డాన్‌శీను, బలుపు వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన చిత్రం `క్రాక్`. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మిశరత్‌కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నాను. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ఇంటర్వ్యూ..
ఈ సంక్రాంతికి వస్తోన్న ఫస్ట్ మూవీ మీదే కదా ఎలా అన్పిస్తోంది?
– 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా హ్యాపీగా ఉంది. అయితే సంక్రాంతికి విడుదలవుతోన్న నా రెండో చిత్రమిది. ముందు ఈ సినిమాని మే8 రిలీజ్చేద్దాం అనుకున్నాం. కాని కరోనా ప్రభావం వల్ల కొంత ఆలస్యం అయింది. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసి పెట్టిందేమో..కాకపోతే ఈ సారి పండగని కొంచెం ముందుగానే మీముందుకు తీసుకువస్తున్నాం. జనవరి 9న రవితేజ గారి కెరీర్లో హైయెస్ట్ గా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.
ఈ సబ్జెక్ట్‌నే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా?
– రవితేజ గారితో ఇంతకుముందు రెండూ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్స్ చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎలాంటి స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో `ఒంగోలులో రాత్రి కరెంట్‌పోతే అక్కడ మర్డర్ జరుగుతుంది..` అని చెప్పుకునే వారు. ఇలాంటి మరి కొన్ని సంఘటనల్ని కూడా నేను విన్నాను..సర్పయాగం సినిమాలో ఇలాంటి కొన్ని సన్నివేశాల్ని మనం చూడొచ్చు. అలాగే మా ఊరి దగ్గరలో కొంత మంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్ది సేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలను ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకోవడం జరిగింది. రియల్ క్యారెక్టర్స్ ను తీసుకుని కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ఇది.
రవితేజగారి క్యారెక్టర్‌కి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా?
– ఉన్నారు. ఆ సమయంలో ఉన్నఒక సీఐ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అలాగే కర్నూల్ నేపథ్యం ఉంటుంది, హీరో నేచర్ కొద్దిగా ఎగ్రెసివ్‌గా ఉండండం వల్ల ఇది మరి కొద్ది మందికి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.
ట్రైలర్లో రాత్రి పూట వచ్చే విజువల్స్ చూస్తుంటే గూస్బమ్స్ వచ్చేలా ఉన్నాయి..
– అవునండీ.. మేం తీసుకున్న బ్యాక్‌డ్రాప్ సరికొత్తది కావడంతో విజువల్స్ చాలా ఫ్రెష్‌గా వచ్చాయి. ఆ చేలలో వచ్చే సన్నివేశాల్ని చీరాల దగ్గరలో తెరకెక్కించాం. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, స్టువర్ట్పురం, చినగంజం, లాంటి కోస్టల్ ప్రాంతాల్లో అలాంటి సంఘటనలు జరిగాయి. ఆ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకుని దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి, రవితేజగారినుండి అభిమానులు ఆశించే అన్నిఅంశాలు ఉండేలా చిత్రాన్ని తెరకెక్కించాం. సాయి మాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ అందించారు. మెర్సిల్, బిగిల్ వంటి చిత్రాలకు పని చేసిన జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటో్గ్రాఫర్గా పరిచయమవుతున్నారు.
మీ అబ్బాయి సాత్విక్ని ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశారు కదా?
– ముందు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే హీరో కొడుకు పాత్రకోసం ఆడిషన్ చేసినప్పుడు ఎక్కడో న్యాచురాలిటీ మిస్ అయింది అనిపించింది. మా వాడు ఇంట్లో హైపర్ యాక్టివ్‌గా ఉంటాడు, న్యాచురల్‌గా మాట్లాడుతుంటాడు వీడు అయితే బాగుంటుంది అని కెమెరామెన్‌ని ఫోటో చూపించాను. బాగున్నాడు ఇతన్నే ఫైనల్ చేద్దాం అన్నప్పుడు వీడు నా కొడుకే అని చెప్పాను. అందరూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రవితేజగారు, శృతిహాసన్ కాంబినేషన్లోనే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయి వాడికి. చాలా న్యాచురల్ గా చేశాడు అని రవితేజగారు చెప్పారు. అలాగే శృతికి, వాడికి బాగా సింక్ అయింది.
ఈ సినిమాలో కామెడీకి ఎంత స్కోప్ ఉంటుంది?
– రవితేజ గారి క్యారెక్టర్లో కామెడీ యాంగిల్ కూడా ఉంటుంది అయితే అది కథతో పాటే వెళ్తుంది తప్ప ఎక్కడా కావాలని ఇరికించినట్టు ఉండదు. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్. బలుపు తర్వాత రవితేజ గారు అంత అందంగా. ఎనర్జిటిక్ గా కనిపించిన చిత్రమిదే..
నెగెటివ్ పాత్రలలో ఎక్కువ మంది ఆర్టిస్టులని పెట్టడానికి రీజనేంటి?
– మేం ట్రైలర్లో మూడు ఎలిమెంట్స్ ముగ్గురితో ఆడుకున్నాయి అని చెప్పాం. అయితే కామన్‌గా ఆ ముగ్గురి లైఫ్‌లో ఉన్నది ఒక్క పోలీస్ ఆఫీసరే..వారితో ఎలా కనెక్ట్ అయ్యాడు అనే స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సముద్రఖని గారు కటారి కృష్ణ గా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. అలాగే వరలక్ష్మి కూడా జయమ్మ అనే రియల్ క్యారెక్టర్ చేసింది. కథానుగుణంగానే మిగతా పాత్రలు వస్తుంటాయి.
మీ బావ (తమన్) గురించి చెప్పండి?
– డాన్‌శీను మినహ నా చిత్రాలన్నింటికీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు తమన్ మణిశర్మగారి దగ్గర వర్క్ చేసేవాడు అప్పటినుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. వ్యక్తగతంగా కూడా మంచి రిలేషన్ ఉంది. వీటన్నింటికీ మించి నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడు అని నేను నమ్ముతాను. ఎందుకంటే నా విషయంలో తమన్ ఎప్పుడూ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి కూడా బ్రహ్మండమైన ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే సినిమా రిలీజైన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి తప్పకుండా మాట్లాడతారు.
నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది?
– నెక్ట్ మూవీ మైత్రి మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
* సోలో బ్రతుకే సినిమా విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలై బాగా ఆడుతోంది అని దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారు అనేది ప్రూవ్ అయింది. డైఫినెట్గా ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ఆదరించి మరోసారి ప్రూవ్చేస్తారని అనుకుంటున్నాను.