నా కెరీర్ లో ఓ మైలురాయి “అన్నపూర్ణమ్మ గారి మనవడు”: సీనియర్ నటి అన్నపూర్ణమ్మ

0
551

తెలుగు, తమిళ సినీరంగాకు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు మహానటి జమున నటించిన చిత్రం ”అన్నపూర్ణమ్మ గారి మనవడు”. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మ గా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించారు. హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా కరోనా కారణంగా ధియేటర్స్ మూతపడటంతో ముందుగా ఈ చిత్రం ఓవర్సీస్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇటీవల విడుదలై విదేశాలలో విజయం సాధించింది. ధియేటర్స్ ఓపెన్ కాగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టైటిల్ పాత్రధారిని, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, “నా కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయే చిత్రమిది. 45 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్ పాత్రను ఇంతవరకు చేయలేదు. అందునా ఓ చక్కటి కుటుంబ కథా చిత్రంలో నటించడం మహదానందంగా ఉంది. మనవడి పాత్రధారి మాస్టర్ రవితేజతో పాటు ఇతర ఆర్టిస్టులు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు ప్రతీ పాత్రను అద్భుతంగా మలిచారు. ఇక నిర్మాత అభిరుచి కూడా ఈ చిత్రం ఎంతో బాగా రావడానికి దోహదం చేసింది”అని అన్నారు.

మాస్టర్ రవితేజ మాట్లాడుతూ, ప్రముఖ సీనియర్ ఆర్టిస్టులతో కలసి నటించడం ఆనందంగా ఉందన్నారు.

హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, ఇందులో నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రను పోషించాను. హెవీ సీన్స్ తో పాటు ఎమోషన్స్ ఉన్న పాత్ర నాది. చిత్రంలోని ప్రతీ పాత్రకు దర్శకుడు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పారు.

చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) మాట్లాడుతూ,
యు.ఎస్. తో పాటు ఓవర్సీస్ లోని పలు దేశాలలో తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ వంటి నాలుగు భాషలలో ఒకేసారి అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై విజయం సాధించడం ఎనలేని ఆనందంగా ఉంది. కథకు తగ్గట్టుగా పాత్రధారులను ఎంపికచేసుకుని…సహజత్వం ఉట్టిపడేలా పల్లెటూళ్లకు వెళ్లి ఎంతో శ్రమకోర్చి తీసిన చిత్రమిది. నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి అభిరుచితో పాటు బడ్జెట్ పరంగా రాజీపడని మనస్తత్వం కారణంగా ఈ చిత్రాన్ని చాలా బాగా తీయగలిగాను. అక్కినేని అన్నపూర్ణమ్మగా అన్నపూర్ణమ్మ అద్భుతమైన నటన ను పలికించారు. సీనియర్ నటి జమున అక్కినేని అనసూయమ్మగా అలరిస్తారు అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి మాట్లాడుతూ, విదేశాలలో ఉన్న ప్రేక్షకులను ముందుగా ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలో తెలుగుతో పాటు నాలుగు భాషల ప్రేక్షకులను అలరింపచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

అతిథులుగా విచ్చేసిన నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, స్వచ్ఛమైన పల్లెటూరి కధాంశంతో తీసిన చిత్రాలెన్నో ఘన విజయం సాధించాయని… అలాగే నానమ్మ, మనవడు ప్రధాన అంశం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ కోవలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విలన్ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్ ప్రతినిధి రాజీవ్, సీనియర్ పాత్రికేయులు వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో శ్రీలక్ష్మి, ప్రభ, జయంతి, సుధ, సంగీత, జయవాణి, బెనర్జీ, రఘుబాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, జీవాలతో పాటు పలువురు తమిళ, మలయాళ నటీనటులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్, ఎడిటింగ్: వాసు, నిర్మాత: ఎం. ఎన్. ఆర్ చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు).

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here