మెగాస్టార్ చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్ ది లెజెండ్’ పుస్తకాన్ని హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి అందజేశారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని వేలం వేయగా… కర్ణాటకలోని చింతామణికి చెందిన అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో..
కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘చిరంజీవి అంటే క్రమశిక్షణ, మంచితనం. ఈ రోజుల్లో హిమాలయాలకు వెళ్లిన మనిషి కిందకు చూడడం కష్టం. మెగాస్టార్‌గా హిమాలయాల అంత ఎత్తుకు వెళ్లిన చిరంజీవి, ఎప్పుడూ నేలను చూస్తుంటాడు. ప్రతి ఒక్కర్నీ గౌరవిస్తూ, ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటాడు. ‘నేను ఎవరికి ఉపయోగపడగలను?’ అని రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నటనకు ఏడెనిమిదేళ్లు దూరంగా ఉన్నా… 40 ఏళ్లు స్టార్‌గా ఉన్నాడు. తప్పకుండా మరో 20 ఏళ్లు స్టార్‌గా ఉంటాడు’’ అన్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నేను 108 సినిమాలు చేస్తే అందులో ఎన్టీఆర్‌తో 12 చిత్రాలు చిరంజీవితో 14 సినిమాలు చేశాను. వాళ్ళిద్దరూ నన్నూ వారి కుటుంబంలో భాగం చేసుకున్నారు. దర్శకుడిగా పరాజయాల్లో ఉన్నప్పుడు నాతో ‘జగదేగ వీరుడు అతిలోక సుందరి’ చేయడానికి ముందుకొచ్చాడు చిరంజీవి. దర్శకుడిగా నా 25వ ఏడాదిలో, నా సంస్థలో ఆయనతో ‘ఇద్దరు మిత్రులు’ చేశా.నా దగ్గరలేవని కాదు కాని ఆ చిత్రానికి వచ్చిన లాభాలతోనే మా అమ్మాయి పెళ్లి చేశా. అలా… నా జీవితంలో మంచికి, చెడుకి మధ్య అండగా నిలబడ్డాడు. సముద్రమంతలోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం… చిరంజీవి! భారతం రాయాల్సినప్పుడు వ్యాసుడికి వినాయకుడు అవసరమయ్యాడు. చలన చిత్రభారతంలో హీరో చిరంజీవి గురించి రాయాలంటే… ఒక్క వినాయకరావే. అతడికి హ్యాట్సాఫ్’’ అన్నారు.
మాజీ ఎంపి, నటుడుమురళీమోహన్ మాట్లాడుతూ – ‘‘నేను, చిరంజీవి ‘మనవూరి పాండవులు’ చిత్రాల్లో అన్నదమ్ములుగా నటించాం. అప్పుడే ఉన్నతస్థాయికి వస్తారనుకున్నా. ఏదైనా సాధించాలనే కసి ఆయనలో అద్భుతం. గాడ్‌ఫాదర్ లేకున్నా… స్వయంకృషితో ఎదిగారు. చిరంజీవి రాకతో డ్యాన్సులు, ఫైటులు చేసే తీరు మారింది. ఆ రోజుల్లో ఇండస్ట్రీలో సమస్యలు వస్తే పరిష్కరించడానికి దాసరి, రామానాయుడు, డీవీఎస్ రాజు వంటి పెద్దలు ఉండేవారు. ‘వాళ్లు లేని బాధ్యతను మీరు తీసుకొని, సమస్యలు పరిష్కరించాలి’ అని చిరంజీవిని అడిగితే… ‘నాకంటే పెద్దలు చాలామంది ఉన్నార’ని అన్నారు. వయసులో పెద్దరికం కాదు… చేయాలనే మంచి మనసు, సమర్థత ఉండాలని ఆయన్ను బలవంతం చేస్తున్నా’’ అన్నారు.
దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ – `మా అన్నయ్య చిరంజీవి గారిమీద బుక్ రాసినందుకు వినాయకరావు గారికి మనస్ఫూర్తిగా దన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను అన్నయ్య అభిమానిగా ఇండస్ట్రీ కి వచ్చాను. అన్నయ్యతో ఠాగూర్ చేయడానికి ముందు నా మైండ్ సెట్ ఒకలా ఉండేది. ఆతరవాత ఖైదీ నెం 150 చేసేటప్పటికీ మరోలా మారింది. దానికి కారణం ఆయనతో గడిపిన క్షణాలు, ఆయనదగ్గరనుండి నేర్చుకున్న విషయాలు. ఒక్కో పుస్తకంలో ఒక్కో మంచి మాట ఉంటుంది. అన్ని పుస్తకాలలో ఉన్న మంచి మాటల్ని కలిపితే అది మెగాస్టార్ చిరంజీవి. కొన్ని కోట్ల మంది చిరంజీవి గారిని చూస్తే చాలు, ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకుంటారు అలాంటిది రెండు సినిమాలు చేసే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నయ్యలో నెగటివ్ గా ఆలోచించడం అనేదే ఉండదు. ఆ సూపర్ క్వాలిటీ మళ్ళీ చరణ్ కి వచ్చింది. అన్నయ్య ఇంకా గర్వపడే స్థాయికి చరణ్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా“ అన్నారు.
దర్శకుడు బి గోపాల్ మాట్లాడుతూ – “మన సినిమా ఇండస్ట్రీ లో ఒక అద్భుతం, ఒక సెన్సేషన్ చిరంజీవి గారు. మామూలు మనిషిగా స్టార్ట్ అయ్యి మెగాస్టార్ గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఫిలిమ్స్ చేశారు. ఒక గ్రేట్ర్ జర్నీ ఆయనది. ఒక మంచి మనిషి అందరిని బాగా చూసుకుంటాడు. అలాగే మా చరణ్ కూడా పెద్ద హీరో అయ్యాడు చాలా సంతోషం. రంగస్థలం సినిమాలో తన క్యారెక్టర్ ని అద్భుతంగా చేశాడు. చరణ్ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వినాయకరావు నాకు ఎప్పటినుండో పరిచయం చిరంజీవి గారిమీద అద్భుతమైన బుక్ రాశారు. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్.“ అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారితో నాది 40 ఏళ్ల భావోద్వేగ ప్రయాణం. మొదటి 3,4 ఏళ్లు కుటుంబ బంధంతో ఉన్నా… తర్వాత స్నేహితులయ్యాం. ఆయన మంచి మనిషి. రాజకీయాల్లో మంచితనం పనికి రాదని చెప్పా. ‘రాజకీయం వృత్తి. మంచితనం నా ప్రవృత్తి. ప్రవృత్తి కోసం వృత్తిని మార్చుకోమని చెప్పకు’ అన్నారు. నిలువెత్తు మంచితనానికి, కష్టపడి పనిచేసే తత్వానికి ఆయన నిదర్శనం’’ అన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘నా చిన్నతనంలో షూటింగులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చిన నాన్నతో గడపడం తప్ప, ఆయన సినిమాలేంటి? ఎంత కష్టపడ్డారు? వంటివి చూసే అవకాశం మాకు దొరికేది కాదు. నేను సినిమాల్లోకి వచ్చేసరికి, ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ‘ఖైదీ నంబర్ 150’ చేసినప్పుడు నాన్నను కొత్త కోణంలో చూశా. ఆయనకు పారితోషికం ఇవ్వలేని పరిస్థితుల్లో ‘సైరా’ చేశా. లాభాలు వచ్చిన తర్వాత చూద్దామని ఒక్క రూపాయి తీసుకోకుండా చేశారు. ఆయన లేకపోతే ఎన్నో విషయాల్లో మేం లేం. ఇప్పటికీ ‘మాకు ఏం ఇవ్వాలి’ అని ఆయన ఆలోచిస్తుంటారు. ‘టైమ్ దొరికితే అమ్మతో, మాతో ఎక్కువసేపు గడుపరా’ అని ఆయన కోరారు. ఆ వయసులో ఉన్నవాళ్లకు అదెంత ముఖ్యమో నాకు తెలిసింది. నాన్నగారి గురించి నాకు తెలిసింది కొంతే అని ఈ రోజు తెలిసింది. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గర అవుతానని భావిస్తున్నా. ఈ పుస్తకం తీసుకొచ్చిన వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానుల తరపున కృతజ్ఞతలు’’ అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ – ‘‘ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించడానికి శాయశక్తులా కృషి చేశా. మూడేళ్లు కష్టపడి ఈ పుస్తకం తీసుకొచ్చా. ఈ ప్రయత్నంలో అడుగడుగునా అండగా నిలిచిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. ఆరు నెలలుగా స్వామినాయుడు అందించిన సహకారం మరువలేను’’ అన్నారు.