ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత

0
387

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, రచయిత, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర (74) అనారోగ్యంతో ఏప్రిల్ 28వ తేదీ రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు చంద్ర ఆగస్ట్ 28, 1946లో వరంగల్ జిల్లా జనగామ సమీప గ్రామంలో జన్మించారు. చంద్ర అసలు పేరు మైదం చంద్రుడు, స్కూల్ నాటికి దానిని చంద్రేశ్వర్ గా మార్చారు. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన చంద్రగా ప్రాచుర్యం పొందారు. ప్రముఖ చిత్రకారులు శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్ఫూర్తితో చంద్ర చిత్రలేఖనం వైపు అడుగులు వేశారు. బాల్యం నుండే చిత్రకళ పట్ల మక్కువ ఉన్న చంద్ర… తొలుత పీయుసీ చదివినా, ఆ తర్వాత వివాహానంతరం జె.ఎన్.టి.యు.లో ఫైనార్ట్స్ లో పట్టా అందుకున్నారు. యుక్తవయసులో స్నేహితులు నిర్వహించిన పలు పత్రికలలో పనిచేసిన చంద్ర ప్రధానంగా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ కాలం ఉన్నారు. అయితే మిత్రులు కేతు విశ్వనాథరెడ్డి ఒత్తిడితో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆర్టిస్ట్ గానూ కొన్నేళ్ళు పనిచేశారు.

దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ‘చలిచీమలు’ చిత్రంలో చంద్ర పాఠశాల ఉపాధ్యాయుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. ‘ఊరుమ్మడి బ్రతుకులు, చలిచీమలు, చిల్లర దేవుళ్లు, మంచుపల్లకి’ తదితర చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్షన్ చేశారు. కొన్ని టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. చంద్ర వందకు పైగా కథలూ రాశారు. వేలాది బొమ్మలు గీయడంతో పాటు నవలలు, కథా సంపుటాలు, వ్యాస సంకలనాలకు కవర్ పేజీలు గీశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పలు పత్రికలకు పండగలు, ప్రత్యేక సందర్భాలలో కవర్ పేజీలు వేశారు. మంచి పోర్ట్ రేట్ ఆర్టిస్ట్ కూడా అయిన చంద్ర వేలాది గ్రీటింగ్ కార్డ్ కూ బొమ్మలు వేశారు. ఆయన షష్టి పూర్తి సందర్భంగా వాహిని బుక్ హౌస్ ‘చంద్ర కార్టూన్లు’ పుస్తకం ప్రచురించింది. అలానే 2013లో చంద్ర ‘డస్ట్ బీన్ కార్టూన్లు’ పుస్తకాన్ని తీసుకొచ్చింది. విశేషం ఏమంటే చంద్ర భార్య విజయ భార్గవి వృత్తిరీత్యా టీచర్ అయినా, ఆమె కూడా రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. భార్గవి చంద్ర పేరుతో శోభారాణి, అనురాగ వంచిత, తెగింది తీగ వంటి నవలలు రాశారు. అందులో ‘అనురాగ వంచిత’ నవల ‘ఊర్వశి’ సినిమాగా తెరకెక్కింది. చంద్ర మృతికి పలువురు రచయితలు, కార్టూనిస్టులు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here