కీర్తి శిఖరంపై నిర్మించిన అక్షర సౌధం “ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ”

0
132

ఒక శక్తిగా, వ్యవస్థగా ఎదిగి ప్రజల మనసుల్లో ఒక ప్రగాఢమైన ముద్రను వేసిన వ్యక్తి చరిత్రను అక్షరబద్ధం చేసినప్పుడు దాన్ని చదువుతున్న పాఠకుడుకి ఆ వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తిత్వము, కార్యదక్షత, నిష్పాక్షిక వ్యవహార శైలి కళ్ళ ముందు సాక్షాత్కరించాలి. అలాంటి గొప్ప ప్రయత్నమే “ఎన్టీఆర్ ఏ బయోగ్రఫీ” అనే పుస్తకం.

జాతీయ అంతర్జాతీయ పాఠకులను దృష్టిలో పెట్టుకొని ఆంగ్లంలో రచించిన ఈ పుస్తకం జనవరి 27న మార్కెట్లోకి విడుదలైంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, సకల జన సంక్షేమాభిలాషి ఎన్.టి.రామారావు పట్ల ప్రతిఫలాపేక్షలేనిప్రేమ,అభిమానం కఠోర శ్రమ,అంకిత భావాలతో చేసిన గొప్ప ఆవిష్కరణ ఈ గ్రంధం.

ఎన్నెన్నో గొప్ప లక్షణాలను , సద్గుణాలను తన వ్యక్తిత్వంలో నింపుకున్న నిండైన వ్యక్తిత్వ సౌధం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు. ఆయన జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయాలి అని సంకల్పించి ఆ బృహత్తర సంకల్పాన్ని ఆద్యంతం ఆసక్తిదాయకంగా మలిచారు ఆలిండియా సర్వీసెస్ నుండి రిటైర్ అయిన ఇద్దరు ఉన్నతాధికారులు. వారిలో ఒకరు “రిటైర్డ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ కే. చంద్రహాస్ IRS ” గారు కాగా మరొకరు “ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫౌండర్ డైరెక్టర్” – డాక్టర్ కే.లక్ష్మీనారాయణ IAS గారు.

తమ సుదీర్ఘమైన బ్యూరోక్రటిక్ లైఫ్ లో ఎందరెందరో రాజకీయ ప్రముఖులతో పరిచయాలు, సాన్నిహిత్యాలు కలిగి ఉన్నప్పటికీ సుప్రసిద్ధ నటులు, దర్శక నిర్మాత అయిన ఎన్టీరామారావు పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఆయన జీవిత చరిత్రను అక్షరబద్ధం చేశారు ఈ విశ్రాంత ఉన్నతాధికారులు.

NTR -A Biography – అనే టైటిల్ తో వీరిద్దరూ కలిసి చేసిన ఈ సంయుక్త రచన, సమిష్టి కృషి 636 పేజీల సమగ్ర గ్రంథంగా రూపొందింది. క్రీడా, రాజకీయ, సినీ రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రలు బయోపిక్ ల రూపంలో పుంఖానుపుంఖాలుగా వస్తున్న రోజులివి. ఎన్టీ రామారావు జీవిత చరిత్ర కూడా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే.

కొత్తగా చెప్పిందేమిటీ ?
——————————-

ఇప్పటికే స్వర్గీయ ఎన్టీ రామారావు మీద చాలా పుస్తకాలు వచ్చాయి.. ఇలాంటి తరుణంలో తెరిచిన పుస్తకం లాంటి ఎన్టీఆర్ జీవితం గురించి వీరు కొత్తగా చెప్పబోయే కొత్త సంగతులు ఏమిటి? అందరికీ తెలిసిన ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పగలిగింది ఏమిటి? అనే ప్రశ్న ఉదయించడం సహజం.

ఈ ప్రశ్నను పాఠకులు సంధించక ముందే తమ మీద తామే సంధిoచుకొని “ఎస్.. ఎన్టీ రామారావు గారి గురించి తమకు తెలిసినంత కంటెంట్ మరెవరికీ తెలియదు… కొందరికి కొన్ని విషయాలు తెలిసినప్పటికీ అవి ఏవి సమగ్రంగా గ్రంధస్థం చెయ్యబడలేదు. కాబట్టి తమకు తెలిసిన సమాచారాన్ని, వివరాలను, విషయాలను, విశేషాలను క్రమపద్ధతిలో అమర్చి ఒక సమగ్ర అక్షర చిత్రీకరణను ఆవిష్కరించాలి అనే లక్ష్యంతో కే.చంద్రహాస్- కే. లక్ష్మీనారాయణ ఈ జాయింట్ అకడమిక్ వెంచర్ కు శ్రీకారం చుట్టారు.

ఇది 636 పేజీల ఉద్గ్రంథమే అయినప్పటికీ అత్యంత ఖరీదైన వెయిట్ లెస్ పేపర్ వాడటం వల్ల పుస్తకాన్ని చాలా తేలికగా, హ్యాండీగా రూపొందించడాన్ని ముందుగా ప్రస్తావించి అభినందించాలి.

