది.  డిగ్రీ పూర్తయ్యాక    బెంగుళూరు లో ఇంటర్నేషనల్‌ కాస్ట్యూమ్స్‌ ఫ్యాక్టరీలో అసిస్టెం ట్‌ మేనేజర్‌గా  చేరాను. ఆ పని నాకు పెద్దగా కిక్‌ అనిపించలేదు. దాంతో ఒక రోజు ఎవరికి చెప్పకుండా చెన్నైలో ఉన్న  మా అన్నయ్య దగ్గరకెళ్లాను. నాకు ఆ వర్క్‌ నచ్చలేదని అన్నయ్యకు చెప్పాను. ఈ క్రమంలో ప్రతి రోజు మేము చెన్నైలో పాండీ బజార్‌కి వెళ్లి భోజనం చేసేవాళ్లం. అక్కడికి ఎక్కువగా సినిమా వాళ్లు వచ్చే వాళ్లు. మా అన్నయ్యకు కూడా చాలా మంది సినిమా వాళ్లతో పరిచయాలుండేవి. అలా సినిమా వాళ్ల మధ్యలో గడపడం… ఆ అట్మాస్పియర్‌ నచ్చి సినిమా ఫీల్డ్‌ కి ఎందుకు వెళ్ల కూడదు అనిపించి …నా అభిప్రాయాన్ని ఓ రోజు మా అన్నయ్యతో చెప్పాను. ‘‘సినిమా ఫీల్డ్‌ అంటే చాలా టఫ్‌ గా ఉంటుంది…అంత ఈజీ కాదు.. బాగా ఆలోచించుకో’’ అన్నాడు.  లేదు  వెళ్తానని పట్టుబ‌ట్టాను. సరేనని ఆర్జీవీ గారి అసిస్టెంట్‌ రమణగారు అన్నయ్యకు చాలా క్లోజ్‌ కావడంతో నన్ను ఆయనకు పరిచయం చేశాడు. నా ఇంట్రస్ట్‌ చూసి డైరక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌లో చేరిపిస్తా రమ్మన్నారు రమణగారు.   కానీ చిన్న ప్రాబ్లమ్‌ వల్ల నేను ఊరెళ్లాల్సి వ‌చ్చి  అప్పుడు వెళ్లలేకపోయాను.  ఆర్నెళ్ల తర్వాత మళ్లీ చెన్నై వెళ్లాను.  అప్పటికే రమణ గారు ఆర్జీవీ గారితో పాటు హైదరాబాద్‌ వెళ్లారని తెలిసి…నేను కూడా మా అన్నయ్యతో చెప్పి హైదరాబాద్‌ వచ్చాను. అప్పటికి ఇక్కడ నాకు ఎవరూ పరిచయం లేదు.  ఫ్రెండ్స్‌ ని ఎంక్వైరీ  చేయగా టెన్త్‌ క్లాస్‌ మిత్రుడు బాలానగర్‌లో ఉంటున్నాడని తెలిసి అక్కడకి వెళ్లాను. ఆ సమయంలో తన వైఫ్‌ డెలివరీకి వెళ్లడంతో నా ఫ్రెండ్‌ రూమ్‌ లో షెల్టర్‌ దొరికింది.  బాలానగర్‌ నుంచి ఫిలింనగర్‌కి వచ్చి సినిమా ప్రయత్నాలు చేసేవాణ్ని. రమణ గారిని కలిశాను కానీ అప్పటికే అక్కడా డిపార్ట్‌మెంట్‌లో చాలా మంది ఉన్నారనడంతో వేరే దగ్గర ప్రయత్నించా. చాలా ఆఫీసులు తిరిగాను. చాలా సార్లు బాలా నగర్‌ నుంచి ఫిలింనగర్‌ కి నడిచొచ్చేవాణ్ని.  కాళ్లకు బొబ్బలు వచ్చేవి.  ఈ క్రమంలో ఒక రోజు డైరక్టర్‌ జయంత్‌ గారిని కలిశాను. నీ స్పెషలైజేషన్‌ ఏంటని జయంత్‌ గారు అడిగారు.  నేను  ఏడో క్లాస్‌ నుంచే మధుబాబు డిటెక్టివ్‌ నవలలు, యండమూరి పుస్తకాలు బాగా చదివేవాణ్ని.  హాలీవుడ్‌ మూవీస్‌ ఎక్కువగా చూసేవాణ్ని.  ఆ అనుభవంతో  నా ఆలోచనలు, నా విజన్‌ గురించి ఆయనకు చెప్పడంతో ఆయనకు బాగా కనక్టయ్యాను. అలా  జయంత్‌ గారి వద్ద  డైరక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌లో చేరాను. అలా ఆయన దగ్గర ‘ప్రేమంటే ఇదేరా’ దగ్గర నుంచి ‘శంకర్‌ దాదా ఎమ్‌బీబీయస్‌’ వరకు చేశాను.  ఆ తర్వాత బయటకొచ్చి సినిమా ప్రయత్నాలు ప్రారంభించా.

