రైతు అంటే ఎలా ఉంటాడు.. మాసిన గడ్డం.. చిరిగిన బనియన్.. కింద ధోవతి.. తలకు కండువా చుట్టుకొని భుజంపై నాగలితో కనిపిస్తాడు. బక్కచిక్కిన రైతును చూడాలంటే మహర్షిలో రైతు పాత్ర పోషించిన ముసలాయనే గుర్తుకువస్తాడు. మహర్షిలో అసలు సిసలు రైతుకు నిజమైన నిర్వచనంలా కనిపిస్తాడు.
మహర్షిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాట్లు వేయించిన రైతు పేరు సినిమా విడుదలయ్యాక మర్మోగిపోయింది. ఆయన పేరు ఎం. గురుస్వామి. ఇంతకీ ఇంత అద్భుతంగా నటనకు జీవం పోసిన ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు.? ఇంతకు ముందు నటుడేనా అన్న ఆసక్తి అందరిలోనూ కలుగడం సహజమే. దానికి సమాధానాలు దొరికాయి.
రైతు వేషధారణలో మహర్షి సినిమాలో ప్రాణం పోసిన ఎం. గురుస్వామిది కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామం. ఈయన ప్రముఖ రంగస్థల కళాకారుడు. ఎన్నో నాటకాలు వేశారు. ఆ నాటకాల్లో ప్రతిభ చూసే మహర్షిలో రైతు పాత్రకు దర్శకుడు వంశీ ఎంపిక చేశారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బాలమ్మ దంపతులకు ఐదుగురు సంతానంలో గురుస్వామి ఒకరు. పెద్ద కుటుంబం.. ఆర్థిక ఇబ్బందులతో బాల్యం గడిచింది. కానీ గురుస్వామి బాగా చదువుకొని బీఎస్ఎన్ఎల్ లో 1964లో ఉద్యోగం సంపాదించాడు. 2003లో రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేస్తూనే కుటుంబ పోషణ కోసం నాటకాలు వేసేవాడు. 1960లో తొలిసారి ‘నేటి విద్యార్థి’ అనే నాటకంలో నటించారు. ఉద్యోగంలో రిటైర్ అయ్యాక చాలా షార్ట్ ఫిలింలలో నటించాడు. ఆ షార్ట్ ఫిలిం చూసే దర్శకుడు వంశీ సంప్రదించాడు.
సాంఘిక పౌరాణికాల్లో గురుస్వామి మెప్పించాడు. పుటుక్కు జరజర డుబ్బుక్కుమే, గణం, అరసు, ఎవనించే జనయించి వంటి ఎన్నో సోషల్ మెసేజ్ నాటకాలు వేశారు. ప్రముఖ నాటక రంగ నిపుణులు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రితో కలిసి వేమన సక్కుబాయి వంటి నాటకాల్లో నటించారు. కర్నూలు టీజేవి కళాక్షేత్రం ఈయన నాటక నైపుణ్యానికి మెచ్చి ‘రాయలసీమ రత్నం’ అవార్డును ఇచ్చి సత్కరించింది.
మహర్షి సినిమాకు ముందు ఈయన అజిత్ దర్శకత్వంలో వచ్చిన ఆయుష్మాన్ భవ మూవీలో నటించారు. ఆ తర్వాత మహర్షి సినిమా యూనిట్ ఆఫీస్ కు వెళ్లి చాన్స్ ఇవ్వాలని అడగ్గా.. కోడైరెక్టర్ రాంబాబు ఆడిషన్స్ కు పిలిచి ఓకేచేశారు. దర్శకుడు వంశీ నటన చూసి ఓకే అన్నారు. ఇలా మహర్షిలో గురుస్వామికి అవకాశం దక్కింది.


