చిత్రం: సీటీమార్
సెన్సార్: యు/ఎ
వ్యవథి: 2 గం 19 నిమిషాలు
సమర్పణ: పవన్ కుమార్
బ్యానర్: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నటీనటులు: గోపీచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
సినిమాటోగ్రఫి: ఎస్. సౌందర్ రాజన్
సంగీతం: మణిశర్మ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: సత్యనారాయణ డి.వై
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత క్రమంగా సినిమాలు థియేటర్స్‌లో విడుదలవుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమాలు ప్రేక్షకుడికి ముందుకు వచ్చినా, పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీ రాలేదనే భావన ఉండిపోయింది. ఈ క్రమంలో కమర్షియల్ సినిమాలను రిచ్‌గా, ఎఫెక్టివ్‌గా తెరకెక్కించే దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్‌లో, యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న గోపీచంద్‌తో కలిసి చేసిన సినిమాయే ‘సీటీమార్’. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్‌లో గౌతమ్ నంద అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి గోపీచంద్‌ను సంపత్ కొత్తగా చూపించాలనుకున్నాడు. అందుకోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకుని దానికి కమర్షియల్ హంగులు మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి ‘సీటీమార్’ థియేటర్స్‌లో ప్రేక్షకులతో సీటీలు వేయించుకుందా? లేదా అనే విషయాలు తెలయాలంటే సినిమా కథలోకి వెళదాం…
కథ:
రాజమండ్రికి సమీపంలోని గ్రామం కడియం. అక్కడ ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే కార్తి(గోపీచంద్).. తన తండ్రి ప్రారంభించిన మెమోరియల్ స్కూల్‌లో అమ్మాయిలకు కబడ్డీలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. స్కూల్‌లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం స్కూల్‌ను మూసేయాలని అనుకుంటూ ఉంటుంది. అయితే తను ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిల జట్టు నేషనల్ రేంజ్‌లో కబడ్డీలో గెలిస్తే.. అప్పుడు వాళ్లు చెప్పే మాటలకు విలువ ఉంటుందని కార్తి భావించి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారికి ట్రైనింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో తన గ్రామ ప్రెసిడెంట్ ఫణీంద్ర(రావు రమేశ్)కు కార్తి శత్రువుగా మారతాడు. అయితే ఫణీంద్ర కూతురు(దిగంగన సూర్యవంశి) మాత్రం కార్తిని ప్రేమిస్తుంటుంటుంది. కార్తి ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిలు అన్ని పోటీల్లో గెలుస్తూ వచ్చి నేషనల్ కబడీ పోటీలకు సెలక్ట్ అవుతారు. ఢిల్లీకి పంపడానికి అమ్మాయిల తల్లిదండ్రులు భయపడతారు. అయితే, తాను అన్నలా వారికి అండగా ఉంటానని మాటిచ్చి తన టీమ్‌తో ఢిల్లీకి చేరుకుంటాడు కార్తి. అయితే ఎవరో కార్తి కోచ్‌గా ఉంటున్న ఆంధ్రా అమ్మాయిల కబడీ టీమ్‌ను కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు? వారు కార్తిని ఏ పనిచేయమంటారు? చివరకు కార్తి తన టీమ్‌ను కాపాడుకన్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
