కుటుంబ విలువలు, భావోద్వేగాల ప్రధానంగా సాగే సెటైరికల్ ఎంటర్‌టైనర్ మా జీవితాలతో పాటు సమాజంలో మేము చూసిన వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించాం’ అని అన్నారు దర్శకద్వయం సుజోయ్, సుశీల్. వారు దర్శకత్వం వహిస్తూ అప్పిరెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘ప్రెషర్‌కుక్కర్’. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించారు. ఈ నెల 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సుజోయ్, సుశీల్ పాత్రికేయులతో ముచ్చటించారు.
స్వదేశంలో ఉంటూ జీవితంలో ఎలా గెలవొచ్చు..
చదువులు, ర్యాంకుల పేరుతో యువతరంపై ఒత్తిడి పెరుగుతున్నది. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే పిల్లల్ని విదేశాలకు పంపించాలనే సంస్కృతి పెరిగింది. అలాంటి ఒత్తిడిలతో నిరంతరం సతమతమయ్యే ఓ మధ్య తరగతి యువకుడి కథ ఇది.ఈ క్రమంలో అతడు ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడు? తన కలల్ని వీడి మరో దారిలో అతడు ఎందుకు ప్రయాణించాల్సివచ్చింది? అనే అంశాన్ని వినోదాత్మక పంథాలో ఈసినిమాలో ఆవిష్కరించాం. విదేశాల్లో స్థిరపడిన పిల్లల కారణంగా వృద్ధాప్యంలో అసరా లేక తల్లిదండ్రులు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటారోననే సందేశాన్ని అంతర్లీనంగా చూపించాం. స్వదేశంలో ఉంటూ జీవితంలో గెలవవచ్చునని ఓ యువకుడు ఎలా నిరూపించడాన్నది స్ఫూర్తివంతంగా ఉంటుంది. హితభోద చేసినట్లుగా కాకుండా వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమాను రూపొందించాం. ప్రథమార్థం ఆహ్లాదభరితంగా ఉంటుంది. ద్వితీయార్థం ఎమోషనల్‌గా సాగుతుంది.
భయం ఉంటేనే మంచి సినిమా చేయగలం!
స్టార్ హీరోతో సినిమా చేస్తే విడుదల చేయడం సులభమవుతుంది. పేరున్న హీరోల చిత్రాలకు ఓపెనింగ్స్ బాగుంటాయనే నమ్మకం పంపిణీదారుల్లో ఉంటుంది. కొత్త హీరోలు నటించిన సినిమాలు విడుదలచేయడానికి పంపిణీదారులు సాహసం చేయరు. ఈ సినిమాతో మేము తెలుసుకున్న వాస్తవమిదే. ఆ రిస్క్‌ను దాటాలనే ఆలోచనతో చాలా మందికి ఈ సినిమా చూపించాం. కథ నచ్చడంతో అభిషేక్ పిక్చర్స్ వారు సినిమా విడుదలచేయడానికి ముందుకొచ్చారు. కష్టం, భయాలు ఉంటేనే మంచి సినిమా చేయగలుగుతాం.
కంటెంట్ ఈజ్ కింగ్!
ప్రస్తుతం తెలంగాణ నేపథ్య కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. ఆ ఫార్ములాను ఫాలో అవుతూ విజయాన్ని అందుకోవాలని అనుకోలేదు. తెలంగాణలోనే పుట్టిపెరిగాం. నిజజీవితంలో మేము తెలంగాణ యాసతోనే మాట్లాడుతుంటాం. మాకు తెలిసిన భాషలోనే సినిమా చేయాలనే తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నాం. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. కంటెంట్‌ఈజ్ కింగ్ అనే భావన బలపడింది. మంచి సినిమా చేస్తే ఆదరిస్తారనే నమ్మకంతో రూపొందించాం