ఇక ఈ పుస్తకంలోని పఠనా0శాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వెళితే –
ఈ పుస్తక రచనా వ్యాసంగం ఏదో హ్యాబీ కోసమో , గుర్తింపు కోసమో, డబ్బు కోసమో చేసిన ప్రయత్నం కానే కాదు అనిపిస్తుంది. ఈ పుస్తక రూపకల్పన వెనుక దశాబ్దాల అనుభవం, అభిమానమూ , పరిశీలన, విమర్శనా దృష్టి, చారిత్రక ఆధార సేకరణ అన్నింటినీ మించి ఎన్టీ రామారావు అనే ఒక గొప్ప వ్యక్తితో కలసి పనిచేసిన తాలూకు అనుబంధం దర్శనీయమవుతాయి.

ఎన్టీఆర్ బాల్యం, చదువు, వివాహం, ఉద్యోగం వంటి పూర్వ సమాచారం మొత్తానికి అద్భుతంగా అక్షరరూపమిస్తూ రూపొందించిన సమగ్ర జీవిత చరిత్రే ” ఎన్టీఆర్- ఏ బయోగ్రఫీ” అనే ఈ పుస్తకం.

గొప్ప ఆవిష్కరణ
————————

దశాబ్దాల గొప్ప ప్రస్థానాన్నిసమగ్రంగా, సవివరంగా, నాన్-ఫిక్షనల్ గా చెప్పటానికి అనుమతించని రెండున్నర గంటల విజువల్ మీడియా సినిమా అయితే ఎంతైనా రాయటానికి, ఎంతైనా చెప్పటానికి , వర్ణనలకు,అభివర్ణనలకు ,సమగ్ర సమాచార సహిత వివరణలకు, విశేషాలకు అవకాశం ఉండే కంఫర్టబుల్ మీడియా ప్రింట్ మీడియా.

అలాంటి ప్రింట్ మీడియాలో ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పేస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను చక్కగా వినియోగించుకుంటూ “ఎన్టీఆర్” జీవితంలోని సమస్త విశేషాలను, వివరాలను, పరిణామాలను, వాటి ప్రభావాలను చాలా అర్థవంతంగా ఆవిష్కరించారు ఈ విశ్రాంత ఉన్నతాధికారులు.

మచ్చుకు కొన్ని విశేషాలు చూద్దాం:
———————————————-
* ఎన్టీఆర్ కు “మన దేశం” చిత్రంలో తొలి అవకాశం కల్పించింది ఎల్.వి ప్రసాద్ అన్న విషయం అందరికీ తెలుసు. అయితే అంతకుముందే ఎన్టీఆర్ ను “వింధ్యరాణి” చిత్రంలో హీరోగా నటింపజేయడానికి ప్రముఖ దర్శక నిర్మాత సి.పుల్లయ్య తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అంతకుముందే ఇంటర్మీడియట్ రెండుసార్లు తప్పి మూడవ attempt లో పాస్ అయిన ఎన్టీఆర్ డిగ్రీ పూర్తయ్యేదాకా ఎక్కడికి వచ్చేదిలేదని
పి.పుల్లయ్య అంతటి దర్శకుడి ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. ఇది చాలామందికి తెలియని విశేషం.

* సినిమాల్లోకి రాకముందుఎన్టీఆర్ బాంబే వెళ్లి అక్కడ “ఆంధ్ర మెస్” అనే హోటల్ పెట్టి కొద్ది రోజులు రన్ చేశారు. ఇది ఎవరికీ తెలియని విశేషమే.

* ఎన్టీఆర్ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేయడం కంటే ముందు అమీన్ ఉద్యోగం చేశారు. అంటే కోర్టులో నిందితుల పేర్లను మూడుసార్లు పిలిచే ఉద్యోగం. కేవలం11 రోజులు చేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఎన్టీఆర్. ఇది కూడా చాలా మందికి తెలియదు.

* సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ రకరకాల పనులు చేశారు. హోటల్స్ కు పాలు పోయటం, కోర్టులో 11రోజుల అమీన్ ఉద్యోగం చేయడం, బబ్బురి వెంకయ్య అనే ఒక పార్ట్నర్ తో కలిసి పొగాకు, బీడీ,సిగరెట్ల హోల్ సేల్ షాపు నడపటం వంటి పనులు చేసి తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవారు ఎన్టీఆర్.

* ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తమ ఇంట్లో అద్దెకుండే సూర్యనారాయణ అనే అతని పెద్ద కూతురుతో ఎన్టీఆర్ కు “ఫస్ట్ క్రష్” ఏర్పడింది. అది గమనించి పెద్దలు మందలించడంతో ఆ ‘తొలిప్రేమ’ జ్ఞాపకంగానే మిగిలిపోయింది.

సినిమాలకు సంబంధించినంత వరకు ఇలాంటి ఎన్నెన్నో వివరాలను, విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు .

