‘ఓ పిట్టకథ’ నాకు సంతృప్తినిచ్చింది – హీరోయిన్ నిత్యా శెట్టి

0
3177
Nithya Shetty

‘అంజీ’, ‘దేవుళ్లు’, తదితర చిత్రాలతో బాల నటిగా మెప్పించిన ముద్దుగుమ్మ నిత్యా శెట్టి . ఇటీవ‌లే ‘ఓ పిట్టకథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌ రావు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా నిత్యా శెట్టి ఇంట‌ర్వ్యూ..

ప్రేక్షకుల మధ్య కూర్చోని వెండితెరపై న‌న్ను నేను చూసుకున్నా..
బాలనటిగా చాలా చిత్రాల్లో చేశాను కానీ, ‘దేవుళ్లు’, ‘అంజి’ చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి పేరు తెచ్చుకున్నాయి కాబట్టి ఆ చిత్రాలతోనే ఎక్కువగా అందరికీ గుర్తున్నా. ఇన్నేళ్ల ప్రయాణంలో నటిగా నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం మాత్రం ‘ఓ పిట్టకథ’నే. తొలిసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మధ్య కూర్చోని వెండితెరపై చూసుకున్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. ముఖ్యంగా దర్శకుడు నా పాత్రను చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించినందుకు చాలా సంతోషపడ్డా. ఓ దర్శకుడ్ని జడ్జ్‌ చేసేంత అనుభవం లేదు కాబ‌ట్టి పెద్ద నిర్మాణ సంస్థల్లో చెయ్యడానికి ఇష్టపడుతుంటా. ఎందుకంటే వాళ్లకు దర్శకుడిలోని ప్రతిభను, ఓ స్క్రిప్ట్‌ మంచిదా? కాదా? అని నిర్ణయించగల అనుభవం ఉంటుంది.

వెంకటలక్ష్మీ పాత్ర కోసం బాగా కష్టపడ్డా..
నిజానికి నేను భవ్య క్రియేషన్స్‌లో ఆడిషన్‌ ఇచ్చింది మరో చిత్రం కోసం.. కానీ, కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. తర్వాత చెందు ఫోన్‌ చేసి ఈ చిత్రం గురించి చెప్పారు. నాకు కథ చెప్పేముందు తనని ఒకటే అడిగా.. ‘నాకు ఎన్ని సీన్లు ఉంటాయి?. చిత్రీకరించాక అవి తీసెయ్యరు కదా?’ అని ఒకరకంగా ఇందులోని వెంకటలక్ష్మీ పాత్ర కోసం బాగానే కష్టపడ్డా. కథ మొత్తం నా చుట్టూనే తిరిగినా మా మూడు పాత్రలకు ఎంతో ప్రాధాన్యముంది. చిత్ర ముగింపులో వచ్చిన సర్‌ప్రైజ్‌లు చూసి నా స్నేహితులు కూడా షాకయ్యారు

గ్లామర్‌ రోల్స్ చేయ‌డం ఇష్ట‌మే..
హీరోయిన్‌గా తెలుగులో ఇది నా మూడో చిత్రం. తమిళ్‌లోనూ మూడు చేశా. కానీ, ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలతో ఎవరూ నన్ను సంప్రదించలే. ఒకవేళ వస్తే చెయ్యడానికి సిద్ధమే. ఇప్పటికైతే నాకు గ్లామర్‌ రోల్స్‌ అంతగా నప్పవేమో అనిపిస్తోంది. నన్ను చిన్నప్పుటి నుంచి బాలనటిగా చూశారు కాబట్టి ఒకవేళ నేనలాంటి పాత్రలు చేసినా ‘ఈ అమ్మాయికి ఇలాంటి పాత్రలిచ్చేరేంటి’ అని ప్రేక్షకులు అనుకుంటారేమో.


తమిళ్‌లో ఓ సినిమా
బాల నటిగా బిజీగా ఉన్నప్పుడే సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నా. నిజానికిది మా పెద్దవాళ్ల నిర్ణయం. ఎంత సినిమాలు చేసినా ఎంతో కొంత చదువు కచ్చితంగా ఉండాలన్నారు. వాళ్ల నిర్ణయం ప్రకారమే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చా. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ప్రస్తుతం తమిళ్‌లో ఓ సినిమా చెయ్యబోతున్నా. తెలుగులో కొన్ని క‌థ‌లు విన్నాను ఇంకా ఫైన‌లైజ్ కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here