“కొబ్బరిమట్ట” నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ, సంపూర్ణేష్ కోసం ఈ నెల 14న రీ రిలీజ్ చేస్తున్నాం – రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్
సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ “కొబ్బరిమట్ట” ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న రీ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వల్లంసెట్ల కృష్ణారావు సమర్పణలో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. 2019 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన “కొబ్బరిమట్ట” ఆద్యంతం నవ్వించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – నా కెరీర్ లో “కొబ్బరిమట్ట” ఎంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా టైమ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనాన్స్ పరంగా కష్టాలు చూశాం. ఆ నాలుగేళ్ల శ్రమ ఆగస్టు 10న “కొబ్బరిమట్ట” రిలీజ్ రోజున మ్యాట్నీ, ఫస్ట్ షోలతో ఫలితాన్నిచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని అందించింది. సినిమాకున్న పవర్ ఏంటో ఆ రోజు తెలిసింది. మనం ఇక్కడ మరిన్ని మూవీస్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ మాలో కలిగింది. నాకు బేబి, చెన్నై లవ్ స్టోరీస్ విజయాలు సంతోషాన్నిచ్చినా “కొబ్బరిమట్ట” అందించిన విజయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. సంపూర్ణేష్ ను హృదయకాలేయం సినిమాతో పరిచయం చేశాక మా కాంబోలో రెండో చిత్రంగా “కొబ్బరిమట్ట” సినిమా వచ్చింది. సంపూతో వర్క్ చేస్తున్నప్పుడు రైటింగ్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేశాం. రెండు నిమిషాల నాన్ స్టాప్ డైలాగ్, మూడు నిమిషాల డైలాగ్..ఇలా రాశాను. సంపూ బాగా పర్ ఫార్మ్ చేసేవాడు. “కొబ్బరిమట్ట” సినిమా డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా మా డైలాగ్స్ ఇంత పాపులర్ అవుతాయని మేము అప్పుడు ఊహించలేదు. అందరూ మీ “కొబ్బరిమట్ట” రిలీజ్ చేయండి అని అడుగుతుంటారు. మా సంపూర్ణేష్ కోసం ఈ నెల 14న సినిమాను లిమిటెడ్ థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు మేము పడిన కష్టాన్ని, మా మెమొరీస్ ను మరోసారి తెరపై చూసుకోవాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని మా సినిమా ద్వారా మరోసారి నవ్విస్తామని ఆశిస్తున్నాం. మరో పదిహేను ఇరవై రోజుల్లో బేబి హిందీ సినిమా షూటింగ్ ఉంది. తర్వాత తెలుగు సినిమా చేస్తాను. ఆ సినిమా స్టోరీ రెడీగా ఉంది. అన్నారు.
హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ – ఈ సినిమాలో సాయి రాజేష్ అన్న నాతో మూడు క్యారెక్టర్స్ చేయించారు. ఈ సినిమాలో నాతో 3 నిమిషాల 20 సెకన్ల భారీ డైలాగ్ చెప్పించాడు. సినిమా రిలీజైన ఇన్నేళ్ల తర్వాత కూడా చాలా మంది ఫోన్స్ చేసి మీ కొబ్బరిమట్ట సినిమా మాకు చాలా ఇష్టమని చెబుతుంటారు. అన్న రాసిన స్క్రిప్ట్ వల్లే మా మూవీ అందరికీ గుర్తుండిపోయింది. సాయి రాజేష్ అన్న చెప్పినట్లు ఈ సినిమా టైమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ మా సినిమా సాధించిన విజయం అన్నీ మర్చిపోయేలా చేసింది. నన్ను చాలా మంది మీ “కొబ్బరిమట్ట” రీ రిలీజ్ చేయమని అడిగేవారు. నేను సాయి రాజేష్ అన్నతో ఈ విషయం చెబితే మంచి డేట్ చూసుకుని రీ రిలీజ్ చేద్దామని చెప్పారు. అది ఈ నెల 14కు కుదిరింది. మీరు మీ దగ్గరలోని థియేటర్స్ లో మా సినిమాను ఎంజాయ్ చేయండి. సాయి రాజేష్ అన్నతో మా కాంబోలో మరో సినిమా తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ ఇషికా సింగ్ మాట్లాడుతూ – ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఒక సీనియర్ యాక్టర్ అన్నారు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని. అప్పుడు మా మూవీ పరిస్థితిని ఆ యాక్టర్ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సినిమాకు ఎన్ని సమస్యలు వచ్చినా సాయి రాజేష్ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఒక పోరాటం చేశాడు. ఇప్పుడు ఆయనకు ఫైనాన్స్ దొరుకుతుంది, స్టార్స్ కథలు వింటారు. కానీ అప్పుడు సిచ్యువేషన్ వేరు. సాయి రాజేష్, సంపూ, మేమంతా సినిమా మీద ప్యాషన్ తో వర్క్ చేశాం. ఇప్పటికీ మా రిలేషన్ అలాగే ఉంది. మేము తరుచూ కలవకున్నా ఎవరికి ఇబ్బంది వచ్చినా మరొకరం కాల్ చేసి మాట్లాడుకుంటాం. ఆ ఫ్రెండ్షిప్ మాలో ఇప్పటికీ అలాగే ఉంది. సక్సెస్ వచ్చినా సాయి రాజేష్, సంపూ ఏమాత్రం మారలేదు. వాళ్లు అలాగే ఉన్నారు. అన్నారు.



