అప్పుడే బాలుకు అసలైన నివాళి – కాట్రగడ్డ ప్రసాద్

0
225

తెలుగు వారంతా గర్వించతగ్గ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం . సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోని కీర్తి పతాక మన బాల సుబ్రహ్మణ్యం. ఈరోజు బాలుగారి 75వ పుట్టినరోజు .

ఆయన భౌతికంగా మన మధ్యన లేరు కానీ ఆయన పాట , ఆయన మాట మనతోనే వున్నాయి . మన మనసులో పల్లవిస్త్తూనే వున్నాయి . గత సంవత్సరం సెప్టెంబర్ 25 సినిమా ప్రపంచంలో చీకటి రోజు. కరోనా అనే మహమ్మారి బాలు గారిని మనకు దూరం చేసింది . ఎవరూ ఊహించ లేదు బాలు గారు మన మధ్యనుంచి వెళ్ళిపోతారని . తెలుగు సినిమా నివ్వెరపోయింది . తెలుగువారంతా తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు విషాదంలో మునిగిపోయారు . సంగీత ప్రపంచం మౌనంగా రోదించింది .
బాలు గారు సాధించిన విజయాలను చరిత్రగా మనకు అప్పగించి వెళ్లిపోయారు .

బాలు గారిని 1966లో శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడుగా పద్మనాభం గారు పరిచయం చేశారు . అక్కడ నుంచి బాలు గారు చనిపోయేంత వరకు సినిమాలో ,టీవీ లో తన గళం వినిపిస్తతోనే వున్నారు . తెలుగు, తమిళ, కన్నడ , హిందీ తదితర భాషల్లో 40,000 పాటలను గానం చేశారు .

6 జాతీయ అవార్డులు , 6 ఫిలిమ్ ఫేర్ అవార్డులు, 24 ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులు, 4 కర్ణాటక రాష్ట్ర అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు , లెక్కలేనన్ని ప్రైవేట్ అవార్డులు, సన్మానాలు , సత్కారాలు , డాక్టరేట్ గౌరవాలు బాలు కీర్తి కిరీటంలో ఒదిగి పోయాయి . భారత ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ ,2011లో పద్మభూషణ్ , 2021లో పద్మవిభూషణ్ అత్యున్నత పురస్కారాలు వరించాయి.
బాలు గారు గాయకుడుగా , సంగీత దర్శకుడుగా , నటుడుగా బహు ముఖాలుగా ఎదిగారు , అయినా ఎంత ఎత్తుకు ఎదిగినా , ఎన్ని అతున్నంత పురస్కారాలు వచ్చినా వినమ్రంగా ఒదిగి వున్న మహా కళాకారుడు, మానవతా మూర్తి , అందరికీ అత్యంత ఆప్తులు బాలు గారు.

బాలు గారితో నాకు మూడు దశాబ్దాల అనుబంధం . నేను నిర్మించిన 17 సినిమాల్లో 87 పాటలను గానం చేశారు . ఆయన నన్ను చాలా ఆత్మీయుడుగా చూసేవారు . బాలు గారు కరోనాతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం గురించి వారి కుమారుడు చరణ్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని , గత సంవత్సరం సెప్టెంబర్ 25న బాలు గారు ఇక లేరు అన్న వార్త కలవరపెట్టింది , కన్నీరు పెట్టించింది . అయితే తెలుగు సినిమా కీర్తిని తన పాటతో విశ్వ వ్యాప్తం చేసిన బాలు గారిని కడసారి చూడటానికి హైదరాబాద్ నుంచి ప్రముఖులు ఎవరూ రాకపోవం నన్ను అమితంగా బాధించింది . ఒక మహా గాయకునికి ఇచ్చే నివాళి ఇదా అనిపించింది .

అయినా బయట ప్రపంచంలో బాలు సంగీతాభిమానులు కోట్లలో వున్నారు , పాడుతా తీయగా , స్వరాభిషేకం తో వేలాది మంది గాయని గాయకులకు మార్గదిర్ధేశనం చేశారు . తన సంగీత వారసులను .తయారు చేసి మరీ వెళ్లిపోయారు . సంగీతానికి బాలు గారు చేసిన కృషీ , ఆయన పంచిన మధుర గీతాలు ఎప్పటికీ మనకి స్ఫూర్తి నిస్తూనే ఉంటాయి . ఆయన మనకెంతో చేశారు . మరి మనం ఆయన స్మృతి చిహ్నంగా ఏదైనా చెయ్యాలి కదా !
బాలుగారి పేరుతో ఒక సంగీత విశ్వ విద్యాలయంకు ఆయన జన్మించిన నెల్లూరులో అంకుర్పాణ జరిగింది . ఆది త్వరలో పూర్తి కావాలి . అలాగే ఆ మహా గాయకుడుకు భారత రత్న వచ్చేంతవరకు మనం విశ్రమించకూడదుఈ రెండు సాకారమైన రోజే బాలు గారికి నిజమైన నివాళి .

కాట్రగడ్డ ప్రసాద్
దక్షణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here