గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి కొన్నాళ్లు పాటు పూర్తిగా రెస్ట్ తీసుకున్నారు. ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్‌కు ముందే ఆయన కోలుకున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన రీసెంట్‌గా ఓ వీడియో విడుదల చేశారు. అందులో తనకి ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన సయ్యద్ అనే వ్యక్తితో పాటు తాను త్వరగా కోలుకోవడానికి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే హాస్పిటల్లో తనకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్స్, పర్యవేక్షించిన వైద్య సిబ్బందికి, తన ఫ్యాన్స్‌కి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు సాయి ధరమ్ తేజ్.
అలాగే తాను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రిపబ్లిక్ సినిమాకు ఆదరణ అందించిన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు తేజ్. ఈ మార్చి 28 నుంచి కొత్త సినిమాను ప్రారంభించబోతున్నానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ‘‘నా కొత్త సినిమా నిర్మాతలు సుకుమార్ గారు, బాపినీడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను పూర్తిగా కోలుకునే వరకు నా కోసం వాళ్లు వేచి చూశారు’’ అని అన్నారు సాయి ధరమ్ తేజ్.
ఇదే వీడియోలో సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్యమైన మెసేజ్ అందించారు. ఆయన ప్రమాద సమయంలో ధరించిన హెల్మెట్‌ను చూపిస్తూ.. హెల్మెట్‌ను ధరించడం వల్లనే తాను ప్రాణాలతో బతికి ఉన్నానని, కాబట్టి టూ వీలర్స్‌లో ప్రయాణించే వాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు సాయి ధరమ్ తేజ్.