‘తెల్ల కాగితం’ సినిమా ‘కొత్త బంగారు లోకం’ లాంటి స్వచ్ఛమైన ప్రేమకథ – ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు
నిర్మాత కృష్ణన్న నిర్మించిన ‘తెల్ల కాగితం’ మూవీ అక్టోబర్ 2న విడుదలై పెద్ద విజయం సాధించాలి – డైరెక్టర్ అనిల్ రావిపూడి
శ్రీమతి కె.శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు నిర్మాత టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను, రామ్ జగదీష్, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..
హీరో హర్ష రోషన్ మాట్లాడుతూ.. “ఈ వారం రోజుల్లో నేను రెండు షాకులు చూశాను. మొదటిది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అన్న మా ట్రైలర్ గురించి పోస్ట్ చేసి మాకు కొండంత ధైర్యం ఇవ్వడం, రెండోది సినిమా విడుదలకు మూడు రోజుల ముందు మా చిత్రం నుంచి ఒక వీడియో లీక్ కావడం. ఆ లీక్ అయిన వీడియోపై వచ్చిన ప్రతి మీమ్, ట్వీట్, రీల్ చూశాను. అందులో అందరూ ‘తప్పు తప్పు’ అని విమర్శిస్తున్నారు. అయితే టీజర్, ట్రైలర్లలో కూడా మేము అదే విషయాన్ని తప్పు అనే చూపించాం. నా దగ్గరికి రొటీన్ కమర్షియల్, ఫైట్ల కథలు ఎన్నో వచ్చినా, ఒక నటుడిగా సమాజానికి ఒక ఎమోషన్, మంచి కథను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. లీక్ అయిన ఒక్క వీడియో క్లిప్ చూసి తప్పుగా భావిస్తున్న వారు, అక్టోబర్ 2న థియేటర్‌లో పూర్తి సినిమా చూసిన తర్వాత మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుందని ప్రామిస్ చేస్తున్నాను. ఇంత మంచి కథను రాసిన రచయిత నందు అన్నకి కృతజ్ఞతలు. సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక మంచి అనుభూతితో వస్తాడని నమ్ముతున్నాను” అని అన్నారు.
హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. “తెల్ల కాగితం మూవీ 2006 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ అయినా.. ప్రస్తుత జనరేషన్‌తో పాటు రాబోయే తరాలకు కూడా అర్థమయ్యే ఒక అందమైన సందేశం ఇందులో ఉంది. అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను కుటుంబమంతా కలిసి చూడవచ్చు. ఇందులో ఎన్నో మంచి విషయాలు, నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నాకు ‘ఆశ’ అనే చక్కటి పాత్రను ఇచ్చిన దర్శకుడు రమేష్ గారికి, అలాగే నిర్మాత కృష్ణ గారికి, రచయిత నందు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నా డెబ్యూ మూవీ కావడంతో ప్రారంభంలో సెట్‌లో చాలా టెన్షన్ పడ్డాను. కానీ హీరో రోషన్, శ్రావ్య, దీపక్ అంతా ఒక చిన్న కుటుంబంలా కలిసిపోయి రోజుకో కొత్త విషయం నేర్పిస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ చిత్రాన్ని చూసి మీరంతా నన్ను, మా టీమ్‌ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
తెల్ల కాగితం మూవీ డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. “మా నిర్మాత కృష్ణ గారు నన్ను నమ్మి, చిన్న పిల్లలమైనా సరే నడిపించి, బడ్జెట్ పరిమితులు పెట్టకుండా కథకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టిన ఆయన డెడికేషన్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నిర్మాత అంటే డబ్బులు ఖర్చపెట్టడమే కాదు.. సినిమాకు ఏం కావాలో అని ఆలోచించారు. హీరో రోషన్ సినిమాను తన భుజాలపై మోశాడు. సినిమాలో రోషన్ కనిపించడు.. రాము మాత్రమే కనిపిస్తాడు. అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు గ్యారెంటీగా వస్తుంది. హీరోయిన్ నక్షత్ర నటనలో జీవించేసింది. శరణ్య గారు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. అలాగే శ్రావ్య చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా వెనుక ఉండి నందన్న నన్ను నడిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రాఫర్ గుహన్, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, లిరిసిస్టులు సురేష్, పూర్ణాచారి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. గత రెండు రోజులుగా నా సినిమా గురించి ఓ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అలాంటిది ఏమి లేదు. ఆ ఒక్క కంటెంట్‌తో నందు గారిని, రోషన్‌ను బ్యాడ్ చేస్తున్నారు. మా అమ్మ గారికి కూడా ఫోన్ చేసి నీ కొడుకు ఇలాంటి సినిమా తీశాడేంటి అని అన్నారట. మా అమ్మకి చెప్పినట్లే, ఆమెతో పాటు నా కుటుంబం, స్నేహితులు గర్వపడేలాంటి సినిమానే తీశాను. ఇది ఎవరైతే ట్రోల్ చేశారో వారికి చెబుతున్నా. అక్టోబర్ 1న ప్రీమియర్స్ వేస్తున్నాం. సినిమా చూసి మీరే మాట్లాడండి. ఎండింగ్ షాట్ వరకు సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది..” అని అన్నారు.
నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. “నిర్మాత కృష్ణ ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో రైటర్ నందుతో నాకు కథ చెప్పించినప్పుడే ఇది 2000ల కాలం నాటి నేపథ్యంలో సాగే ఎంతో స్వచ్ఛమైన, ఇన్నోసెంట్ లవ్ స్టోరీ అనిపించింది. గతంలో మా బ్యానర్ నుంచి వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో ఎలాంటి అమాయకత్వంతో కూడిన ప్రేమకథ ఉందో.. ఇందులోనూ అలాంటి ఫీల్ కనిపించింది. హీరో రోషన్, హీరోయిన్ నక్షత్రలతో పాటు ఫ్రెండ్స్, అన్నయ్య-వదిన, తల్లిదండ్రుల పాత్రలు చేసిన నటీనటులంతా కొత్తవారైనా దర్శకుడు రమేష్ వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ గుహన్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న వంటి పెద్ద టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేశారు. ఇండస్ట్రీలో గత 20 ఏళ్లుగా నాకు తెలిసిన నిర్మాత కృష్ణ మంచి సంబంధాలు, స్నేహానికి నిదర్శనంగానే ఈ రోజు ఇంతమంది ప్రముఖ దర్శకులు ఈ ఈవెంట్‌కు వచ్చి అతనికి మద్దతుగా నిలిచారు. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు ఆలోచించేలా ఇందులో చాలా మంచి పాయింట్ ఉంది. రేపు రాత్రి ప్రీమియర్స్, అలాగే అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నేను దిల్ రాజు గారి బ్యానర్‌లో పనిచేసిన రోజుల నుంచి నాకు బాగా కావాల్సిన వ్యక్తి, నిర్మాత కృష్ణన్న కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఆయన నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలై పెద్ద విజయం సాధించాలి. ఈ సినిమాను రఫ్ కట్‌లో నేనిప్పటికే చూశాను. తెలిసీ తెలియని వయసులో పిల్లలు తప్పులు చేసినప్పుడు భయపడి బయట తిరుగుతూ సమస్యలను పెంచుకుంటారు తప్ప ఇంట్లో చెప్పరు.. కానీ ఏ తప్పు చేసినా రెండు తిట్లు తిట్టినా అమ్మ దగ్గరకు వెళితే అమ్మోరులా, నాన్న దగ్గరకు వెళితే నరసింహస్వామిలా మనకు రక్షణగా నిలబడతారనే అద్భుతమైన సందేశాన్ని బాధ్యతాయుతంగా ఇందులో చూపించారు. రచయిత నందు చాలా గొప్పగా కథ రాశాడు. త్వరలోనే డైరెక్టర్ అవుతాడని ఆశిస్తున్నాను. అలాగే దర్శకుడు రమేష్, సినిమాటోగ్రాఫర్ గుహన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, విజయ్ బుల్గానిన్ సంగీతం అంతా చాలా బాగున్నాయి. హీరో రోషన్ తన పాత్రకు సరిపోయే కథలు ఎంచుకుంటూ చక్కగా నటించాడు. హీరోయిన్ నక్షత్ర, శ్రావణి, శరణ్య, అలాగే వేదికపై సరదాగా ప్రొఫైల్స్ ఇచ్చిన దీపక్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇప్పటిదాకా విలన్‌గా మెప్పించిన అజయ్ గారు ఇందులో ప్రతి ఆడపిల్లకి ఉండాలనుకునే ఒక గొప్ప తండ్రి పాత్రలో అద్భుతంగా జీవించి సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే చివరగా మన స్టార్ బండ్లన్న స్పీచ్ వినడానికి నేనూ ఎదురుచూస్తున్నాను” అని అన్నారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. “నిర్మాత కృష్ణన్న వల్ల చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకుని స్టేజ్ ఎక్కే అవకాశం వచ్చింది. సినిమా చూసినప్పుడు చాలా ముచ్చటేసింది. పనిచేసిన వాళ్లంతా చిన్నపిల్లలైనా వాళ్ల తపన, టాలెంట్ చూస్తే వీళ్లు యంగ్ టాలెంట్ కాదు ‘రియల్ టాలెంట్’ అనిపించింది. డెబ్యూ ఆర్టిస్టులైనా దర్శకుడు రమేష్ వాళ్ల నుంచి నటనను రాబట్టుకున్న తీరు, ఎక్కడా