‘ఛలో ప్రేమిద్దాం’ ప్రాజెక్ట్‌ ఎలా సెట్టయింది?
నేను జయంత్‌ గారి దగ్గర నుంచి బయటకొచ్చాక చాలా మంది  నిర్మాతలు, హీరోలను కలిశాను. అందరికీ స్టోరీస్‌ నచ్చేవి …కానీ ఏదో ఒక కారణం వల్ల  అవి కార్యరూపం దాల్చేవి కాదు. అలా చాలా టైమ్‌ వేస్టయింది.  ఆ టైమ్‌ లో ఉదయ్‌ కిరణ్‌ గారు పరిచయం అయ్యారు.  ‘సురేష్‌ నీకు  సినిమా ఇస్తానని’ ప్రియుడు సినిమా అప్పుడు మాటిచ్చారు. మాట ప్రకారం సినిమా ఇచ్చారు.  తెలుగు  స్టేట్స్‌ డివైడ్‌ కావడం, కరోనా వీటివల్ల సినిమా కొంత డిలే అయింది. ఇక ప్రస్తుతం ‘ఛలో ప్రేమిద్దాం’ చిత్రం  సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 19న సినిమాను గ్రాండ్‌ గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.

నిర్మాత గురించి చెప్పండి?
ఉదయ్‌ కిరణ్‌ సార్‌ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.  మా ఇద్దరికీ మధ్య పొడ్యూసర్‌ కి, డైరక్టర్‌ కి ఉండే సంబంధం కన్నా  అంతకు మించిన  అనుబంధం ఏదో ఉంది.  సినిమా క్వాలిటీ కోసం  ఎక్కడా రాజీ పడకుండా బడ్జెట్‌ పెట్టారు. పాటలు బాగొచ్చాయని ఆయనే దుబాయ్‌లో  సాంగ్స్‌ చేద్దామని చెప్పి పాండమిక్‌ టైమ్‌ లో తీసుకెళ్లారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దుబాయ్‌ లో మూడు పాటలు పిక్చరైజ్‌ చేసుకోని వచ్చాం.

నటీనటుల గురించి చెప్పండి?
మొదట హీరోగా చాలా మందిని అనుకున్నాం. కానీ ఎవరూ సెట్టవలేదు. ఆ తర్వాత  కాదలి, ప్రెజర్‌ కుక్కర్‌ సినిమాలు చేసిన సాయి రోనక్‌ ని హీరోగా తీసుకున్నాం. తను మంచి డాన్సర్‌, మంచి పర్ఫార్మర్‌. మంచి హీరో అవుతాడు. అలాగే నేహ సోలంకి ని హీరోయిన్‌ గా తీసుకున్నాం.  షూటింగ్‌ లో ఎన్నో సార్లు గాయాలైనా లెక్క చేయకుండా షూటింగ్  చేసింది. ఎమోషనల్‌ సీన్స్‌ అదరగొట్టింది. హీరో ఫాదర్‌ గా పోసాని కృష్ణ మురళి, మదర్‌ గా హేమ నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్‌ హిలేరియస్‌గా ఉంటాయి. అలాగే సిజ్జు గారు డిఫరెంట్‌ రోల్‌ చేశారు. శశాంక్‌, నాగినీడు క్యారక్టర్స్‌  ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. అలీగారు, రఘుబాబు గారు, అదుర్స్‌ రఘు కడుపుబ్బ నవ్వించే క్యారక్టర్స్‌ చేశారు.

