‘118’ రివ్యూ

0
185

రివ్యూ: 118

ఇండస్ట్రీహిట్‌.కామ్‌ రేటింగ్‌: 3.25

బేనర్‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌

తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే, నాజర్‌, హరితేజ, రాజీవ్‌ కనకాల, ప్రభాస్‌ శ్రీను తదితరులు

సంగీతం: శేఖర్‌ చంద్ర

ఎడిటింగ్‌: తమ్మిరాజు

నిర్మాత: మహేశ్‌ ఎస్‌. కోనేరు

కథ, కథనం, ఛాయాగ్రహణం, దర్శకత్వం: కె.వి. గుహన్‌

విడుదల తేది: మార్చి 1 2019

విభిన్నమైన ప్రయోగాలు చేసే హీరోల్లో డేరింగ్‌ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ ఎప్పుడూ ముందుంటారు. అలాగే తమదైన ముద్ర వేయాలన్న తపనతో కొత్త దర్శకుల్ని, కొత్త కథల్ని ప్రోత్సహిస్తుంటాడు. ‘అతనొక్కడే, పటాస్‌’ చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పట్టాయి. అటు క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకొంటూనే కెరీర్‌పరంగా దూసుకుపోతున్నాడు కల్యాణ్‌ రామ్‌. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి. గుహన్‌ని దర్శకుడిగా పరిచయంచేస్తూ ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌.కోనేరు నిర్మాతగా రూపొందిన ప్రయోగాత్మక చిత్రం ‘118’. ఈ చిత్రంలో షాలిని పాండే, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్‌ అయింది.

కథ:

ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా వర్క్‌ చేస్తుంటాడు గౌతమ్‌ (కళ్యాణ్‌ రామ్‌). ఎలాంటి ఇష్యూ అయినా ధైర్యంగా జనాలకి తెలియజేయడం గౌతమ్‌ స్పెషాలిటీ. అలాంటి ఒక సందర్భంలో ఎన్నికల కోసం తరలిస్తున్న డబ్బుని పోలీస్‌ లకు పట్టిస్తాడు. అలాంటి గౌతమ్‌ ఒకసారి ట్రెక్కింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ప్యారడైజ్‌ రిసార్ట్‌లో 118 రూమ్‌లో స్టే చేస్తాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా 1:18 గంటలకి ఒకమ్మాయిని కొంతమంది దుండగులు కొడుతున్నట్లు, వారి నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ప్రయత్నిస్తునట్లు, ఒక కారును చెరువులోకి తోసేస్తున్నట్లు కలగంటాడు. మొదటిసారి అది సాధారణ కల అని లైట్‌ తీసుకున్నా.. అదే కల మళ్ళీ మళ్ళీ వస్తుండడంతో అసలు ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే ఉందా? అనే సందేహంతో ఇన్విస్టిగేషన్‌ మొదలెట్టిన గౌతమ్‌కి షాకింగ్‌ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ కలలో కనిపించిన అమ్మాయి ఎవరు? గౌతమ్‌ కలలోకే ఎందుకు వస్తుంది? వంటి ప్రశ్నలకు సమాధానాల రూపవే ‘118’ చిత్రం.

నటీనటుల పనితీరు:

జర్నలిస్ట్‌ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఏదో తెలుసుకోవాలి అనే తపన అతడి పాత్రలో మాత్రమే కాకుండా కళ్ళల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో కొత్త లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు కళ్యాణ్‌ రామ్‌. కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌. షాలిని పాండే (మేఘ ప్రియ) రోల్‌ చిన్నదే అయినా.. ఉన్నంతలో క్యూట్‌గా కనిపించి అలరించింది. సెకండాఫ్‌ లో ఎంట్రీ ఇచ్చినా.. తను స్క్రీన్‌పై ఉన్న 20 నిమిషాల్లోనే ప్రేక్షకులందర్నీ తనదైన మార్క్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ అటెన్షన్‌ని తన వైపుకు తిప్పుకుంది నివేదా థామస్‌. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నివేదా నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఎస్తర్‌ క్యారెక్టర్‌ పోషించిన హరితేజ సెటిల్డ్‌ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే నాజర్‌, రాజీవ్‌ కనకాల, ఆదర్శ్‌, ప్రభాస్‌ శ్రీను, శ్రవణ్‌, హర్షవర్ధన్‌, జె.సి రవీందర్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

శేఖర్‌ చంద్ర సంగీతం బాగుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా ఇంపార్టెంట్‌. సినిమాలోని కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసి హాలీవుడ్‌ సినిమాలను గుర్తు చేయడం గమనార్హం. వెంకట్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మేకింగ్‌ పరంగా మహేశ్‌ ఎస్‌. కోనేరు నిర్మాణ విలువలు బాగున్నాయి. సన్నివేశాలకి తగ్గట్లుగా ప్రతి విజువల్‌ చాలా రిచ్‌గా ఉంది. ‘మిర్చి’ కిరణ్‌ డైలాగ్స్‌ బావున్నాయి. ముఖ్యంగా ‘స్టార్ట్‌ చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే నాకు చిన్నప్పట్నుంచీ చెడ్డ చికాకు.. ఏంటో వెధవ క్యూరియాసిటీ’, వంటి పలు డైలాగ్‌లకు ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ఎడిటర్‌ తమ్మిరాజు పనితనం బాగుంది. ఇక చిత్ర ఛాయాగ్రహకులు, దర్శకుడు కె.వి.గుహన్‌ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వతహాగా సినిమాటోగ్రాఫర్‌ కాబట్టి సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా ఉంది. స్క్రీన్‌ప్లేలోకానీ, కథను చెప్పడంలో కానీ ఎక్కడా ఎలాంటి కన్‌ఫ్యూజ్‌ లేకుండా తను అనుకున్నది స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశారు. సెకండాఫ్‌లో ఒక్కొక్క ట్విస్ట్‌కి లాజికల్‌గా సమాధానాలు చెప్తూ ఆడియన్స్‌ పల్స్‌ పట్టుకోవడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు.

విశ్లేషణ:

ఈ తరహా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఎండింగ్‌లో కన్‌క్లూజన్‌ ఇవ్వడం అనేది చాలా కష్టతరమైన పని. ఇందులో నాజర్‌ హీరోని తనకి వచ్చిన కలలోకి తననే తీసుకెళ్ళడం, అలాగే హీరో తన డ్రీమ్‌లోకి తనే వెళ్ళి జరిగిందంతా తెలుసుకోవడం అనే ఎగ్జయిటింగ్‌ పాయింట్‌ని దర్శకుడు గుహన్‌ చాలా బాగా డీల్‌ చేసి తొలి సినిమాతోనే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిపించుకుంటున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్ట్‌ పాత్ర పోషించి అటు ఆడియన్స్‌తో పాటు ఇటు జర్నలస్ట్‌ల ప్రశంసలు పొందుతున్నారు. 118 ఫిలిం కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మెమోరబుల్ గా నిలుస్తుంది. అలాగే జర్నలిస్ట్‌ మహేశ్‌ కోనేరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌ గౌతమ్ కథను సినిమాగా తీసి అందరి అభినందనలు అందుకుంటున్నారు.

బొటమ్ లైన్ : ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా అందరిని అలరరించే సినిమా ‘118’

-సిద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here