ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ మరోసారి నిర్మాతగా మారుతున్నారు. గతేడాది విశ్వేష్ క్రిష్ణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘99 సాంగ్స్’ సినిమాతో నిర్మాత అయిన రెహమాన్ తాజాగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖితో చేతులు కలిపి ‘నో లాండ్ మ్యాన్’ చిత్రం నిర్మిస్తున్నారు. ఓ అమెరికన్ స్టూడియోతో కలసి భారత, బంగ్లాదేశ్ దేశాలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ విషయాన్ని నవాజుద్దీన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘రెహమాన్‌తో కలసి ఓ సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘నో లాండ్ మ్యాన్’ చిత్రం కు ఆయనే సంగీత దర్శకుడు కూడా’ అని చెప్పారు నవాజుద్దీన్. ఆస్ట్రేలియన్ నటి మేఘన్ మిఛెల్, బంగ్లాదేశ్ నటుడు తషాన్ రెహమాన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముస్తాఫా సర్వర్ ఖాన్ ఫరూఖీ దర్శకుడు. ఆంగ్ల, హిందీ, ఉర్దు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.
చిన్న చిన్న పాత్రల ద్వారా నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన నవాజుద్దీన్ సిద్దిఖి తరువాత వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొత్త వెబ్ సిరీస్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.