విలక్షణ చిత్రాల ఎంపికలో ఎప్పుడూ ముందుండే తమిళ నటుడు సూర్య, మరొకసారి వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం కాప్పన్. ఇదివరకు సూర్య హీరోగా వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై మంచి పేరు సంపాదించింది. ఇక తెలుగులో ఇటీవలే ఈ చిత్రానికి బందోబస్త్ అనే టైటిల్ ని కూడా నిర్ణయించడం జరిగింది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ అయిన సోనీ మ్యూజిక్ వారు భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం.
సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సాయేషా మరియు ఆర్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. థ్రిల్లర్ కథాంశంతో సూర్య స్పెషల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన హరీష్ జయరాజ్ సంగీత సారథ్యంలోని పాటలను త్వరలో చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు సమాచారం…..!!