ఆర్టిఫిషియాలిటీ లేకుండా సినిమాను సహజంగా తీసిన విధానం అద్భుతం. రమేష్ ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. రైటర్ నందు మంచి సెన్సిబుల్ కథను రాశాడు. భవిష్యత్తులో ఇండస్ట్రీకి ఇలాంటి ఫ్రెష్ స్టోరీలు మరిన్ని ఇవ్వాలి. రోషన్, నక్షత్రల మధ్య కెమిస్ట్రీ బాగుంది. వాళ్ల కష్టాన్ని చూస్తే మన ఇంట్లోని పిల్లలకు సమస్య వస్తే ఎంత బాధపడతామో అంతలా ఫీల్ అవుతాం. అలాగే సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అద్భుతమైన మెలోడీలు ఇచ్చాడు. తనతో కలిసి పనిచేయాలని నాకు కూడా ఆశగా ఉంది. సినిమాటోగ్రాఫర్ గుహన్, శరణ్య గారు, శ్రావ్యతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కృష్ణన్నకు చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ట్రోల్స్, నెగెటివిటీని పట్టించుకుని బాధపడితే రోజుకోసారి సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందని దర్శకుడు రమేష్‌కు ధైర్యం చెబుతూ.. జీవితంలో ఇతరుల విమర్శలు పట్టించుకోకుండా మన ఎదుగుదల మీదే దృష్టి పెట్టాలని సూచించారు . కృష్ణానగర్‌లో పరిచయమై దాదాపు 25 ఏళ్లుగా తనకు అన్నలా, ప్రాణస్నేహితుడిగా ఉన్న నిర్మాత కొమ్మలపాటి కృష్ణ కోసమే తాను ఈ వేడుకకు వచ్చానని తెలిపారు . కృష్ణ మనసు తెల్ల కాగితం లాంటిదని, బాద్‍షా సినిమా సమయంలో ప్రతి కష్టంలోనూ ఆయన తన వెంటే ఉండి అండగా నిలిచారని అన్నారు. ఎంతో మంది దగ్గర నిజాయితీగా సేవ చేస్తూ సొంత వ్యాపారం, కుటుంబాన్ని కూడా పక్కనపెట్టి సినిమానే శ్వాసగా బతికాడని గుర్తుచేశారు. అలాంటి నిబద్ధత గల వ్యక్తికి దేవుడు అందించిన వరమే ఈ ‘తెల్ల కాగితం’ అని, వైకుంఠపాళిలా సాగిన ఆయన జీవితంలో ఈ సినిమాతో నిచ్చెనెక్కి పెద్ద విజయం సాధిస్తాడని బలంగా నమ్ముతున్నానన్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో కృష్ణ మరిన్ని పెద్ద సినిమాలు తీసి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదగాలని, అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ చూసి దర్శకుడు, హీరో రోషన్ సహా టీమ్ మొత్తానికి పెద్ద విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

డైరెక్టర్ చందు మొండేటి మాట్లాడుతూ.. “ఈ సినిమా ట్రైలర్ చివర్లో ‘మగాళ్లు ఎప్పుడు మెచ్యూర్ అవుతారంటే.. మాటలతో చెప్పకుండా మనసులో ఉన్నది అర్థం చేసుకున్నప్పుడు’ అనే డైలాగ్ వినగానే ఫెంటాస్టిక్ అనిపించి నాకు సినిమా చూడాలనిపించింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే నిర్మాత కృష్ణ గారు నాకు పరిచయం. డెబ్యూ డైరెక్టర్, అప్ కమింగ్ హీరో రోషన్ చేస్తున్న సినిమా అయినా ఇంత మంచి క్యాస్టింగ్‌ను సమకూర్చారంటేనే ఆయన ఎంత అనుభవజ్ఞుడైన ఫిల్మ్ మేకరో, ఆయనంటే ఇండస్ట్రీలో అందరికీ ఎంత ఇష్టమో స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్” అని చెప్పారు.