హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఇంట‌ర్వ్యూ

0
759

వరుస సినిమాలతో జోరు మీదున్న దిగంగన సూర్యవంశీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ లేటెస్ట్‌ రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వలయం’, లక్ష్య చదలవాడ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రమేశ్‌ కడుముల దర్శకత్వం వహించాడు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మాత‌. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సంద‌ర్భంగా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఇంట‌ర్వ్యూ.

మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌!
హిప్పీ తరువాత గ్యాప్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నేను తమిళంలో ఒక మూవీ చేయడం రెండవది హిప్పీ చిత్రంలో గ్లామరస్ రోల్ చేశాను కాబట్టి తర్వాత కథా బలం ఉన్నఒక మంచి పాత్ర చేయాలని డిసైడ్ అయ్యాను. ఆ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చింది. నా క్యారెక్ట‌ర్‌కి న‌టించ‌డానికి మంచి స్కోప్ ఉండ‌డంతో ఇప్పుడు వలయంతో మీ ముందుకు వచ్చాను.

అందుకే పోస్టర్ లో కూడా ప్రశ్నార్ధకం!
ఈ చిత్రంలో నాపాత్ర పేరు దిశ. ఒక అమాయకురాలైన గృహిణిగా కనిపిస్తాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని చాలా హ్యాపీ గా ఉంటున్న ఒక జంటలో అనుకోకుండా ఒక రోజు ఆ అమ్మాయి కనిపించకుండా పోతుంది. అప్పుడు రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఆ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా?లేక ఆ అమ్మాయే తన భర్తను మోసం చేసిందా? అనేది కథాంశం. అందుకే పోస్టర్ లో కూడా ప్రశ్నార్ధకాన్ని ఉంచడం జరిగింది.

వలయం టైటిల్ బాగా సూట్ అవుతుంది!
వ‌ల‌యం అంటే మీ అంద‌రికీ తెలుసు. తాను ఎంతగానో ప్రేమించిన భార్య కనిపించడకుండా పోవడంతో, హీరో సమస్యలలో చిక్కుకుంటాడు. ఆయన చుట్టూ ఉన్న వారు త‌న భార్య గురించి తప్పుగా మాట్లాడుతుంటే అసలు నిజంగా ఏమైంది..? అనే కన్ఫ్యూషన్ లో ఉంటారు. అందుకే దీనికి వలయం అనే టైటిల్ పెట్టాము. ఈ కథకు వలయం అనే టైటిల్ చాలా బాగా సూట్ అవుతుంది.

హిప్పీ సినిమాలో ఆడియన్స్ నన్నుయాక్సప్ట్ చేశారు!
కొన్ని విషయాలు మన కంట్రోల్ లో ఉండవు. మనం ఎంత ఎఫ్ఫార్ట్స్ పెట్టినా ఒక్కొక్కసారి ఫలితం దక్కకపోవచ్చు. మనం సినిమా తీసిన విధానం, దానిని ప్రేక్షకులు చూసే కోణం వేరుగా ఉండొచ్చు. హిప్పీ మూవీ సక్సెస్ కాకపోయినా నేను హ్యాపీ గానే ఉన్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆడియన్స్ నన్నుయాక్సప్ట్ చేశారు. అలాగే క్రిటిక్స్ నుండి కూడా నా పాత్ర‌కు పాజిటీవ్ రివ్యూస్ వ‌చ్చాయి.

స్క్రిప్ట్స్ రాయడం అంటే ఇష్టం!
బేసిక్‌గా నేను రైట‌ర్‌ని రెండు సినిమా స్క్రిప్ట్స్ కూడా రాశాను. ఒక‌టి కుటుంబం నేప‌థ్యంలో ఉంటుంది. రెండ‌వ‌ది ట్రావెలింగ్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఉంటుంది. ఈ రెండు క‌థ‌లు నాకు ఎంతో ఇష్టం. నా అభిరుచుల‌తో దగ్గ‌ర‌గా ఉండే ఇద్ద‌రు ముగ్గురు ఫిలిం మేక‌ర్స్‌లో ఆ క‌థలు షేర్ చేసుకోవ‌డం జ‌రిగింది. వారు కూడా పాజిటీవ్ గా స్పందించారు. అలాగే మా పేరెంట్స్ కూడా నువ్వు వరుసగా సినిమాలు ఎందుకు రాయకూడదు అన్నారు. ద‌ర్శ‌క‌త్వం గురించి భ‌విష్య‌త్తులో ఆలోచిస్తాను. ప్ర‌స్తుతానికైతే కథలు , స్క్రిప్ట్స్ రాయడం అంటేనే నాకు ఇష్టం.

`సిటీమార్`లో గోపిచంద్ స‌ర‌స‌న‌!
తెలుగులో మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ సినిమాలు చూస్తుంటాను. వారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వారితో క‌లిసి న‌టించే అవ‌కాశం త్వ‌ర‌గా రావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సిటీమార్ సినిమాలో గోపిచంద్ స‌ర‌స‌న‌ నటిస్తున్నాను. అది కూడా ఒక ఛాలెంజింగ్ రోల్. అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు హీరోయిన్ దిగంగ‌న సూర్య‌వంశి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here