హృషికేష్, నరైన్, మియాజార్జ్, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం రమ్. హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మంత్రిగారి బంగళాపేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. బేబీ త్రిష సమర్పకురాలు. సాయి భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రతి సన్నివేశం ఉత్కంఠను పంచుతుంది. తన బాణీలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సునీల్ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న మియాజార్జ్ మంత్రిగారి బంగళాలో కీలక పాత్రను పోషించనుంది. సంచితశెట్టి, మియాజార్జ్‌ల అభినయం, గ్లామర్ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. ఇటీవలే తమిళంలో విడుదలైన ఆడియోకు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తోంది. తెలుగు ఆడియోను జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. వివేక్ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, సినిమాటోగ్రఫీ: విఘ్నేష్ వసు, పాటలు: వెనిగండ్ల శ్రీరామమూర్తి, శివగణేష్, మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, నిర్మాత: మల్కాపురం శివకుమార్, సమర్పకురాలు: బేబీ త్రిష.