మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ

0
164
Maruthi Nagar Subramanyam Review

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ

నటీనటులు

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్.

టెక్నికల్ టీం

సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి.
ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
పీఆర్వో: పులగం చిన్నారాయణ
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య.

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం కథ

జస్ట్ లో మిస్సయిన ప్రభుత్వ ఉద్యోగం కోసం మరే ఉద్యోగం చేయకుండా ఎదురుచూస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యం (రావు రమేష్). చంద్రగిరిలోని మారుతీ నగర్ లో నివాసముండే సుబ్రహ్మణ్యాన్ని అందరూ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అని పిలుస్తూ ఉంటారు. ఆయన భార్య కళా రాణి (ఇంద్రజ) చేసే ప్రభుత్వ ఉద్యోగమే ఆ కుటుంబానికి ఆధారం. చిన్నప్పుడు అల్లు అరవింద్ తనను ఈ కుటుంబానికి అప్పజెప్పాడని భావిస్తూ ఉంటాడు వీరి కొడుకు అర్జున్ (అంకిత్). అర్జున్ కాంచన (రమ్య)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని తండ్రిని తీసుకువెళ్లి ఇంట్లో అడుగుతాడు. అయితే డేటింగ్ చేసుకోవాలని కాంచన తల్లిదండ్రులు (హర్షవర్ధన్- బిందు చంద్రమౌళి) సూచిస్తారు. ఇదంతా ఇలా సాగుతూ ఉండగా కళారాణి తీర్థయాత్రలకు బయలుదేరుతుంది. ఆమె వెళ్లిన రెండో రోజే సుబ్రహ్మణ్యం అకౌంట్లో 10 లక్షలు పడుతుంది. ఊరినిండా అప్పులు పెట్టుకున్న సుబ్రహ్మణ్యం అకౌంట్లో ఆ డబ్బు వేసింది ఎవరు? ఆ డబ్బు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం ఎలా మారాడు? సుబ్రహ్మణ్యం జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి? చివరికి కాంచన అర్జున్ కలిశారా? సుబ్రహ్మణ్యానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? సొంతింటి కలను వాళ్ళు సహకారం చేసుకున్నారా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే పాత్రలో రావు రమేష్ పరకాయ ప్రవేశం చేశాడు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఇలాంటి పాత్ర ఇంకా ఎవరూ చేయలేరు అనేలా ఆయన తనదైన శైలిలో తనదైన అనుభవంతో పాత్రను పండించాడు. కామెడీ సీన్స్ లో తనను తలదన్నే నటుడు లేడు అనేలా రెచ్చిపోయి యాక్ట్ చేశాడు. ఆయన సరసన నటించిన ఇంద్రజ ఉన్నంతలో మెప్పించింది. అయితే ఆమె పాత్రకు ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువే. రావు రమేష్ కొడుకు పాత్రలో నటించిన అంకిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. మొన్ననే ఆయ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను పలకరించిన ఆయన ఈ సినిమాతో కూడా తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ మీద చాలా క్యూట్ గా అనిపించాడు. ఇక రమ్య పసుపులేటి గతంలో కాస్త గ్లామరస్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. ఇందులో నటనకు స్కోప్ ఉన్న ఒక నిబ్బి పాత్రలో ఆకట్టుకుంది. అన్నట్టు ఇందులో కూడా కావలసిన అందాలు ఆరబోసింది అనుకోండి. హర్షవర్ధన్ , బిందు చంద్రమౌళి, ప్రవీణ్, అజయ్, అన్నపూర్ణమ్మ వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ టీం 

ఈ సినిమా దర్శకుడిగా మాత్రమే కాదు లక్ష్మణ్ స్క్రీన్ ప్లే అందిస్తూనే డైలాగ్స్ కూడా రాశారు. లక్ష్మణ్ డైరెక్టర్ గా మెప్పిస్తూనే డైలాగ్స్ విషయంలో కూడా తన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి కామెడీని ఇరికించినట్టు కాకుండా సిచువేషనల్ గా రాసుకునీ డైరెక్టర్ మొదట సక్సెస్ అయ్యాడు. ఆ పాత్రల స్వభావం ఏమిటో ముందుగానే పరిచయం చేసి స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ అందించే ప్రయత్నం చేశాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ పక్కన పెడితే సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించేలానే రాసుకున్నాడు డైరెక్టర్. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. డైరెక్టర్గా ఎంత సక్సెస్ అయ్యాడో డైలాగ్ రైటర్ గా కూడా అంతే సక్సెస్ అయ్యాడు. చాలా డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకపక్క కామెడీ పండిస్తూనే మరోపక్క కొన్నిసార్లు ఎమోషనల్ గా ఆలోచింప చేసే విధంగా డైలాగ్స్ రాశారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయ్యేలా ఉంది. చాలా కలర్ ఫుల్ గా సీన్స్ అన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టాడు. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి. ఎక్కడా కొత్త నిర్మాతలు అనిపించలేదు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా వరకు సినిమాకి ప్లస్ అయింది.

విశ్లేషణ

కథగా చూసుకుంటే ఇది చాలా చిన్న లైన్. అనుకోకుండా వచ్చి పడిన డబ్బు వల్ల ఒక మిడిల్ క్లాస్ హౌస్ హస్బెండ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే లైన్ తోటి ఈ సినిమా తెరకెక్కించారు. అయితే దాని చుట్టూ అల్లుకున్న కథ సినిమాకు అందాన్ని తీసుకొచ్చింది. మారుతి నగర్ అనే ఒక ఏరియాలో భార్య ఉద్యోగం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉండే ఒక వ్యక్తికి అనుకోకుండా పది లక్షల డబ్బు దొరికితే దాన్ని ఏం చేశాడు? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్ విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. నిజానికి పక్కనోడి సమస్య మనకు చాలా కామెడీగానే అనిపిస్తుంది అనే లైన్ తో ఈ సినిమా నడిపించేసాడు. అక్కడక్కడ చిన్నచిన్న లాజిక్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతున్నా కొన్నింటిని కన్విన్స్ చేస్తూ దర్శకుడు కథలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లిన విధానం బాగుంది. ప్రేక్షకులను నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా సినిమా చేసిన డైరెక్టర్ అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అల్లు అర్జున్ కి ట్రిబ్యుట్ లాగా చేసిన మేడం సార్ మేడం అంతే అనే సాంగ్ బాగా ఆకట్టుకునేలా ఉంది. అలాగే అల్లు అర్జున్ రిఫరెన్స్ లు కూడా చాలా వాడారు కాబట్టి ఆయన అభిమానులకు సినిమా బాగా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

తీర్పు

ఈ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మిమ్మల్ని నవ్విస్తూనే ఆలోచింప చేస్తాడు..

రేటింగ్ : 3.25/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here