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. “నిర్మాత కృష్ణన్న ఎప్పుడూ తెల్ల కాగితంలా స్వచ్ఛంగా, ప్రశాంతమైన చిరునవ్వుతో ఉంటారు. అక్టోబర్ 2వ తేదీ ఆయన రోజు కాబోతోందని, ఈ చిత్రంతో ఆయన పెద్ద బ్లాక్‌బస్టర్ కొడుతున్నారని నమ్ముతున్నాను. వరుసగా అద్భుతమైన కథలు రాస్తున్న రైటర్ నందుకి, అలాగే హీరో రోషన్, హీరోయిన్ నక్షత్రలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దర్శక-నిర్మాతలకు నా ప్రత్యేక అభినందనలు, ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “నిర్మాత కృష్ణ గారు ఎప్పటినుంచో పరిచయం కాగా, దిల్ రాజు గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ సినిమా కంటెంట్ షూటింగ్‌లో ఉన్నప్పుడు చూశాను. చాలా ప్రామిసింగ్‌గా అనిపించింది. ఇంత చిన్న వయసులోనే కెమెరా ముందు ముఖంలో ప్రతి భావాన్ని అద్భుతంగా పలికిస్తూ నటిస్తున్న హీరో రోషన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని అయిపోయాను. ఈ సినిమా ‘కోర్ట్’ లాగే రోషన్‌కి మరో పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే హీరోయిన్ నక్షత్ర కూడా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. భీమవరంలో థియేటర్ మేనేజర్‌గా పనిచేసిన స్థాయి నుంచి కష్టపడి ఈ రోజు దర్శకుడిగా ఎదిగిన రమేష్ జర్నీ ఈ పరిశ్రమ గొప్పతనానికి నిదర్శనం. అతన్ని చూసి వాళ్ళ అమ్మగారు ఎంతో గర్వపడాలి. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సరికొత్త ఫ్రెష్ లవ్ స్టోరీ, డ్రామాను అందరూ థియేటర్లలో చూసి ఈ యంగ్ టీమ్‌ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
కోర్డ్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ..”కోర్ట్ సినిమాకు పనిచేసిన చాలామంది ఈ సినిమాకు పని చేయడంతో ‘తెల్ల కాగితం’ నాకు సొంత సినిమాగా అనిపిస్తోంది. ముఖ్యంగా నా తమ్ముడు రోషన్ గురించి చెప్పాలంటే.. తను ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగితే నేను అంత సంతోషిస్తా.. తను సాధించే సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నా. రైటర్ నందు ప్రతిభ గురించి ఎంతోమంది గొప్పగా చెబుతుండటం విన్నాను. ఆయన రచనలాగే ఈ సినిమా కూడా గొప్పగా నిలవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు రమేష్‌కి మొదటి సినిమా కష్టాలు సహజమే అయినా, ఒక మంచి హిట్ పడితే అన్నీ మరిచిపోతాం. ఈ ‘తెల్ల కాగితం’ మీద బ్లాక్‌బస్టర్ అని రాయడం ఖాయమని ధైర్యం చెబుతున్నాను. మా వాళ్లతో ఇంత మంచి సినిమాను తీసిన నిర్మాత కృష్ణ గారికి కృతజ్ఞతలు. అక్టోబర్ 1వ తేదీ రాత్రి ప్రీమియర్ల నుంచే రంగులు కనిపించి, అక్టోబర్ 2వ తేదీ నుంచి థియేటర్లలో జాతర మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
రైటర్ నందు సవిరిగాన మాట్లాడుతూ.. “హీరో రోషన్ మొదటి రోజే ప్రీ-క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ చేసి నన్ను ఏడిపించేశాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. అలాగే దర్శకుడు రమేష్ ఈ కథను మూడేళ్లుగా నమ్మి తెరకెక్కించాడు. హీరోయిన్ నక్షత్ర పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. ఒక సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ, ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్ అన్నలకు స్పెషల్ థాంక్స్. ఒక కూతురి చదువు కోసం రోజుకు 12 గంటలు శ్రమించే తండ్రులు, తెల్లవారుజామునే లేచి కష్టపడే తల్లులు, తమ్ముళ్ల కోసం త్యాగం చేసే అన్నలు, వదినలే ఇలాంటి నిజమైన హీరోల ఆశీర్వాదం మా సినిమా మీద ఉన్నాయి. నిస్వార్థంగా పిల్లల కోసం బతికే అలాంటి తల్లిదండ్రులందరికీ ఈ సినిమా అంకితం. ‘తెల్ల కాగితం’ కేవలం ఒక నిబ్బా-నిబ్బీ లవ్ స్టోరీ కాదు, అంతకంటే ఎంతో లోతైన కథ. అక్టోబర్ 2న థియేటర్లలో చూసి మీరే మాట్లాడాలి” అని అన్నారు.