ఇక రాజకీయ రంగంలోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ తెచ్చిన మార్పులు, చేపట్టిన సంస్కరణలు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలు వంటి సమస్త విషయాలకు, పరిణామాలకు ప్రత్యక్ష సాక్షులుగానే కాకుండా వాటన్నింటి అమలును పర్యవేక్షించిన ఉన్నతాధికారులే రచయితలు కావటం వల్ల ఈ పుస్తక పారదర్శకతను ప్రశ్నించే అవకాశమే లేదు.

ఎన్టీరామారావు అంతటి ఒక సంచలనాత్మక వ్యక్తి చరిత్రను అక్షరబద్ధం చేస్తున్నప్పుడు ఏ ఒక్క విషయంలోనూ తాత్సార, నిర్లక్ష్య ధోరణులు కూడదు అనే సంకల్ప శుద్ధి ఈ పుస్తకంలోని ప్రతి పేజీ లోనూ కనిపిస్తుంది.

5 భాగాలు- 110 అధ్యాయాలు
————— ————————–

రచనకు ఉపక్రమించే ముందే చరిత్ర క్రమాన్ని ఎలా రూపొందించుకోవాలి, ఎన్ని భాగాలుగా, ఎన్ని అధ్యాయాలుగా విభజించుకోవాలి,ఏ భాగంలో ,ఏ అధ్యాయంలో ఏ ఏ విషయాలు పొందుపరచాలి అనే గొప్ప వ్యూహాత్మక కృషి కనిపిస్తుంది.

*ఐదు భాగాలుగా వర్గీకరించబడిన ఈ పుస్తకంలో మొత్తం 110 అధ్యాయాలున్నాయి.
పార్ట్ 1 లోని 36 అధ్యాయాలలో ఎన్టీఆర్ బాల్యం నుండి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపన వరకు గల చరిత్రను సమగ్రంగా వివరించడం జరిగింది.

* 1982 నుండి 1985 వరకు జరిగిన రాజకీయ పరిణామాలు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం, సంచలన రాజకీయ నిర్ణయాలు వంటి అంశాలను 31 అధ్యాయాల రెండవ భాగంలో వివరించారు.

* 1985 నుండి 1989 వరకు జరిగిన రాజకీయ పరిణామాలను, ముఖ్యమంత్రి హోదాలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమ వివరాలతో కూడిన విశేషాలను 26 అధ్యాయాల మూడవ భాగంలో పొందుపరిచారు.

*1989 నుండి 1994 వరకు ప్రతిపక్ష నాయకులుగా ఉంటూనే జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించి నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన నాటి విశేషాలను 5 అధ్యాయాల నాలుగవ భాగంలో వివరించారు.

* ఇక 12 అధ్యాయాల చివరిదైన 5 వ భాగం లో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం, 94 ఎన్నికలలో ఇద్దరి సంయుక్త ప్రచారం, మరల ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణస్వీకారం , రాజకీయ సంక్షోభం, పదవీచ్యుతి, తదనంతర పరిణామాలను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు చంద్రహాస్, లక్ష్మీ నారాయణ.

పారదర్శకత – పఠనాసక్తి
– – – – – – – – – – – – – – – – – – – –

ఒక గ్రంథాన్ని వెలుగులోకి తేవడం అంటే అందులో గొప్ప కంటెంట్ రాసినంత మాత్రాన అది గొప్ప పుస్తకం కాలేదు. గ్రంథస్థమైన విషయాలలో వాస్తవికత, పారదర్శకత, పఠనాసక్తితో పాటు పుస్తకం రూపురేఖలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. కవర్ పేజి, పేజినేషన్, ఫోటో ప్లేస్మెంట్స్, ప్రూఫ్ రీడింగ్, ఫాంట్ సైజు – ఇలా ఏ చిన్న విషయాన్ని take it as granted గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. “ఎండింగ్ ఆఫ్ ఏ చాప్టర్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ఏ చాప్టర్” మధ్య గొప్ప ఉత్సుకతను రగిలించే సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ గురించి వర్ణన ఉండాలి.

ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని అత్యంత శ్రద్ధాసక్తులతో రూపొందించిన ఒక చక్కని ఆవిష్కరణ “ఎన్టీఆర్ – ఏ బయోగ్రఫీ” .

సినీ రాజకీయ రంగాలకు చెందినవారే కాకుండా జనసామాన్యంలో కూడా ప్రతి ఒక్కరు చదువవలసిన “ఎన్టీఆర్ సమగ్ర జీవిత చరిత్ర” ఇది.

IRS- IAS వంటి ఉన్నత చదువులు చదివి, అత్యున్నత పదవులు నిర్వహించి ప్రశంసలే తప్ప అభిశంసన లెరుగని ఉన్నతాధికారులు
కే. చంద్రహాస్, కే.లక్ష్మీనారాయణల కృషి అభినందనీయం. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడు కావడంతో దేశమంతటా ఆయన అభిమానులు ఉన్న నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో రచించడం జరిగింది. త్వరలో దీని తెలుగు అనువాదాన్ని కూడా వెలువరిస్తున్న చంద్రహాస్- లక్ష్మీనారాయణ గార్లకు అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here