‘బాహుబలి-2 : ది కంక్లూజన్’ రివ్యూ

0
340

కథ :

మాహిష్మతి సామ్రాజ్యానికి మహారాజు గా పట్టాభిషిక్తుడు కావడానికి ముందు కట్టప్ప (సత్య రాజ్) తో కలిసి దేశాటనకు బయల్దేరిన అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కుంతల రాజ్యపు యువరాణి దేవసేన (అనుష్క) ని చూసి ప్రేమలో పడతాడు. సింహాసనం దక్కలేదనే అసూయ తో ఉన్న భళ్లాల దేవుడు (రానా) కూడా దేవసేన ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇందు కోసం బిజ్జల దేవుని (నాజర్) తో కలిసి పన్నిన పన్నాగంలో చిక్కుకున్న శివగామి ( రమ్య కృష్ణ) ఆదేశానుసారం బాహుబలి, సింహాసనమో, దేవసేనో తేలుచుకోవాల్సి వస్తుంది. దేవసేన కి తోడుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం, ప్రేమ కోసం రాజ్యాధికారాన్ని త్యాగం చేసి సైన్యాధ్యక్షునిగా రాజైన భళ్లాల దేవుని పక్కన నిలబడతాడు. కానీ, ప్రజల్లో బాహుబలి మీదున్న అభిమానాన్ని చూసి అసూయతో రగిలిపోతారు భళ్లాల దేవ, బిజ్జల దేవ. ఎప్పటికైనా బాహుబలి వలన తమకి ప్రమాదమే అని రాజ ప్రాసాదానికే తనని దూరం చేయాలనీ పన్నిన  పన్నాగాలు, వాటి పర్యవసానాలు ఏంటనేది మిగిలిన కథ.

నటన :

అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ గొప్ప పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా అభినయించారు. సినిమా మొదలైనప్పటి నుండి అమరేంద్ర బాహుబలి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. అందంగా కనిపించడం మాత్రమే కాక ఆ ఆహార్యం, అభినయం తో రాజంటే ప్రభాస్ ఏ అనేలా కనిపించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు ఏవైనా సరే తనదైన శైలిలో ఆకట్టుకున్నారు ప్రభాస్. ప్రభాస్ లేనిదే బాహుబలి లేదు అనే స్థాయిలో ఈ చిత్రాన్ని తెర మీద ప్రభాస్ నడిపారు. తెలుగు సినిమా చరిత్రలో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ చిరస్థాయిగా నిలిచిపోతారు.

ప్రభాస్ కి సరి జోడి అనుష్క మరో సారి ప్రభాస్ తో అందమైన ప్రేమ సన్నివేశాలని పండించారు. వీరిద్దరి జోడి తెర మీద ప్రేమ సన్నివేశాల్లో చూడ ముచ్చటగా ఉంది. ప్రేయసి గా నే కాక దేవసేన గా సాహస క్షత్రియ యువరాణిగా శక్తివంతమైన పాత్రలో ఆకట్టుకుంటారు.

లోపల అసూయ తో రగిలిపోతూ పైకి కనిపించని క్రూరమైన విలన్ పాత్రలో రానా రెండో అర్ధ భాగంలో విజృంభించారు. తన పాత్రతో సినిమాకి కీలకమైన డ్రామా ని రక్తి కట్టించారు రానా. ఇతర ప్రముఖ పాత్రల్లో రమ్య కృష్ణ, సత్య రాజ్, నాజర్, సుబ్బరాజు తమ అనుభవంతో మెప్పిస్తారు.

బలాలు :

ప్రభాస్
ఎస్ ఎస్ రాజమౌళి హీరోచిత సన్నివేశాలు
ఇంటర్వెల్ సీక్వెన్స్
దర్బార్ సీక్వెన్స్
అత్యున్నతమైన నిర్మాణ విలువలు

బలహీనతలు :

ద్వీతీయార్ధంలో నెమ్మదించే కథనం

విశ్లేషణ :

రెండు భాగాల సిరీస్ లో రెండో భాగంగా వచ్చిన ఈ ‘బాహుబలి-2 : ది కంక్లూజన్ మీద తారా స్థాయి అంచానాలున్నాయి. సినిమా మొదలైనప్పటి నుండే కట్టిపడేసే కథనం తో రాజమౌళి తన పనితనం చూపిస్తారు. ఎక్కడ బిగి సడలని కథనం తో తనదైన శైలి రోమాంచిత సన్నివేశాలతో నడిపిస్తూనే ప్రతి పాత్రని ఒక బలమైన సన్నివేశం తో చిత్రంలో కి ప్రవేశ పెట్టిన విధానం ఆయన దర్శకత్వ ప్రతిభ ని చూపిస్తుంది. ఇక తన ట్రేడ్ మార్క్ ఇంటర్వెల్ బాంగ్ అయితే, ‘బాహుబలి-2 ‘ లో పతాక స్థాయి కి తీసుకెళ్లారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గ నిలుస్తుంది.

సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికి కీలక కథ, డ్రామా మొదలవడంతో కథనం కాస్త నెమ్మదిస్తుంది. అయినా రాజా దర్బార్ సన్నివేశం, కట్టప్ప బాహుబలిని చంపే సన్నివేశాలు ప్రేక్షకులని మైమరిపిస్తాయి. భారీ పతాక సన్నివేశాలతో ప్రేక్షకులకి మరో మారు ఉత్కంఠమైన యుద్ధ సన్నివేశాలు చూపించారు. ప్రభాస్, రాజమౌళి కలిసి పడ్డ కష్టం, సినిమా మీదున్న ఇష్టం ప్రతి ఫ్రేమ్ లో ను కనిపిస్తుంది. ఉత్కంఠ రేపే రోమాంచిత సన్నివేశాలు, కథలో లీనం చేసే డ్రామా, ఎమోషన్స్ తో చరిత్ర లో నిలిచిపోయే సినిమా అందించారు ప్రభాస్, రాజమౌళి.

సాంకేతికంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతం ఒక బలం అయితే సెంథిల్ కెమెరా పనితనం మరో బలం. విజయేంద్ర ప్రసాద్ సృష్టించిన పాత్రలు, అందుకు తగ్గట్టు డ్రామాని పండించే సన్నివేశాలు వీటిని దృశ్య రూపంలో తెర మీద రాజమౌళి మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇంత వ్యయప్రయాసాలకి ఓర్చి భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక ఖర్చు తో తీసిన నిర్మాతలు శోభు, ప్రసాద్ ధైర్యానికి, వాళ్ళు ఈ టీం మీద పెట్టుకున్న నమ్మకానికీ హ్యాట్సాఫ్.

బాటమ్-లైన్ : తెలుగు సినిమా ‘అద్భుతం’
రేటింగ్ : 4 / 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here