నటుడు రఘురామ్ మాట్లాడుతూ.. “వేదికపై ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. రోషన్‌తో కలిసి నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మొదటిది ‘కోర్ట్’ కాగా ఇప్పుడు ‘తెల్ల కాగితం’. ఇంత మంచి సినిమాలో నాకు చక్కటి పాత్ర ఇచ్చిన రైటర్ నందు గారికి, డైరెక్టర్ రమేష్ గారికి, ప్రొడ్యూసర్ కృష్ణ గారికి నా కృతజ్ఞతలు. అలాగే గుహన్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోంది. అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను..” అని అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ బానిశెట్టి మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడు రమేష్ బండ్రెడ్డి గారికి, నిర్మాత కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మా ఇద్దరి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ ‘తెల్ల కాగితం’ సినిమాలో చాలా మంచి కథ, స్వచ్ఛమైన అమాయకత్వం ఉన్నాయి. ఇందులో నేను మూడు పాటలు రాశాను. హీరో రోషన్, హీరోయిన్ నక్షత్ర చాలా సహజంగా నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను..” అని అన్నారు.
లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ.. “ఒక అద్భుతమైన కథతో వస్తున్న ఈ ‘తెల్ల కాగితం’ సినిమాలో సన్నివేశాన్ని వివరించే ‘చిలకా’ అనే మంచి పాటను, అలాగే క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చే మరొక ముఖ్యమైన పాటను నేనే రాశాను. పాట రాసే సమయంలో ఫుటేజ్ చూసి దర్శకుడు రమేష్ గారిని సినిమా గురించి అడిగితే ఎంతో నమ్మకంగా చెప్పారు. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ సినిమాతో హీరో రోషన్ పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. నిజాయితీగా తీసిన ఈ చిత్రాన్ని మీరందరూ చూసి పెద్ద హిట్ చేయాలి” అని అన్నారు.
నటి శ్రావ్య మాట్లాడుతూ.. “మా నిర్మాత కృష్ణ గారు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ రమేష్ గారు సెట్‌లోనూ బయటా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ నడిపించారు. నన్ను లక్కీ చార్మ్‌గా భావిస్తూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన రైటర్ నందు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుతమైన పాటలు అందించిన విజయ్ బుల్గానిన్ గారికి, షూటింగ్‌లో ఎన్నో మెళకువలు నేర్పి గైడ్ చేసిన సినిమాటోగ్రాఫర్ గుహన్ గారికి, నాతో వర్క్ చేసిన అజయ్ గారికి రుణపడి ఉంటాను. నాతో పాటు నటించిన రోషన్‌తో ‘స్వాగ్’ తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మేమంతా కలిసి మీకు ‘తెల్ల కాగితం’ అనే చిత్రాన్ని అందిస్తున్నాం. మీ ప్రేమ, ఆశీస్సులతో ఆ కాగితాన్ని నింపి మాకు తిరిగి గొప్ప విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.
నటుడు దీపక్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను శివ అనే పాత్రలో రోషన్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా నటించాను. ఇది మనందరిలో ఒకడి కథ కాబట్టి అక్టోబర్ 2న థియేటర్లలో చూసి సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిన రైటర్ నందు గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రోషన్‌తో కలిసి చేయడం ఇది నాకు రెండో చిత్రం, తనకి ‘ఐ లవ్ యు’ తప్ప ఇంకేం చెప్పలేను. అలాగే శ్రావ్య, నక్షత్ర లాంటి ఆర్టిస్టులతో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది” అని అన్నారు.
రచయిత సంతోష్ మాట్లాడుతూ.. “తెల్ల కాగితం కథ నాకు నందన్న మొదట చెప్పినప్పుడు దాదాపు రెండు రోజుల పాటు ఆ హైలోనే ఉన్నాను. అక్టోబర్ 2న సినిమా చూసి మీరంతా కూడా కచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఈ సినిమాను నా స్నేహితుడు రమేష్ డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అన్ని జోనర్లలో రాసే సత్తా ఉన్న నందన్నను చూశాక నా ఆలోచన పూర్తిగా మారిపోయింది . ఈ సినిమా చూసి బయటకు వచ్చాక రోషన్, నక్షత్రలు కాకుండా రాము, ఆశ అనే పాత్రలే మీతో పాటు ఇంటికి వస్తాయి. మా రమేష్‌కు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత కృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు” అని అన్నారు.



