‘హుషారు’, ‘కబాలి’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’, ‘రాజుగారిగది3 ‘ వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రస్తుతం ‘యాక్షన్’ మూవీతో నిర్మాతగా మారారు శ్రీనివాస్ ఆడెపు. మాస్ హీరో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’ శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత, శ్రీకార్తికేయ సినిమాస్ అధినేత శ్రీనివాస్ ఆడెపు ఇంటర్వ్యూ..
మీ గురించి చెప్పండి?
– నేను గత 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను. అది అంత శాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. తర్వాత డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ క్రమంలోనే బి ఏ రాజు గారి బేనర్లో వచ్చిన ‘గుండమ్మగారిమనవడు’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఆ సినిమాకు జయ గారు దర్శకురాలు. ఇప్పటికీ ఆ సినిమాకు వారు ఇచ్చిన లోగో నా దగ్గరే ఉంది. ఆతరువాత 6 -7 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో- డైరెక్టర్‌గా చేశాను.
మన ఓన్ ప్రొడక్షన్‌లో మనమే ఎందుకు దర్శకత్వం చేయకూడదు అనుకొని ఎగ్జిబిటర్ గా మారి అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, లెజెండ్ సినిమాలు చేశాను. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా మారి ‘హుషారు’, ‘కబాలి’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’, ‘రాజుగారిగది3` లాంటి సినిమాలు చేశాను. అన్ని సినిమాలు నాకు మంచి పేరు తీసుకువచ్చాయి. అలాగే ఇప్పుడు యాక్షన్ చిత్రంతో నిర్మాతగా మీ ముందుకు వస్తున్నాను.
ఈ సినిమాతోనే నిర్మాతగా మారడానికి కారణం ఏంటి?
– యాక్షన్ మూవీ టీజర్ చూడగానే నాకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించి వెంటనే వెళ్లి ఆ సినిమా రైట్స్ కొనడం జరిగింది. నేను డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా రాణించడంతో వారు ఒప్పుకున్నారు. నేను ఇదివరకే నా స్నేహితుడితో కలిసి ప్రిన్స్ హీరోగా మా నిర్మాణంలో ఒక సినిమా ప్రారంభించడం జరిగింది. అయితే యాక్షన్ మా బ్యానేర్ లో రిలీజయ్యే మొదటి సినిమా. నాకు ఈ సినిమామీద 200 శాతం నమ్మకం ఉండబట్టే ఒక చాలెంజింగ్ గాతీసుకొని బాగా ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నాను. అలాగే దాదాపు 600 థియేటర్స్ కి పైగా ఈ సినిమా విడుదలవుతుంది. మా బేనర్ లో ఫస్ట్ మూవీనే ఇంత లార్జర్ స్కెల్లో రిలీజవడం చాలా సంతోషంగా ఉంది.
యాక్షన్ మూవీ ఎలా ఉండబోతుంది?
– యాక్షన్ మూవీ ఆడియన్స్ కి, విశాల్ అభిమానులకి ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది. సినిమా చాలా గ్రాండియర్ గా ఉండి యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా నేను తీసుకోవడానికి ఈ సినిమా మేకింగ్ కూడా ఒక కారణం. అలాగే కెజిఎఫ్ సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంబు, రవి వర్మ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్ ని మనం ఇప్పటికి మరచిపోలేము. ఈ సినిమాతో మరో సారి ఆ ఎలివేషన్స్ కి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సినిమా లో కొన్ని సీన్లు నెక్ట్ లెవల్లో ఉంటాయి. విశాల్ కెరీర్‌లోనే ‘యాక్షన్’ మూవీ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందనే నమ్మకం ఉంది.
డైరెక్టర్ సుందర్.సి గురించి?
– డైరెక్టర్ సుందర్.సి గారి మేకింగ్ గురించి చెప్పేంత పెద్ద వాడిని కాదు. ఆయన సినిమాల గురించి మనకు తెలిసిందే నాకు ఆయన దర్శకత్వంలో వచ్చిన `సత్యం శివమ్` సినిమా అంటే చాలా ఇష్టం. యాక్షన్ మూవీ ఆయన అన్ని సినిమాలకు డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాగైనా విశాల్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.
డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చారు కదా! మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం?
– నాకు పర్సనల్ గా హ్యూమన్ ఎమోషన్స్ ని క్యారీ చేసే మూవీస్, మానవతా విలువలు ఉండే మూవీస్ అంటే ఇష్టం. దర్శకుడిగా తప్పకుండా త్వరలోనే మంచి మూవీ తీస్తాననే నమ్మకం ఉంది. ‘రుద్రవీణ’ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇండస్ట్రీ కి రావడం జరిగింది.
డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం కష్టమా? నిర్మాతగా ఉండడం కష్టమా?
– నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఉండడం రెండు కష్టమే. ఎందుకంటే ఇండస్ట్రీలో దేని పోరాటం దానిదే. నిర్మాతగా ఎంటంటే కృష్ణుడిలా రథం లాగడం, డిస్ట్రిబ్యూటర్ అంటే అర్జనుడిలా యుద్దం చేయడం లాంటిది.
రానాతో రాప్ సాంగ్ చేపించాలనే ఆలోచన ఎవరిది?
– అది నేను విశాల్ అన్న కూర్చొని అనుకోవడం జరిగింది. తెలుగులో ఏదయినా సంథింగ్ స్పెషల్ గా, ఇన్నోవేటివ్‌గా ఉండాలి అని అనుకోని రాప్ చేపించడం జరిగింది. రానా గారి వాయిస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసు అందుకే నేను విశాల్ అన్న అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్‌తమిళ కూర్చొని ఈ సాంగ్ చేశాం. ఆ పాటకు మంచి క్రేజ్ వచ్చింది.
హీరోయిన్ తమన్నా గురించి?
– తమన్నా ఎంత మంచి పెర్ఫార్మర్ అనేది తెలుసు. అయితే గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ లో ఆమె రోల్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి మనతో పాటు ట్రావెల్ అయింది. ఈ సినిమాలో కూడా చాలా కష్టమైన, రీస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. తప్పకుండా యాక్షన్ సినిమా కూడా ఆమెకి మంచి పేరు తీసుకువస్తుంది అని నమ్ముతున్నాను.


