లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మోడీ బయోపిక్ ‘మనో విరాగి’

1
656

గౌరవనీయులైన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘మనో విరాగి’. తెలుగు, తమిళ భాషలలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల చేయనున్నారు. ఎస్. సంజయ్ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా పోస్టర్లు విడుదల చేశారు.

‘మనో విరాగి’లో నరేంద్ర మోడీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్నారు. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లోని వాద్ నగర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ సమర్పకులుగా వ్యవహరించిన లైకా ప్రొడక్షన్స్ అధినేత ఎ. సుభాస్కరన్, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ‘2.0’, ‘దర్బార్’ చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’, మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నవాబ్’ చిత్రాలనూ నిర్మించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ‘పొన్నియన్ సెల్వన్’, కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో ‘ఇండియన్ 2’ చిత్రాలు నిర్మిస్తున్నారు.

‘మనో విరాగి’ గురించి ఎ. సుభాస్కరన్ మాట్లాడుతూ “ప్రధాని మోడీ గారి టీనేజ్ జీవితంలో ముఖ్యమైన మలుపులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో సమర్పిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం” అని అన్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మహేష్ లిమయే, సహ నిర్మాణం: జనహిత్ మే జారీ ప్రొడక్షన్, రచన-దర్శకత్వం: ఎస్. సంజయ్ త్రిపాఠీ, నిర్మాణం: సంజయ్ లీలా భన్సాలీ, మహావీర్ జైన్, సమర్పణ: లైకా ప్రొడక్షన్స్

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here