సుశాంత్‌, రుహని శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరుని సినీ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో జస్వంత్‌ నడిపల్లి, భరత్‌కుమార్‌ మలశాల, హరి పులిజల నిర్మాతలుగా రూపొందిన చిత్రం ‘చి||ల||సౌ’. ఈ చిత్రం ఆగస్ట్‌ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌తో ఇంటర్వ్యూ…

యాక్టర్‌గా ఉన్న మీరు డైరెక్టర్‌గా ఎందుకు మారారు?
– నిజానికి నేను ఉద్యోగం వదిలేసి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవుదామనే ఇండస్ట్రీలోకి వచ్చాను. చాలా మంది దర్శకులను కలవడానికే నాకు కుదిరేది కాదు. ఆ గ్యాప్‌లో ముంబైలో కొన్ని యాడ్స్‌ చేశాను. ఆ యాడ్‌ను చూసిన ఓ యూనిట్‌ నన్ను పిలిచారు. నేను హైదరాబాద్‌ వచ్చాను. ఓ కో డైరెక్టర్‌ నన్ను ఆడిషన్‌ చేశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలంటే ఆడిషన్‌ ఇవ్వాలేమో అనుకుని ఆడిషన్స్‌ ఇచ్చాను. చివరకు ఉండబట్టలేక ఆడిషన్‌ ఎందుకు సార్‌ అన్నాను. హీరో కోసమని అన్నారు. సరే ముందు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దాం.. తర్వాత డైరెక్షన్‌ గురించి ఆలోచించవచ్చు అనిపించి.. రెడీ అయిపోయాను. అలా హీరోగా మారిన తర్వాత హీరోగా కంటిన్యూ అయిపోయాను. నాలుగేళ్ల నుండి డైరెక్షన్‌ చేయాలని గట్టిగా అనుకున్నాను. చి||ల||సౌ కథను పదేళ్ల ముందు నుండే తయారు చేసుకోవడం వల్ల ఈ కథతో పాటు మరో రెండు స్క్రిప్ట్స్‌ పట్టుకుని రెడీ అయ్యాను.

సుశాంత్‌తోనే సినిమా ఎందుకు చేయాలనుకున్నారు?
– నాకు సుశాంత్‌ వ్యక్తిగతంగా పరిచయం ఉంది. తనను చైతన్య, సమంత పెళ్లిలో కలిశాను. ఏ సినిమాలు చేస్తున్నావ్‌ అని అడిగాను. ‘కథలు వింటున్నాను. కానీ.. ఏదీ ఫైనలైజ్‌ చేయడం లేదు. . నేను ఓ ఫార్మేట్‌ మూవీలే చేయాలని కొందరు చెప్పడంతో చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు వాటి వల్ల పెద్ద ఉపయోగం కలగలేదు. ఎదైనా కొత్తగా చేయాలని ఉంది. గట్సి డిసిషన్స్‌ తీసుకోవాలి.. అలా తీసుకున్నప్పుడు ఉపయోగం ఉంటుంది’ అన్నాడు. సరేనని నేను అప్పుడేం మాట్లాడకుండా వచ్చేశాను. తర్వాత తనతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. రెండు కథలు అనుకుని తనకు ఫోన్‌ చేసి ‘నిన్ను కలవాలి సుశాంత్‌’ అనగానే ..సరేనని తను నన్ను కలిశాడు. ‘నేను ఓ కథ చెబుతాను. వింటావా?’ అన్నాను. ‘ఎవరు డైరెక్టర్‌?’ అన్నాడు తను. నేనే అని చెప్పాను. ‘నువ్వు డైరెక్షన్‌ కూడా చేస్తావా?’ అన్నాడు. అప్పుడు తనకు నేను అసలు విషయం చెప్పాను. ‘నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ నేను ప్రొడ్యూస్‌ చేసుకున్నవే. నీ సినిమాని నేను ప్రొడ్యూస్‌ చేస్తానని అనుకోకు. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా చేయాలనుకున్నా.. అది బయట బ్యానర్‌లో చేయాలనుకుంటున్నా’ అని సుశాంత్‌అన్నాడు. అప్పటి వరకు సుశాంత్‌ హీరో అని తెలుసు కానీ తన సినిమాలేవీ నేను చూడలేదు. అలాగే తన సినిమాలను తన ప్రొడక్షన్‌లోనే చేసుకున్నాడని కూడా నాకు ఐడియాలేదు. ‘నీకు కథ నచ్చితే ఎలాగో ప్రొడ్యూసర్‌ని నేను తెచ్చుకుంటాను.. ముందు కథ విను’ అన్నాను. తను సరేనని కథ విన్నాడు. తనకు ముందు నేను వేరే కథ చెప్పాను. ‘ఇది నచ్చకపోతే ఓ లవ్‌స్టోరీ చెబుతా’ అన్నాను. తను ముందు నా కథ విన్నా కూడా లవ్‌స్టోరీ చెప్పమన్నాడు. ‘మూడు గంటలు నెరేషన్‌ తర్వాత లవ్‌స్టోరీ మళ్లీ నెరేట్‌ చేయలేను. కావాలంటే లైన్‌ చెబుతా.. నచ్చితే రెండు రోజుల తర్వాత వచ్చి కథ చెబుతా’ అన్నాను. సరేనన్నాడు సుశాంత్‌. నేను చి||ల||సౌ|| పది నిమిషాలు చెప్పగానే.. ‘మనం ఇదే స్టోరీతో సినిమా చేస్తున్నాం’ అనేశాడు. తర్వాత నేను పూర్తి స్క్రిప్ట్‌ చెప్పాను. తనకు నచ్చింది. సినిమా అలా ప్రారంభమైంది.