గోపీచంద్‌కు యాక్షన్ హీరో అనే ఇమేజ్ ముందు నుంచి ఉంది. ఆ విషయం దర్శకుడు సంపత్ నందికి బాగా తెలుసు. తన బాడీలాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు తగ్గట్టు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలోనే కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి సీటీమార్ తెరకెక్కించాడు. అందుకు తగినట్టు గోపీచంద్ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక పక్క ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ మరో వైపు యాక్షన్‌తో అదరగొట్టాడు. ఢిల్లీకి అమ్మాయిలను పంపం అని చెప్పిన తల్లిదండ్రులను గోపీచంద్ ఒప్పించే సందర్భంలో, ప్రీ క్లైమాక్స్‌లో పోసాని కృష్ణమురళి..గోపీచంద్ మధ్య వచ్చ సన్నివేశాలు.. అమ్మాయిల టీమ్ మిస్ అయినప్పుడు వారిని వెతికి పట్టుకునే క్రమంలో గోపీచంద్ టెన్షన్ పడటం ఇవన్నీ చక్కగా చేశాడు. తమన్నా సినిమా ప్రారంభమైన ముప్పావు గంట తర్వాత ఎంట్రీ ఇస్తుంది. ఈమె తెలంగాణ అమ్మాయిల కబడీ కోచ్ పాత్రలో కనిపించింది. పాత్రకు తగ్గట్టు పెర్ఫామెన్స్ చేయడంతో పాటు పాటల్లో గ్లామర్‌గా కనిపించింది. దిగంగన సూర్యవంశి పాత్ర పరిమితమే అయినా పాత్రకు ఆమె అతికినట్లు సరిపోయింది. ఇక గోపీచంద్ అక్క పాత్రలో భూమిక, ఆమె భర్త పాత్రలో రెహమాన్ క్యారెక్టర్‌లో అమరిపోయారు. ఫస్టాఫ్‌లో విలన్‌గా డైలాగులు, తనదైన హావభావాలతో నవ్వించిన రావు రమేశ్.. పాత్రను చాలా సునాయసంగా చేసేశాడు. ఇక సెకండాఫ్‌లో విలన్‌గా కనిపించిన తరుణ్ అరోరా టెరిఫిక్ లుక్‌లో కనిపించాడు. ప్రతిభ, అన్నపూర్ణమ్మ తదితరులు చేసిన కామెడీ కాసేపు నవ్విస్తుంది. కబడ్డీ జట్టులో కనిపించిన అమ్మాయిలు కూడా చక్కగా నటించారు.
విశ్లేషణ:
ఒకవైపు కబడీ ఆట..మరో వైపు హీరో విలన్‌తో తన టీమ్ కోసం చేసే పోరాటం.. ఈ రెండింటినీ పక్కాగా బ్యాలెన్స్ చేయడమంటే సులువైన విషయం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా లైన్ మారిపోతుంది. అయితే దర్శకుడు సంపత్ నందికి ఈ విషయం తెలుసు. అందుకే ఏ ఎలిమెంట్‌ను ఎక్కడ, ఏ మీటర్‌లో తీసుకోవాలో తీసుకుంటూ వచ్చాడు. ఒకవైపు ఎమోషన్స్, మరో వైపు హీరో గోల్ ఇలా చాలా విషయాలను సంపత్ నంది కథలో బాగంగా హ్యాండిల్ చేసిన తీరు సింప్లీ సూపర్బ్ అనాల్సిందే. రావు రమేశ్ పాత్రను సీరియస్‌గా చూపిస్తూనే డైలాగ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక తరుణ్ అరోరాను పవర్‌ఫుల్ విలన్‌గా ప్రొజెక్ట్ చేశాడు. హీరో కోసం తన పాత్రలో ఎఫెక్ట్‌ను ఎక్కడా తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ పాత్ర కథలో ఎంత కీలకమే సంపత్‌కు తెలుసు. అలాగే ఇంతకు ముందు ప్రస్తావించినట్లు ఢిల్లీకి అమ్మాయిలను పంపం అని చెప్పిన తల్లిదండ్రులను గోపీచంద్ ఒప్పించే సందర్భంలో, ప్రీ క్లైమాక్స్‌లో పోసాని కృష్ణమురళి..గోపీచంద్ మధ్య వచ్చ సన్నివేశాలు.. అమ్మాయిల టీమ్ మిస్ అయినప్పుడు వారిని వెతికి పట్టుకునే క్రమంలో గోపీచంద్ ఎమోషన్స్‌ను సరిగ్గా ప్రెజంట్ చేశాడు. అందుకే ఈ సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సంపత్ నంది విజన్‌కు తగ్గట్లు సౌందర్ రాజన్ తనదైన సినిమాటోగ్రఫీతో ప్రతి ఫ్రేమును రిచ్‌గా చూపించాడు. మణిశర్మ సంగీతంలో టైటిల్ ట్రాక్, అప్సర రాణి సాంగ్ బావున్నాయి. నేపథ్య సంగీతం చాలా బావుంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సంపత్ నంది సినిమాను ఇలా చేశాడంటే నిర్మాత అందించిన సపోర్టే ప్రధానంగా చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
– గోపీచంద్ నటన
– సంపత్ నంది దర్శకత్వం
– సినిమాటోగ్రఫీ
– ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
– కాస్త కామెడీ డోస్ తగ్గింది
బోటమ్ లైన్:
‘సీటీమార్’…. ఆకట్టుకునే స్పోర్ట్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
రేటింగ్: 3.25/5