బ్యానర్: శ్రీనిక క్రియేటివ్ వర్క్స్
నటీనటులు: శ్రీపవార్, కృతిగార్గ్, అశోక్ వర్ధన్, తనికెళ్ల భరణి, నర్సింగ్ యాదవ్ తదితరులు
సంగీతం: గ్యాని
కెమెరా: ప్రవీణ్ వనమాలి
ఎడిటర్: శ్యామ్
ఆర్ట్: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అఖిల గంజి
కో డైరెక్టర్: ఎం.శ్రీనివాస్ రాజు
నిర్మాణం: శ్రీనిక క్రియేటివ్ వర్క్స్
దర్శకత్వం: శ్రీపవార్
ప్రేమకథల్లో ఎమోషన్స్ చాలా కీలకంగా ఉంటాయి. వాటి గ్రిప్పింగ్‌గా ప్రేక్షకులు మెచ్చేలా ఎలా తెరకెక్కించామనేదే కీలకం. వెండితెరపై ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అయితే కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణను పొందుతుంటాయి. అందుకు కారణం సదరు దర్శకులు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడమే. అలాగే ప్రేమ కథా చిత్రాల్లో ఉండే లవ్, ఎమోషన్స్‌ను మిస్ కానీయకుండా చూసుకోవడం. ఇప్పుడు అలాంటి ఓ కొత్త తరహా ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాయే `2 అవర్స్ లవ్`. శ్రీపవార్ హీరోగా, దర్శకుడిగా తన స్నేహితులతో కలిసి తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నాడు. దీంతో రూపొందిన ఈ `2 అవర్స్ లవ్` చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
ఇళ్లలోకి చొరబడి దొంగతనం చేసే దొంగ(అశోక్ వర్ధన్) ఓ ఇంట్లోకి దొంగతనం కోసం వెళతాడు. అక్కడ ఓ అమ్మాయి రాసుకున్న డైరీ దొరుకుతుంది. దాన్ని చదువడం స్టార్ట్ చేస్తాడు. దాంట్లో ఆదిత్(శ్రీపవార్), నైనా(కృతిగార్గ్) ప్రేమ కథ ఉంటుంది. వారి ప్రేమ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నైనా వేరే పేరుతో ఆదిత్‌ను ప్రేమిస్తుంది. కానీ ప్రతిరోజూ ఇద్దరూ రెండు గంటలు మాత్రమే ప్రేమించుకుంటారు. కానీ ఆదిత్‌కు నైనా ప్రేమ జీవితాంతం కావాలనుకుంటాడు. అసలు నైనా ఎందుకు పేరు మార్చుకుని ఆదిత్‌ను లవ్ చేస్తుంది. అది కూడా రెండు గంటలు మాత్రమే ఎందుకు లవ్ చేస్తుంది? వీరిద్దరి వెనుకున్న కథేమిటి? డైరీ చదివిన దొంగ ఏం చేస్తాడు? ఆదిత్, నైనాల జీవితాల్లో డైరీ కారణంగా చోటు చేసుకునే పరిణామాలేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
సినిమాకు ప్రధాన బలం హీరో, దర్శకుడు శ్రీపవార్ అనుకున్న మెయిన్ పాయింట్. ఈ పాయింట్ ఏంటో డైరెక్టర్ ఏమీ దాచిపెట్టలేదు. టైటిల్‌లోనే దాన్ని ముందుగానే రివీల్ చేసేశాడు. `2 అవర్స్ లవ్` అసలు 2 అవర్స్ లవ్ ఏంటో తెలుసుకోవాలనే దానిపై కాస్త ఆసక్తిని క్రియేట్ చేశాడు. పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయనడంలో సందేహం లేదు. అసలు హీరో, హీరోయిన్ రెండు గంటలు మాత్రమే ఎందుకు ప్రేమించుకున్నారు? అసలు దాని వెనుక జరిగిన కథేంటనే అంశాలను ఆసక్తికరంగా మలిచాడు శ్రీపవార్. హీరోగా నటిస్తూ దర్శకత్వం చేయడమనేది కాస్త కఠినతరమైన విషయమే. అయినా కూడా శ్రీపవార్ సినిమాను తెరకెక్కించిన తీరు చూస్తే అభినందించాల్సిందే. హీరో, హీరోయిన్ పాత్రలను చక్కగా డిజైన్ చేశాడు. ఏదో చేయాలని ఏదో చేసినట్లు సినిమాలో అనిపించదు. శ్రీపవార్ పక్కా క్లారిటీతో సినిమాను తెరకెక్కించాడు. అసలు దర్శకత్వంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తి సినిమాను తెరకెక్కించిన తీరు చూస్తే ఆశ్చర్యపడతాం. చాలా క్లియర్‌గా అనిపిస్తుంది. ఇక గ్యాని సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు మరో పిల్లర్‌గా నిలబడ్డాయి. అలాగే ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. మినిమం బడ్జెట్ చిత్రానికే ఈ రేంజ్ సినిమాటోగ్రఫీ ఇవ్వడం గొప్ప విషయం. కథకు సంబంధం లేని రెండు, మూడు సన్నివేశాలు, సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపించడం మినహా సినిమా బావుంది. కొత్త తరహా ప్రేమకథలను చూడాలనుకునే వారికి తప్పకుండా నచ్చే సినిమా.
బోటమ్ లైన్: 2 అవర్స్ లవ్… న్యూ ఏజ్ లవ్ స్టోరీ
రేటింగ్: 3/5