టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు ‘రెడ్ అలర్ట్’! – హీరో, ద‌ర్శ‌కుడు షిరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు

0
3

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు ‘రెడ్ అలర్ట్’!
– హీరో, ద‌ర్శ‌కుడు షిరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు

▪️ ఇండస్ట్రీలో మాఫియా రాజ్యం నడుస్తోంది
▪️ ఏడాదిన్నరగా ఒంటరి పోరాటం

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని, కొద్దిమంది చేతుల్లోనే ఇండస్ట్రీ వ్యవస్థ నడుస్తోందని ‘ఓ అందాల రాక్షసీ’ సినిమా హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు. చిన్న సినిమాలు ఎదగకుండా అడ్డుకుంటున్నారని, వంద సినిమాలు విడుదలైతే కేవలం రెండు, మూడు చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఇండస్ట్రీలోని పరిస్థితులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏడాదిన్నరగా ఒంటరి పోరాటం!

తెలుగు సినీ పరిశ్రమలో తాను గత ఏడాదిన్నరగా వ్యవస్థతో పోరాడుతున్నానని షిరాజ్ మెహదీ తెలిపారు. తన వెనుక పెద్దవాళ్లు ఎవరూ లేరని, తప్పు చేసినవారే పెద్దవాళ్లుగా చలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు. తప్పు చేసినవారిలోనే భయం ఉంటుందని పేర్కొంటూ, చిన్న సినిమా నిర్మాతలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నోటీసులిచ్చినా స్పందన కరువు

పీవీఆర్‌, ఐనాక్స్‌, ఏషియన్ ఫిల్మ్స్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు, తుది నోటీసులు, ఫిర్యాదులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. సునీల్‌, దిల్‌రాజు, సురేష్‌బాబు, అశోక్‌కుమార్‌, ప్రసన్నకుమార్‌, భరత్‌ చౌదరి, భరత్‌ భూషణ్‌ తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వంద సినిమాల్లో మూడింటికే అవకాశమా?

చిన్న బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కష్టంగా మారిందని షిరాజ్ మెహదీ అన్నారు. వంద సినిమాలు విడుదలైతే రెండు, మూడు చిత్రాలకే ప్రదర్శన, ప్రచారం వంటి అవకాశాలు దక్కుతున్నాయని, మిగిలిన సినిమాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితులు చిన్న నిర్మాతల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని పేర్కొన్నారు.

‘ఓ అందాల రాక్షసీ’కి హక్కులు కరువా?

తన సినిమా ‘ఓ అందాల రాక్షసీ’కి ఇప్పటివరకు ఆడియో హక్కులు, థియేటర్లలో ప్రదర్శన, ఓటీటీ, శాటిలైట్‌, ఇతర భాషల ఓవర్సీస్ హక్కుల విషయంలోనూ ఆశించిన అవకాశాలు లభించలేదని ఆయన తెలిపారు. హైకోర్టు ద్వారా నోటీసులు పంపించినప్పటికీ స్పందన లేదని ఆరోపించారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ‘రెడ్ అలర్ట్’!

కరోనా సమయంలో విధించిన రెడ్ అలర్ట్ తరహాలోనే ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి మారిందని షిరాజ్ మెహదీ వ్యాఖ్యానించారు. కొద్దిమంది పెద్ద హీరోలు, నిర్మాతలకే ప్రాధాన్యం లభించేలా పరిస్థితులు తయారయ్యాయని, చిన్న సినిమాలు తీసేవారు నిలదొక్కుకోలేని వాతావరణం నెలకొందని విమర్శించారు.

సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకోవాలి!

చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో చిన్న నిర్మాతలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిన్న సినిమాల మనుగడకు భరోసా కల్పించకపోతే ఎంతోమంది నిర్మాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here