 టెక్నీషియన్స్‌ సపోర్ట్‌ ఎలా ఉంది?
భీమ్స్‌ అంటే మాస్‌ సాంగ్స్‌ బాగా చేస్తాడని పేరు. కానీ మా సినిమాకి అద్భతమైన మెలోడీస్‌ ఇచ్చారు.  అంతకు మించి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. అలాగే అజిత్‌ వి.రెడ్డి, జయపాల్‌ రెడ్డి ఎక్స్‌లెంట్‌ సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ఎడిటర్‌ ఉపేంద్ర , ఆర్ట్‌ డైరక్టర్‌ రామాంజనేయులు నాకు మంచి మిత్రులు. వీరి వర్క్‌ సినిమాకు ప్లస్సైంది.

‘ఛలో ప్రేమిద్దాం’ స్టోరి ఏంటి?..
లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు థ్రిల్లర్‌ అంశాలు జోడిరచాము. ఎవరూ ఎక్సెపెక్ట్‌ చేయని విధంగా స్క్రీన్‌ ప్లే, క్లైమాక్స్‌ ఉంటాయి.  యూత్‌, మాస్‌, ఫ్యామిలీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా.

ఫస్ట్‌ కాపీ ఎవరికైనా చూపించారా?
డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూపు వాళ్లకు , డిఫరెంట్‌ బ్యాక్‌ డ్రాప్‌ వాళ్లకు ఇటీవల సినిమా చూపించాము. అందరూ చాలా కాలం తర్వాత క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చూశామని ప్రశంసించారు. అందరూ జెన్యూన్‌ రివ్యూ ఇవ్వడంతో సినిమా పై మా టీమ్‌ అందరికీ  కాన్ఫిడెన్స్‌ వచ్చింది.   ఆడియన్స్‌ నుంచి కూడా ఇలాంటి రెస్పాన్సే వస్తుందని నమ్ముతున్నాం.

ఈ సినిమాతో డైరక్టర్‌ గా  ఎలాంటి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నారు?
ఇది  కొత్త కథని చెప్పను కానీ, ఆడియన్స్‌ ని రెండున్నర గంటలు మాత్రం ఎంగేజ్‌ చేస్తూ ఎంటర్‌టైన్‌ చేయగలనని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. సురేష్‌కి అవకాశం ఇస్తే ఒక మంచి సినిమా చేస్తాడన్న పేరు ఈ సినిమాతో వస్తుంది.

మీకు నచ్చిన దర్శకులు?
తెలుగులో నాకు నచ్చిన దర్శకులు త్రివిక్రమ్‌, రాజమౌళి గారు. ఇక బాలీవుడ్‌ లో రాజ్‌ కుమార్‌ హిరాని అంటే ఇష్టం. ఆయన సోషల్‌ మెసేజ్‌ ని కామిక్‌గా చెప్పే విధానం నాకు చాలా నచ్చుతుంది.

ఈ జర్నీలో మీకు సపోర్ట్‌ చేసే వ్యక్తులు?
నా ఫ్యామిలీఫుల్‌ సపోర్ట్‌.  మా అన్నయ్యలిద్దరూ ఎంతో ప్రోత్సహించారు. నన్ను డైరక్టర్‌గా చూడాలన్నది మా నాన్న కల. కానీ ఆ కల నెరవేరకుండానే చనిపోయారు. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నా సినిమాకుంటాయి. అలాగే ఈ సినిమా విషయానికొస్తే  స్క్రిప్ట్‌ సైడ్‌ ధీన్‌ రాజ్‌ గారు, ప్రసాద్‌ , నాగబాబు  హెల్ప్‌ చేశారు. అలాగే నా డైరక్షన్‌ టీమ్‌ చీఫ్‌ అసోసియేట్‌  నాగేష్‌, కో-డైరక్టర్‌ మురళీ, మేనేజర్‌ శ్రీనివాస్‌  ఎంతో సపోర్ట్‌ చేశారు.

 నెక్ట్స్‌ మీ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయి?
ఏ సినిమా అయినా నేను ప్రొడ్యూసర్‌ ని దృష్టిలో పెట్టుకుని చేస్తాను.  టేబుల్‌ ప్రాఫిట్‌ రాకపోయినా..లాస్‌ మాత్రం రావద్దు అనేది నా కాన్సెప్ట్‌. ఇక యాక్చువల్‌గా నాది ఈ జానర్‌ కాదు. నా స్టోరీస్‌ అన్నీ స్క్రీన్‌ ప్లే బేస్డ్‌ తో ఉంటాయి. రాబోయే సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.  చాలా కథలు తయారు చేసుకున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ వివరాలు త్వరలో వెల్లడిస్తాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here