2.30గంల సినిమా.. ఆ సినిమాలో ప్రేక్షకుడిని అంతసేపు కూర్చుండబెట్టడం అంటే మాటలు కాదు.. ఎక్కడ బోర్ కొట్టనివ్వద్దు.. అలరించాలి.. ఆ లోకంలోకి తీసుకెళ్లాలి. ఇది టఫ్ జాబ్. టాలీవుడ్ ప్రారంభమైనప్పటి నుంచి వేల సినిమాలొచ్చాయి. అన్నీ అలరించాయి. కొన్ని జానపదం, కొన్ని పౌరాణికం.. కొన్ని కమర్షియల్, కామెడీ, హర్రర్ ఇలా ఎన్నో చిత్రాలు టాలీవుడ్ లో తిరుగులేని విజయాలను సాధించిపెట్టాయి. కానీ కమర్షియల్ కోణంలో సందేశాలు ఇచ్చి హిట్ కొట్టిన దర్శకులు కొందరే ఉన్నారు.
తెలుగునాట సందేశాత్మక చిత్రాలు తీస్తూ హిట్ కొట్టిన దర్శకుల్లో దాసరి నారాయణ రావు ముందున్నారు. ఆయన తీసిన చిత్రాల్లో ఎన్నో సామాజిక అంశాలపై సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో ఆయన కమర్సియల్ చిత్రాల్లో సందేశాలను జోడిస్తూ గ్రాండ్ హిట్స్ కొట్టారు.
ఇక ఆ తర్వాత తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక సామాజిక ఇతివృత్తాన్ని సమస్యను తీసుకొని సినిమాగా మలిచి అద్భుత విజయాలను అందుకున్నారు..
ఇక తెలుగులో కొరటాల శివ సామాజిక చిత్రాలు తీయడంలో అందవేసిన చేయి. ఈయన మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్ని చిత్రాల్లో ఏదో ఒక సామాజిక కోణాన్ని లేవనెత్తి అద్భుతంగా సినిమాగా మలిచి విజయాలను సొంతం చేసుకున్నారు..
తాజాగా వచ్చిన ‘మహర్షి’తో సామాజిక అంశాలను తాను తీయగలనని.. తనకూ ఆ సత్తా ఉందని నిరూపించుకున్నారు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. విద్యా, రైతుల సమస్యలపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సామాజిక అంశాలను అంతే సామర్థ్యంతో వంశీ పైడిపల్లి అద్భుతంగా ఆవిష్కరించారు. ఇలా తెలుగులో సందేశాన్ని, సామాజికకోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకులు హిట్స్ కొడుతున్నారు.