మీరు డైరెక్టర్‌ అవుతున్నానని అనగానే మీ తోటివారు ఏమన్నారు?
– నేను పెద్దగా ఎవరికీ చెప్పలేదు. వెన్నెలకిశోర్‌, అడివిశేష్‌ అలా కొందరికే తెలుసు. ఎవరూ ఏమి అనలేదు. కానీ వెన్నెలకిశోర్‌ ఓ మాట అన్నాడు. ‘నువ్వు హీరోగా చేస్తున్నావ్‌.. దాన్ని కాదని డైరెక్షన్‌ అంటూ ఇప్పుడు వెళుతున్నావ్‌. తేడా కొడితే.. రెండు కెరీర్లు ఇబ్బందుల్లో పడతాయి. అదే రెండు సక్సెస్‌ అయితే నీకు ప్లస్‌ అవుతుంది..కాబట్టి ఆలోచించి నిర్ణయించుకో అని సలహా చెప్పారు.

మాటలు కూడా మీరే రాసుకున్నారా?
– అవునండీ.. మాటలు కూడా నేనే రాసుకున్నాను. ఎందుకంటే.. ఈ కథ పదేళ్లుగా నా మైండ్‌లో రన్‌ అవుతుంది. కాబట్టి సినిమాను ఓ రెండు వేలసార్లు మైండ్‌లో ఊహించేసాను. అలాగే సినిమా 24 గంటల్లో జరిగే కథ. చాలా నేచురల్‌గా సినిమా ఉంటుంది. కాబట్టి జనరల్‌గా మనం ఎలా మాట్లాడుతామో అలాంటి మాటలనే రాసుకున్నాను. నా టీం నుండి కొన్ని సలహాలను తీసుకున్నాను.

టైటిల్‌ గురించి చెప్పండి?
– ముందు ఈ సినిమాకు చిరంజీవి అర్జున్‌ అనే టైటిల్‌ అనుకున్నాను. అయితే రెండేళ్ల క్రితం అర్జున్‌రెడ్డి అనే సినిమా విడుదలై పెద్ద సక్సెస్‌ అయింది. అలాంటప్పుడు నా టైటిల్‌ వింటే నేను ఏదో ఫాలో అయి పెట్టానని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి. ఏ టైటిల్‌ పెట్టాలా? అని ఆలోచించుకుంటూ ఉంటే.. వెన్నెలకిశోర్‌ చి||ల||సౌ అనే టైటిల్‌ని సజెస్ట్‌ చేశారు. అందరికీ ఆ టైటిల్‌ నచ్చడంతో దీన్ని టైటిల్‌గా ఫిక్స్‌ చేసేశాం.

అన్నపూర్ణ స్టూడియో సినిమా రిలీజ్‌ చేయడానికి కారణమేంటి?
– సమంత నాకు మంచి స్నేహితురాలు. సినిమా చేసిన తర్వాత తనకు విషయం తెలిసి నేను ఓసారి సినిమా చూస్తాను అంది. తనతో పాటు చైతన్య కూడా చూశాడు. తనకు నచ్చింది. తర్వాత చైతు వెళ్లి నాగార్జునగారికి చెప్పారనుకుంటా.. ఆయన సినిమా చూస్తానన్నరట. అప్పుడు చైతన్య ఫోన్‌ చేసి ‘నాన్నగారు సినిమా చూడాలనుకుంటున్నారు’ అనగానే.. నాకు నాగార్జునలాంటి వ్యక్తి నా సినిమా చూస్తాననడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన సినిమా చూసిన తర్వాత నిర్మాతలతో మాట్లాడుకున్నారు. అలా అన్నపూర్ణ స్టూడియో సినిమాను విడుదల చేస్తుంది.

సినిమా చూసిన తర్వాత నాగార్జున ఏమన్నారు?
సినిమా చూసిన తర్వాత ‘రాహుల్‌ సినిమా చాలా బావుంది. నువ్వు నన్ను ఏడిపించావ్‌.. నవ్వించావ్‌’ అన్నారు. కారు ఎక్కేముందు రాహుల్‌ నీకు చాలా మంచి భవిష్యత్‌ ఉంటుంది’ అన్నారు. నాగార్జునలాంటి పెద్ద స్టార్‌ హీరోగారు అలా అభినందించడం కంటే ఇంకేం కావాలి.. ఆస్కార్‌ గెలిచినంత ఆనందమేసింది.

డైరెక్టర్‌గా, హీరోగా కంటిన్యూ అవుతారా?
కచ్చితంగా కంటిన్యూ అవుతాను.

రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు?
డైరెక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే డైరెక్టర్‌ కావాలనేదే నా కల.

తదుపరి చిత్రం?
– నటుడిగా రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక డైరెక్టర్‌గా అన్నపూర్ణ స్టూడియోలోనే చేయబోతున్నాను.