దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు. ప్రకాష్ కోవెలమూడి ఇప్పటికే నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. 2004 లో వచ్చిన బొమ్మలాట, ప్రకాష్ కి దర్శకుడిగా మొదటి చిత్రం. ఆ తర్వాత 2011 లో అనగనగా ఓ ధీరుడు, 2015 లో సైజ్ జీరో సినిమాలకి దర్శకత్వం వహించారు. ఎప్పటి నుంచో హిందీ లో కూడా అరంగేట్రం చేయాలి అనుకుంటున్న ప్రకాష్ కోరిక రేపటి తో తీరనుంది.
బాలీవుడ్ లో మంచి జోరు మీదున్న రాజ్ కుమార్ రావ్, మరియు కంగనా రనౌత్ లని హీరో హీరోయిన్లు గా పెట్టి ఆయన తీసిన సినిమా ‘జడ్జ్మెంటల్ హై క్యా’ రేపే విడుదల కానుంది. మన్మర్జియా, కేదార్నాథ్ వంటి హిందీ సినిమాల కి రచన చేసిన ప్రకాష్ సతీమణి కనికా థిల్లాన్ ‘జడ్జ్మెంటల్ హై క్యా’ కి కూడా రచయిత్రి గా వ్యవహరించారు. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు సినిమా మీద పాజిటివ్ టాక్ తీసుకొచ్చిన తరుణం లో, ఈ సినిమా ని బాలీవుడ్ లో మీడియా కి ప్రత్యేకం గా ఒక షో వేసి చూపించారు.
అనూహ్యంగా ఈ సినిమా కి బాలీవుడ్ మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దాదాపు బాలీవుడ్ విమర్శకులు అంతా ఏకాభిప్రాయం తో సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


