హంట్ టైటిల్ పై వివాదం
శ్రీ క్రియేషన్స్ పతాకం పై నిక్షిత్ హీరోగా దర్శకుడిగా నర్సింగ్ రావు నిర్మాతగా నిర్మించబడుతున్న చిత్రం హంట్ (Hunt). ఈ చిత్రం యొక్క మోషన్ టీజర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. అయితే హంట్ అనే పేరుతో హీరో సుధీర్ బాబు చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర వివరాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్ ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ, హీరో దర్శకుడు నిక్షిత్, డాన్స్ మాస్టర్ బషీర్ మరియు నిర్మాత నర్సింగ్ రావు పాల్గొన్నారు.
ఎమ్ ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మేము హంట్ చిత్రం మోషన్ టీజర్ ను విడుదల చేసాము. షూటింగ్ జరుగుతుంది. మేము హంట్ అనే టైటిల్ ను 6 నెలల క్రితం ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడే అదే చిత్ర టైటిల్ తో భవ్య క్రియేషన్స్ వాళ్ళు సుధీర్ బాబు హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్ర టైటిల్ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై చాంబర్ లో రిజిస్టర్ అయింది. మీరు ఎలా పెడతారు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫిలిం ఛాంబర్ లో కూడా మా సమస్యని వెళ్లబుచ్చాము. చాంబర్ వాళ్ళు కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళ తో మాట్లాడారు కానీ మా సమస్యకు పరిష్కారం లభించలేదు అందుకే ఈ ప్రెస్ మీట్. ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు 21 రోజుల వ్యవధిలో వేరే చిత్రానికి ఈ టైటిల్ రిజిస్టర్ అయిందా అని చెక్ చేసి మరి టైటిల్ ని రిజిస్టర్ చేస్తారు. మరి మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు ఎలా హంట్ చిత్ర టైటిల్ ని వాడతారు అని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం కావాలి” అని కోరుకున్నారు.
హీరో డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ “ఒక సినిమా టైటిల్ ని రాయల్ గా దొంగిలించారు. రెండు మూడు నెలల నుంచి భవ్య క్రియేషన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, హంట్ టైటిల్ మేము రిజిస్టర్ చేసుకున్నాము, మీరు టైటిల్ మార్చుకోండి అని. వాళ్ళు పటించుకోవడం లేదు. చాంబర్ లో కూడా కంప్లైంట్ చేసాం కానీ మాకు న్యాయం దొరకలేదు. మీడియా వల్లే నాకు న్యాయం కల్పించాలి” అని కోరుకున్నారు.
నిర్మాత నర్సింగ్ రావు “మేము మా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై హంట్ టైటిల్ ను రిజిస్టర్ చేసాం. షూటింగ్ కూడా జరుపుకుంటున్నాం. సడన్ గా ఒకరోజు హంట్ టైటిల్ తో సుధీర్ బాబు గారి పోస్టర్ కనిపించింది. వెంటనే భవ్య క్రియేషన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారు కానీ వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నం చేసాము కానీ ఫలితం లేదు. చాంబర్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసారు కానీ ఫలితం లేదు. మా చిత్ర ఆడియో రైట్ అమ్మటానికి ప్రయత్నం చేసాం కానీ హంట్ పేరు తో వేరే చిత్రం ఉంది మేము మీ చిత్రం కొనలేము అని తెలిపారు. మా న్యాయం కావాలి” అని తెలిపారు